కొత్త ఆశలు రేపుతున్న 2023!
on Jan 11, 2023

గత ఏడాది దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా చిత్రాల హవా కొనసాగింది. బాలీవుడ్ ని మన సౌత్ ఇండియన్ చిత్రాలు డామినేట్ చేశాయని చెప్పాలి. కనివినీ ఎరుగని రేంజిలో అవి సక్సెస్ లను రుచిచూసి రికార్డులు బద్దలు కొట్టాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 కాంతారా, పుష్ప ది రైజ్, కార్తికేయ2, హిట్2.... వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక టాలీవుడ్ పరంగా చూస్తే ఈ కొత్త ఏడాది హీరోలంతా ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు. సంక్రాంతి నుండి మొదలయ్యే సమరం డిసెంబరు వరకు కొనసాగనుంది.
సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలు రిలీజ్ అవుతున్నాయి. కోలీవుడ్ హీరోల వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం వంటి చిత్రాలు కూడా విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈ పండగ సీజన్ ముగియగానే సమ్మర్ సీజన్ మొదలైపోతుంది. వేసవి సెలవులు కలిసి వస్తాయి కాబట్టి చిరంజీవి బోళా శంకర్, బాలయ్య- అనిల్ రావిపూడి తో చేస్తున్న 108 చిత్రాలు కూడా వేసవికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్కినేని అభిమానులు మోస్ట్ అవైటెడ్ మూవీ గా భావించిన అఖిల్ ఏజెంట్ కూడా సమ్మర్ కే రానుందని సమాచారం. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్, ఆది పురుష్ చిత్రాలు ఈ ఏడాదే విడుదలకు ముస్తాబవుతూ రేసులో ఉన్నాయి. ముందుగా ఆది పురుష్ సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఇదే ఏడాది సలార్ ని కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలవుతున్నాయి. కాబట్టి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇక మహేష్ బాబు నటించిన 28వ సినిమా కూడా ఇదే ఏడాది సందడి చేయనుంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ డేటును లాక్ చేసిందని అంటున్నారు.
కానీ ఆ తేదీకి రిలీజ్ కష్టమే అయినా ఏడాది ముగిసేలోగా ప్రేక్షకులకు ముందుకు రావడం ఖాయం అంటున్నారు. ఇక ఆర్సి 15 సినిమా డిసెంబర్‌లో రావచ్చని తెలుస్తోంది. మిస్ అయితే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తుంది. పుష్ప2 అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేయగలిగితే ఇదే ఏడాది చివర్‌లో అంటే పోయినసారి పుష్ప 1 వచ్చిన డిసెంబర్ నాటికి ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావచ్చని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇదంతా దర్శకుడు సుకుమార్ చేతుల్లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది. తేడా వస్తే దసరా నాటికి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోల్లో నాని నటిస్తున్న దసరా, నాగచైతన్య కస్టడీ, రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, రామ్-బోయపాటి పాన్ ఇండియా సినిమా ఇదే ఏడాది బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయనున్నాయి. యంగ్ టైగర్ మాత్రం 2023లో మౌనాన్ని వహించాల్సిందే. ఇప్పటికే టైగర్ 30 సినిమా 2024 ఏప్రిల్ లో విడుదల చేస్తామని అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి 2023 భారీ బడ్జెట్ సినిమాల తో బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అన్న తీరులో హీరోలు బరిలోకి దిగుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



