ENGLISH | TELUGU  

‘వార్‌2’ మూవీ రివ్యూ

on Aug 14, 2025

నటీనటులు: హృతిక్‌ రోషన్‌, ఎన్‌.టి.ఆర్‌, కియారా అద్వాని, అనిల్‌ కపూర్‌, అశుతోష్‌ రాణా తదితరులు
సంగీతం: ప్రీతమ్‌
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సంచిత్‌ బల్‌హారా, అంకిత్‌ బల్‌హారా
సినిమాటోగ్రఫీ: బెంజిమన్‌ జాస్పర్‌
ఎడిటింగ్‌: ఆరిఫ్‌ షేక్‌
కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా
బ్యానర్‌: యశ్‌రాజ్‌ ఫిలింస్‌
స్క్రీన్‌ప్లే: శ్రీధర్‌ రాఘవన్‌
దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ
సినిమా నిడివి: 171.44 నిమిషాలు
విడుదల తేదీ: 14.08.2025

టాలీవుడ్‌ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్‌కి వెళ్లి విజయాలు సాధించారు. తాజాగా ‘వార్‌2’ చిత్రంతో ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. దీంతో ‘వార్‌2’ చిత్రానికి సౌత్‌లో మంచి క్రేజ్‌ వచ్చింది. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బేనర్‌పై స్పై యూనివర్స్‌ సిరీస్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ యాక్షన్‌ ప్యాక్డ్‌గానే ఉంటాయి. అలాగే వార్‌2 కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందిన సినిమా అనే విషయం ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుంది. ఎన్టీఆర్‌ తొలిసారి హిందీలో ఇంట్రడ్యూస్‌ అయిన వార్‌2 ఎలా ఉంది? ఎన్టీఆర్‌ అభిమానులు పండగ చేసుకునేలా ఉందా? ఓవరాల్‌గా ‘వార్‌2’ చిత్రం ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్‌ అయింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

కథ :

యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించే స్పై యూనివర్స్‌ సినిమాల్లో దాదాపు ఒకే కథ రన్‌ అవుతూ ఉంటుంది. అదేమిటంటే.. కొన్ని దుష్ట శక్తుల్ని అంతం చేసే రా ఏజెంట్‌గా హీరో కనిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో విలన్స్‌లోనే కలిసిపోయి నెగెటివ్‌గా కనిపిస్తూ వారిని అంతం చేస్తుంటాడు. కానీ, వార్‌2 కథలో మాత్రం కొన్ని మార్పులు కనిపిస్తాయి. కొన్ని దేశాలు కలిసి ఒక టీమ్‌లా ఏర్పడి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్‌ చేస్తుంటాయి. ఆ టీమ్‌ పేరు ‘కలి’. రా ఏజెంట్‌గా పనిచేస్తున్న కబీర్‌(హృతిక్‌ రోషన్‌)పై దేశద్రోహి అనే ముద్ర ఉంటుంది. ఆ కారణంగా అతన్ని పట్టుకోవాలని అధికారులు విశ్వప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో కలి టీమ్‌తో చేతులు కలుపుతాడు కబీర్‌. అతనికి అప్పగించిన మొదటి ఆపరేషన్‌ కల్నల్‌ లూద్రా(అశుతోష్‌ రాణా)ను చంపడం. తన తండ్రిలా భావించే లూద్రాను కాల్పి చంపుతాడు కబీర్‌. దీనిపై ఎంతో సీరియస్‌ అయిన ‘రా’ లూద్రా హత్యకు సంబంధించి విచారణ చేపడుతుంది. అలాగే కబీర్‌ను పట్టుకునేందుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా విక్రమ్‌(ఎన్టీఆర్‌)ను నియమిస్తుంది. అలా కబీర్‌, విక్రమ్‌ల మధ్య ఛేజ్‌ మొదలవుతుంది. ఈ క్రమంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటాయి. విక్రమ్‌ క్యారెక్టర్‌ కూడా రకరకాల మలుపులు తిరుగుతుంది. కబీర్‌, విక్రమ్‌ మధ్య కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయి. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి? చివరికి కబీర్‌ను విక్రమ్‌ పట్టుకోగలిగాడా? కథ ఎలా మలుపు తిరిగింది? కలి పన్నాగాలను కబీర్‌ అరికట్టగలిగాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ: 

ఇప్పటివరకు ఎన్టీఆర్‌ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమాగా చెప్పొచ్చు. సినిమా రిలీజ్‌ ముందు వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ గెస్ట్‌గా నటించాడని, అతని క్యారెక్టర్‌ సెకండాఫ్‌లోనే ఎంటర్‌ అవుతుందని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌.. హృతిక్‌ రోషన్‌ క్యారెక్టర్‌కి సమానంగా మొదటి నుంచి చివరి వరకు నడుస్తుంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్‌ అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌లో అతనికి ఇచ్చిన బిల్డప్‌, సైతాన్‌ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగున్నాయి. కథ కంటే ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఛైల్డ్‌ ఎపిసోడ్‌తో ఆడియన్స్‌ని కొంత ఎమోషనల్‌ చేసే ప్రయత్నం జరిగింది. ఈ తరహా సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌లు కాస్త ఓవర్‌గానే కనిపిస్తాయి. ఈ సినిమాలో ఆ మోతాదు మరింత పెరిగిందని చెప్పాలి. లెంగ్తీగా ఉండే ఛేజ్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లను భరించే స్థితిలో ఇప్పుడు ప్రేక్షకులు లేరనేది వాస్తవం. కానీ, ఈ సినిమాలో అవి విపరీతంగా ఉండడంతో కథ తక్కువ, యాక్షన్‌ ఎక్కువ అన్నట్టుగా తయారైంది. కథ విషయంలో డైరెక్టర్‌ ఎంతో వెసులుబాటు తీసుకున్నట్టు కనిపించింది. వీలైనన్ని ఎక్కువ సార్లు కథని మలుపు తిప్పేందుకు, ట్విస్టులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఎన్టీర్‌, హృతిక్‌ మధ్య వచ్చే పాటను బాగా తీశారు. ఇద్దరూ తమ స్టెప్పులతో అదరగొట్టారు. అయాన్‌ ముఖర్జీ టేకింగ్‌ కూడా బాగుంది. ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌లోనే కథ ఎక్కువ రన్‌ అయింది. ఎమోషన్స్‌ కూడా సెకండాఫ్‌లోనే కనిపిస్తాయి. 

నటీనటులు: 

వార్‌ చిత్రంలో ఆల్రెడీ హృతిక్‌ రోషన్‌ చేశాడు. ఆ సినిమాలోని కబీర్‌ క్యారెక్టర్‌కి ఇది కంటిన్యూయేషన్‌. హృతిక్‌ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశృాడు. పాటల్లో, యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదే స్పీడ్‌తో కనిపించాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్‌కి ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యడం ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అని చెప్పాలి. ఎన్టీఆర్‌ డాన్సుల గురించి, ఫైట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులోని ఫైట్స్‌ టేకింగ్‌ కొంత డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ వాటిని అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశారు ఎన్టీఆర్‌. హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో తనదైన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి హీరోయిన్‌ లేదు. హృతిక్‌ రోషన్‌కి జంటగా కియారా అద్వానీ నటించింది. అయితే ఫస్ట్‌ హాఫ్‌ పూర్తయ్యే వరకు హృతిక్‌తో తనకెలాంటి సంబంధం లేదు అనేలా ఆమె క్యారెక్టర్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో అది రివీల్‌ అవుతుంది. ఆమె క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన ప్రదర్శించింది. ఇక అశుతోష్‌ రాణా, అనిల్‌కపూర్‌ తమ క్యారెక్టర్‌ పరిధి మేరకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు : 

ఈ సినిమా టెక్నీషియన్స్‌లో మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ బెంజిమన్‌ జాస్పర్‌ గురించి. ప్రతి సీన్‌ని అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో కెమెరాతో ఒక ఆటాడుకున్నాడు. వివిధ యాంగిల్స్‌లో చిత్రీకరించిన ఆ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసేలా ఉన్నాయి. ప్రీతమ్‌ సంగీతం సమకూర్చిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. సంచిత్‌, అంకిత్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అక్కడక్కడా బాగుంది. అయితే కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లలో వచ్చే మ్యూజిక్‌ మరీ గందరగోళంగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాకి ఫాస్ట్‌ ఎడిటింగ్‌ అనేది ఎంతో అవసరం. కొన్నిచోట్ల అవసరానికి తగ్గట్టుగా చేసినప్పటికీ మరికొన్ని సీన్స్‌లో సాగతీత ధోరణి కనిపించింది. ఇక డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ టేకింగ్‌ బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లను బాగా డిజైన్‌ చేశారు. హృతిక్‌ రోషన్‌ కంటే ఎన్టీఆర్‌ పైనే అయాన్‌ ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపించింది. స్పై యూనివర్స్‌లో సినిమాలు ఎలా ఉంటాయో ఆ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు అయాన్‌ ముఖర్జీ కృషి చేశాడు.

ఫైనల్‌గా చెప్పాలంటే..: 

టాలీవుడ్‌  ప్రేక్షకులకు ఈ తరహా స్పై యూనివర్స్‌కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా పరిచయం ఉండదు. ఇక ఎన్టీఆర్‌ సినిమా అంటే ఇలా ఉండాలి అని ప్రేక్షకులు, అభిమానులు ఫిక్స్‌ అవుతారు. యాక్షన్‌ సినిమాలు, థ్రిల్‌ చేసే ఛేజ్‌లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎన్టీఆర్‌ అభిమానులకు మాత్రం ఈ సినిమా నిరాశనే మిగిల్చే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌, అతని పెర్‌ఫార్మెన్స్‌ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఒక విధంగా ఎన్టీఆర్‌కి ఇది బాలీవుడ్‌లో మంచి ఎంట్రీ అనే చెప్పాలి. 

రేటింగ్‌: 2.75/5

-  జి.హరా

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.