తెలుగులో వార్-2 ఊహించని రికార్డు..!
on May 25, 2025
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్-2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. అంతేకాదు, వార్-2 టీజర్ తెలుగు వెర్షన్ ఒక రికార్డును ఖాతాలో వేసుకుంది.
'వార్-2' టీజర్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా హిందీలో తెరకెక్కుతుండగా.. ఇతర భాషల్లోకి డబ్ అవుతోంది. అయితే ఇందులో ఎన్టీఆర్ భాగం కావడంతో.. హిందీ స్థాయిలోనే తెలుగు టీజర్ రెస్పాన్స్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, మొదటి 24 గంటల పరంగా వార్-2 తెలుగు టీజర్ కి ఎన్టీఆర్ స్థాయికి తగ్గ రికార్డు వ్యూస్ రాలేదు. దీంతో అందరూ షాకయ్యారు. అయితే స్టార్ట్ ఎలా ఉన్నా సౌండ్ మాత్రం గట్టిగా ఉంది అన్నట్టుగా 'వార్-2' టీజర్ దూసుకుపోతోంది. వార్-2 తెలుగు టీజర్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో టాప్-1 గా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 120 గంటలు(ఐదు రోజులు) పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈమధ్య కాలంలో ఇన్ని గంటల పాటు ట్రెండింగ్ లో ఉన్న టీజర్ ఇదే అంటున్నారు. ఓ డబ్బింగ్ సినిమా టీజర్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే.. కేవలం ఎన్టీఆర్ తోనే సాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
