ఒక అభిమానిగా `మహర్షి` కోసం ఎదురుచూస్తున్నా- విజయ్
on May 2, 2019
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటో ఇటీవల కాలంలో మన అందరికీ తెలిసిందే. అయితే మహేష్ సినిమా ఫంక్షన్ కే ముఖ్య అతిథిగా రావడం అంటే మామూలు విషయం కాదు. అతి తక్కువ సమయంలో ఇంత క్రేజ్ తెచ్చుకున్న స్టార్ అంటే కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే అనడంలో సందేహం లేదు. ఇక హైదరాబాద్ లో బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...``నేను ఇంటర్మీడియట్ నుండి మహేష్ బాబుగారికి పెద్ద ఫ్యాన్ ని. అందుకే ఆయన్ని సార్ అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేము కాలేజ్ లో ఉన్నప్పుడు మావాడు అని అనుకునేవాళ్లం. ఆయన 25 వ సినిమా. ఇదొక జర్నీ. జర్నీ ఆఫ్ రిషి. కోణార్క్ లో మహేష్ బాబు సినిమాలు చూడాలనుకునే వాడిని.కానీ, మాస్ ఫ్యాన్స్ కారణంగా టికెట్స్ దొరికేవి కావు. చివరకు లేడీస్ క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్ సమయంలో నా కజిన్స్ ద్వారా టికెట్స్ తీసుకునేవాడిని. అలా యాక్టర్ అయిన తర్వాత ఓ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్లాను. అక్కడకు మహేష్ గారు రాగానే ఆయన్ను అందరూ విష్ చేయడం చూసి అరె! లైఫ్ అంటే అలా ఉండాల్రా అనుకున్నాను. నేను చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలపై మహేష్ గారు ట్వీట్ చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వారు ట్వీట్ చేసేలా మంచి సినిమాలు చేస్తాను. నా పుట్టిన రోజు మహర్షి సినిమా విడుదలవుతుంది. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మే 9 కోసం ఒక ఫ్యాన్ గా, యాక్టర్ గా ఎదురు చూస్తున్నా`` అన్నారు.