ENGLISH | TELUGU  

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

on Dec 30, 2025

 

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

 

స్రవంతి రవికిషోర్: ఈ ఫిల్మ్‌ షూటింగ్ సెట్స్‌కి నువ్వు ఎక్కువగా వచ్చేవాడివి కదా?
త్రివిక్రమ్: ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’ ఒకేసారి రాశాను. అందుకే ఆ సెట్స్‌కి ఎక్కువగా వెళ్ళలేదు. ‘నువ్వే కావాలి’లో షుక్రియా పాట షూటింగ్, క్లైమాక్స్ చిత్రీకరణ టైంకి వచ్చాను. ‘నువ్వు నాకు నచ్చావ్’ కి మాత్రం ఎక్కువ శాతం షూటింగులకు వచ్చాను. న్యూజిలాండ్ కూడా వెళ్లాం కదా. డబ్బింగ్ టైంలో కూడా ఉన్నాను. 

 

స్రవంతి రవి కిషోర్ : ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్‌ని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం. నువ్వు డిక్షన్‌తో సహా డైలాగ్స్ చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ అని ఫిక్స్ అయిపోయాం.  సినిమాలోని సీన్లలో ఆయన్ను కాకుండా ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం.
త్రివిక్రమ్ : అవును. ఆ 22 సీన్లు.. నాకు గుర్తుంది. నానక్ రాం గూడలో ఇంటి సెట్ వేశారు. ఫస్ట్ రోజు ప్రకాష్ రాజ్ సెట్‌కి వచ్చారు. ఆ 22 సీన్లను నెరేట్ చేస్తుంటే.. ఆయనకు అప్పుడు తెలుగు రాదు. కన్నడలోనే మొత్తం సీన్లు, డైలాగ్స్ రాసుకున్నారు.  

 

స్రవంతి రవి కిషోర్ : ఇదొక అద్భుతమైన ప్రయాణం. శాస్త్రి గారి గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే
త్రివిక్రమ్: నాకు బాగా గుర్తుంది ఏంటంటే.. నాకు మీరు మద్రాస్ నుంచి ఫోన్ చేశారు.. ‘ఓ నవ్వు చాలు’ అనే పాట గురించి చెప్పారు. పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా? ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా...

 

స్రవంతి రవి కిషోర్ : ఆయన అన్నింటికీ అలానే రాస్తారు. ఈ పాటను ఊటీలో షూట్ చేయాలి. అప్పుడే న్యూజిల్యాండ్ నుంచి వచ్చాం. వర్క్ అంతా నాన్ స్టాప్‌గా చేస్తున్నాం. అవతల కోటి స్టూడియోకి శంకర్ మహదేవన్ వచ్చి ఉన్నారు. నేనేమో ఇటు ఒత్తిడి చేయలేను. మనకు కావాల్సింది పాట కాదు.. మంచి పాట. ఏం చేయాలి? ఈ పాట ఆపేయాల్సి వస్తుందా? అని రకరకాలుగా అనుకున్నాను. అరేయ్.. ఆగురా.. పాట వచ్చింది అని కార్లో బయల్దేరాం. కారులోనే పల్లవి రాసుకుంటూ వచ్చాం. అందుకే ఆయన ఫైల్స్ లో పల్లవి అంతా కనిపించదు.. 
త్రివిక్రమ్: ఆ..ఆ.. అవును.. ఆ కురులు చీకట్లో చిక్కుకుని అని ఉంది.. దాన్ని తరువాత కంప్లీట్ చేశారు.. ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా అని..

 

స్రవంతి రవికిషోర్ : తను చాలా రకరకాలుగా రాసి అక్కడ పెట్టేవాళ్లు.. ఇటివ్వు అని.. వాలు జడ బాగుంది కదా? దీనితో ఎందుకు రాదు?..
గాలిపటం గగనానిదా? బాగుంది కదా? పాట అయిపోయింది కదా?.. అనేవాళ్లం. ముందు చరణం కంప్లీట్ చేశారు.. ఆ తరువాత పల్లవి పూర్తి చేశారు.
త్రివిక్రమ్ : చాలా నోస్టాల్జిక్‌గా ఉంది…ఇలా వెనక్కి వెళ్తుంటే.

 

స్రవంతి రవికిషోర్ : ఈ పేపర్స్ యోగేశ్వర్ శర్మ తీసుకుని వచ్చి ఇస్తే..  శాస్త్రి గారు చేత్తో పట్టుకున్న కాగితాలు కదా? అని ఎంతో ఎమోషనల్ అయ్యాను.. చాలా తొందరపడ్డాడు..
త్రివిక్రమ్ : పాటలు లేటుగా ఇచ్చారు కానీ.. మనిషి ఎర్లీగా ఎళ్లిపోయారు.

 

స్రవంతి రవికిషోర్ : ఈ చిత్రం ఇంత బాగా రావడానికి వెంకటేష్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆర్టిస్టుగా ఎంతో అద్భుతంగా చేశారు.
త్రివిక్రమ్ : మొత్తం డైలాగ్ వెర్షన్ అయిన తరువాత రెండు మూడుసార్లు రీడింగ్ తీసుకున్నారు. అంతలా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అంతలా లోపలకు ఇంజెక్ట్ చేసుకుని చేశారు.

 

స్రవంతి రవికిషోర్ : నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆఖరి రోజున ట్రైన్ ట్రావెల్ సీన్ చేశాం. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు బయల్దేరి తిరిగి రావాలి
త్రివిక్రమ్ : అంటే ఫస్ట్ సీన్‌ను లాస్ట్ తీశారా?
స్రవంతి రవికిషోర్ : హా.. అవును.. ఈ రోజే ఆఖరి రోజు కదా? గుమ్మడి కాయ కొట్టేస్తున్నాం. అప్పుడే అయిపోయిందా? కిషోర్.. అని అన్నారు. మేం 85 రోజుల్లో షూట్ చేశాం. మొత్తం మూడు గంటల 14 నిమిషాల నిడివి వచ్చింది. 
త్రివిక్రమ్ : ఫైనల్‌గా మూడు గంటలకు తీసుకు వచ్చారా? (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ :  మూడు గంటల తొమ్మిది నిమిషాలతో రిలీజ్ చేశాం.

 

స్రవంతి రవికిషోర్ : సినిమా రిలీజ్ అయినప్పుడు సుహాసిని సీన్లు ఎంత కాంట్రవర్సీ అయ్యాయ్.
త్రివిక్రమ్ : మీరొక్కరే భయపడలేదు. నేను అయితే ఆ సీన్లను కట్ చేసేద్దామని అన్నాను. ఏం కాదు ఏం కాదు.. ఈ వారం రోజులు వదిలేయ్ చెప్తాను అన్నారు (నవ్వుతూ). అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా.. రాత్రి పదకొండు, పదకొండున్నరకు ఫోన్లు చేసి ప్రతీ డైలాగ్ గురించి ఫోన్ చేసి బాగుందని ఫీల్ అయి చెప్పేవారు.
స్రవంతి రవికిషోర్ : నువ్వు కూడా మంచి డైలాగ్ రాస్తే అలానే చెప్పేవాడివి. గుండెలో మాట కళ్లలో చూడాలి.. అమ్మ ఆవకాయ్ అంజలి.. ఇలా మంచి డైలాగ్స్ అన్నీ కూడా ఫోన్ చేసి చెప్పేవాడివి.

 

స్రవంతి రవికిషోర్ : ఈ సినిమా చాలా మందికి స్ట్రెస్ బస్టర్ సర్..
త్రివిక్రమ్ : రామానాయుడు స్టూడియోలో నాయుడు గారి ఫ్యామిలీకి ఈ మూవీని ప్రివ్యూ వేశాం. వెంకటేష్ గారి సతీమణి ఈ మూవీ గురించి మాట్లాడారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో.. ఈ మూవీ గురించి రానున్న తరాలు మాట్లాడుకుంటాయి అని అన్నారు. ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ రీ విజిట్ చేస్తారని అన్నారు. కానీ నేను అప్పుడు నమ్మలేదు. అంత దూరం నేను చూడలేదు.. మనమే రాసి ఉన్నాం కదా..
స్రవంతి రవికిషోర్ : మనం కూడా మంచి సినిమా తీశామని అనుకుంటాం. కానీ ఎంత మందికి రీచ్ అవుతుంది? ఎంత మందికి స్ట్రెస్ బస్టర్ అనేది..
త్రివిక్రమ్ : అది మనకు తెలీదు కదా. కానీ ఆమె చెప్పిందే ఇప్పుడు అందరూ చెబుతుంటారు. నేను ఆ మాటల్ని చాలాసార్లు తలుచుకుంటాను.
స్రవంతి రవికిషోర్: ఈ మూవీ నిర్మాత అని చెబితే.. ఇప్పటికీ గౌరవంగా చూస్తారు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మనవడికి 9 ఏళ్లు ఉంటాయి. ఆ చిన్న పిల్లాడు కూడా ఈ మూవీని పదే పదే చూస్తుంటాడట. ఇలా జనాల్ని ఎంటర్‌టెయిన్ చేశానని అనుకుంటే నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది.

 

స్రవంతి రవికిషోర్ : ఒక్కసారి చెప్పలేవా అనే పాటకు శాస్త్రి గారిని ఎంత ఇబ్బంది పెట్టాం.. 
త్రివిక్రమ్ : దారుణం కదా.. పది రోజుల తరువాత ఫస్ట్ రాసిన వర్షెన్‌ను వినిపిస్తే చాలా బాగుందని అన్నాం. తెగ తిట్టాడు మనిద్దరినీ (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : నీ మొహం మండ.. మొదటి రోజే రాశా కదా?..
త్రివిక్రమ్ : నన్నైతే మామూలుగా తిట్టలేదు.. నువ్వూ, నీ చాదస్తం.. నువ్వు, కిషోర్ కలిసి నా దుంపతెంపారు..
స్రవంతి రవికిషోర్ : మీ ముగ్గురు అసలు ఇక్కడకు రండి.. మీకేం కావాలి..  (నవ్వుతూ)
త్రివిక్రమ్ : మీకు అసలు క్లారిటీ ఉందా? అని అన్నారు (నవ్వుతూ)

 

స్రవంతి రవికిషోర్ : ఫస్ట్ రాసిన పల్లవిలోనే కథ అంతా ఉంటుంది..
త్రివిక్రమ్ : ఫస్ట్ నాలుగు లైన్లోనే అంతా ఉంటుంది.. చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని.. మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత.. ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ.. ఈ నాలుగు లైన్లే సినిమాలో వాడాం.
స్రవంతి రవికిషోర్ : అన్యాయం కదా (నవ్వుతూ)
త్రివిక్రమ్ : పది రోజుల తరువాత మళ్లీ అక్కడికే వచ్చాం.

 

స్రవంతి రవికిషోర్ : బెస్ట్ పార్ట్ ఏంటంటే?.. ఎవ్వరినీ ఉద్దేశించి అని కాదు కానీ.. ఆయన సినిమా కథని, సారాంశాన్ని, నాలుగైదు సీన్లని ఒకే పాటలో రాసేస్తారు.
త్రివిక్రమ్ : పాట అక్కర్లేదు అని చెప్పే పాటల రచయిత ఆయన ఒక్కరే సార్..
స్రవంతి రవికిషోర్ : యస్..
త్రివిక్రమ్ : పాట రాస్తే డబ్బులు వస్తాయ్ కదా.. కానీ ఆయన అలా కాదు.. ఇక్కడ పాట పడదు అని చెప్పేస్తారు (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : అవును.. నాకు పాట రాసేందుకు నాలుగు రోజులు కేటాయించి.. షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.. ఆ తరువాత పాటకు ఇక్కడ స్పేస్ గానీ అవసరం గానీ లేదు అని అన్నారు.
త్రివిక్రమ్ : ఆయన ఈ వృత్తిని చాలా సీరియస్‌గా కాదు.. డివైన్‌ క్రోషన్‌గా తీసుకున్నారు..
స్రవంతి రవికిషోర్ : ఒక్క విషయం శ్రీను.. ఆయన మన కోసం పాట రాయరు.. ఆయన తృప్తి చెందితేనే కానీ పాట ఇవ్వరు..
త్రివిక్రమ్ : పట్టుకెళ్లడం కుదరదు.. ఆ ఇంటి నుంచి పేపర్ రాదు (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : రాస్తా రాస్తా.. పాడుతూ.. నా వైపు చూసి నాకు తెలుసులే అని పేపర్ తిప్పేసేవారు.. మేం ఇద్దరం కలిసి దాదాపు 400 రాత్రులు గడిపి ఉంటాను.. నాకు ఆయన 89 పాటలు రాశారు.. ప్రతీ రాత్రి ఆయనతోనే ఉండేవాడ్ని. నాకు ఆయనతో అంత సమయం గడిపే అవకాశం రావడం నా అదృష్టం..
త్రివిక్రమ్ : అవును.. చాలా చాలా సమయం గడపగలిగారు..

 

స్రవంతి రవికిషోర్ : ఓ చిన్న ఉదాహరణ ‘గౌరి’ అనే సినిమాకు నాకు ఆయన పాట రాశారు.. ఆ పాట మా అందరికీ ఓకే. కానీ వాయిస్ మిక్సింగ్‌లో ఎవరే అనే పదం వద్ద కోటి ఇబ్బంది పడ్డారు. నేను అడ్జస్ట్ చేసుకుంటానులే శాస్త్రి గారు అని కోటి గారు అన్నారు. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. నేను రాసుకొస్తాను అని వెళ్లి మూడు రాత్రులు కష్టపడ్డారు. ఎవరే అనే పదంతో ఎండ్ చేయాలని ఆ పాటను మళ్లీ రాశారు. మహానుభావుడు.. ఆ పాట అద్భుతంగా ఉంటుంది.

 

త్రివిక్రమ్ : ‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు’ అనే పాటను చాలా రోజులు రాశారు. ఆ ఒక్క పాటే ఆయన్న చాలా రోజులు రాశారు. మిగతావన్నీ చాలా ఫాస్ట్‌గా రాశారు.
స్రవంతి రవికిషోర్ : మరి సినిమా అంతా ఆ పాటలోనే చెప్పాలి కదా. మిగతా ట్యూన్స్ అన్నీ అయిపోయాయి. క్లైమాక్స్‌ను మనం రకరకాలుగా మార్చాం.
త్రివిక్రమ్ : అవును.. 35 రోజులు కొట్టుకుని.. చివరకు మీరే విజయం సాధించారు కదా (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : వేమూరి సత్యనారాయణ, పేకేటి రంగా గారు చాలా గొప్ప వ్యక్తులు. యూత్ సినిమా చేస్తున్నావ్ కరెక్టే.. కానీ పెద్ద వాళ్లు కూడా ఈ మూవీని చూడాలి కదా? అని వారు అన్నారు. నువ్వు నాకు పాయింట్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. అయితే ఈ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ కూడా కావాలి కదా అని అనుకున్నాను.
త్రివిక్రమ్ : మీరు చెప్పినప్పుడు నేను ఎందుకు కన్విన్స్ అయ్యానంటే .. నేను మీకు ముందు చెప్పిన పాయింట్ అదే కదా? అది నచ్చే కదా సినిమాను స్టార్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ పాయింట్‌నే మార్చితే ఎలా? మిగతా సీన్లన్నీ మార్చినప్పుడు మేం వ్యతిరేకించలేదు.. ఈ ఒక్కటి అలానే పెట్టాలని ఎందుకు అంటున్నాం.. అది నాకు స్ట్రయిక్ అయింది.. అప్పుడు విజయ భాస్కర్ గారితో చర్చించాను.. మనం ఎంత టఫ్‌గా మాట్లాడిన సరే.. ఆయన వాదనలో నిజం ఉంది.. అని అన్నారు.. అందుకే నెక్ట్స్ డే వచ్చి మార్చి రాశాం మళ్లీ.

స్రవంతి రవికిషోర్ : ‘కళ్లలోకి కళ్లు పెట్టి’ అనే పాటను ముందుగా బాలుగారు పాడారు మీకు గుర్తుందా?
త్రివిక్రమ్ : నాకు గుర్తు లేదు సర్
స్రవంతి రవికిషోర్ : భాస్కర్ గారు అది బాగుందని అన్నారు. ఫీమేల్ వాయిస్ అయితే బాగుంటుందని నేను అన్నాను.
త్రివిక్రమ్ : చిత్ర గారిదే బాగుంటుంది.. నేను ఆమె పాడిన పాటే విన్నాను.
స్రవంతి రవికిషోర్ : చెన్నై నుంచి క్యాసెట్ వచ్చింది. ఆ పాట తరుణ్ విని ఏడ్చేశాడు.

 

స్రవంతి రవికిషోర్ : చిత్ర గారు పాడుతూ.. ఇది స్రవంతి పాట కదా? క్లైమాక్స్ పాట కదా? అని అనేవారు.. దిల్ రాజు కూడా మన  క్లైమాక్స్ పాటల గురించి మాట్లాడేవారు.
త్రివిక్రమ్ : మీ పాటలు చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ‘సంతోషం’ క్లైమాక్స్ పాట కూడా బాగుంటుంది. ఎంతో మందికి దారి చూపించింది. 
స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే నువ్వే’ కావాలి సినిమాలోని క్లైమాక్స్ పాట కూడా బాగుంటుంది.. ఆ పాటకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు..
త్రివిక్రమ్ : అవును… స్రవంతి అంటే పాటలే కదా..

 

స్రవంతి రవికిషోర్ : నేనేదో ప్యాషన్‌తో సినిమాలోకి రాలేదు. కానీ ‘లేడీస్ టైలర్’తో నాకు సీతారామశాస్త్రి గారు, తనికెళ్ల భరణి గారు, అనుమోలు హరి, ఇళయరాజా గారు, వంశీ, వేమూరి సత్యనారాయణ వంటి గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. దీన్ని విడిచి పెట్టి ఎలా వెళ్తాను? అలా నాకు సినిమాల మీద ప్రేమ, ఇష్టం ఏర్పడింది. ‘నువ్వే కావాలి’తో ఉన్న అప్పులు తీర్చుకున్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్’తో ఇల్లు కొనుక్కున్నాను. అప్పటి డబ్బులు దాచుకుంటే వందల కోట్లు అయ్యేది. కానీ ఇంకో సినిమాని తీసేందుకు డబ్బులుంటే చాలని అనుకున్నాను. కాబట్టి నాకు నో రిగ్రేట్స్.
త్రివిక్రమ్ : ఒక్కోసారి ఎలా జరుగుతుందో మనకే తెలీదు. ఈ కథని రాసేందుకు చాలా కష్టపడ్డాం. మీరేమో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. చేతిలో కథ లేదు. వెంకటేష్ గారు కూడా ఎప్పుడూ కథ ఎక్కడి వరకు వచ్చింది అని అడగలేదు. అలా అడిగితే ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాను అని ఆయనకు తెలుసు (నవ్వుతూ). అలా ఓ నెల రోజుల పాటు విజయ భాస్కర్ గారు , నేను చాలా శ్రమించాం. స్రవంతి ఆఫీసులో వెళ్లి కూర్చుండేవాళ్లం. ఓ సారి నాకు ఓ కలలా కథ వచ్చింది. హీరోయిన్ ఉండే వీధిలోకి హీరో, అతని తండ్రి వస్తాడు. హీరోకి తల్లి ఉండదు. ఓసారి హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్‌కి ఎంగేజ్మెంట్ జరిగిపోతోంది. అదే వారిద్దరి తొలి పరిచయం. మామూలుగా అయితే హీరో, హీరోయిన్ మధ్యలో ఎవరో వచ్చి ప్రీ క్లైమాక్స్‌లో ఎంగేజ్మ్ంట్ చేసుకుంటారు. అదే ఇందులో కొత్తగా ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్‌తో ప్రేమ అని అనుకున్నాం. అది కూడా సమాజ కట్టుబాట్లు, హద్దుల్లోనే ఉండాలని అనుకున్నాం. అలా ఐడియా వచ్చింది. ఆ ఐడియా వచ్చిన 15 రోజులకే కథ మొత్తం సెట్ అయింది. పాయింట్ అనుకున్నప్పుడు ఉన్న కథకి, చివరకు వచ్చిన కథకు ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. కాలనీ ఒకటి అని లేదు.. వాళ్ల ఫాదర్, వీళ్ల ఫాదర్ ఫ్రెండ్స్ అయ్యారు..
స్రవంతి రవికిషోర్ : ఎంగేజ్మెంట్ అనే పాయింట్ మాత్రమే ఉంది..
త్రివిక్రమ్ : అదొక్కటే ఉంది.. మిగతావన్నీ మారిపోయాయి
స్రవంతి రవికిషోర్ : నిజంగానే ఇది కత్తి మీద సాము. ఎక్కడా కూడా హద్దులు దాటలేదు.
త్రివిక్రమ్ : అసలు కథ ఇంత ఫాస్ట్‌గా అవుతుందా? అని అనుకున్నాను. కానీ, వెంటవెంటనే అయిపోయింది..

 

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత నువ్వు భీమవరం వెళ్లిపోయావు.. ఆ హడావిడిలోనే నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించాం. ‘నువ్వే కావాలి’ వంద రోజుల ఫంక్షన్‌కి మేం ఇక్కడ లేం. నేను, విజయ భాస్కర్ కలిసి ఫిబ్రవరిలో ఆల్రెడీ పియానో సాంగ్ రికార్డింగ్ చేసినట్టున్నాం..

 

త్రివిక్రమ్ : ఆశా షైనీ కారెక్టర్ రావడానికి ఓ కారణం ఉంది. వెంకటేష్ గారికి కథ మొత్తం చెప్పిన తరువాత.. కథ అంతా బాగుంది.. నాకేం మార్పులు లేవు.. కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను. సినిమా అంతా ఒకే ప్లేస్‌లో జరుగుతోంది.. ఈ కథను ఏమైనా కాస్త బయటకు తీసుకెళ్లొచ్చా? అలా అని కథలోని ఎస్సెన్స్ మారకూడదు.. ఏమైనా చేయగలవా? అని అన్నారు. అప్పుడు ఊటికి వెళ్తే ఎలా ఉంటుంది? అని అనుకున్నాను. ఊటికి అంటే.. ముందే ఆ అమ్మాయిని పరిచయం చేయాలి. అలా ఊరికే పరిచయం చేయడం ఎందుకు? ఓ పాట ఉంటే బాగుంటుంది కదా? అని అనుకున్నాం. అలా ఆ కారెక్టర్‌తో ఫస్ట్ హాఫ్‌లో ‘ప్రియతమా’ అనే పాట, సెకండాఫ్‌లో ‘ఓ నవ్వు చాలు’ అనే పాట వచ్చింది. విజయ భాస్కర్ గారికి ఆరు పాటలు ఉండాల్సిందే (నవ్వుతూ)
స్రవంతి రవికిషోర్ : అందులో ఓ పాట భువనచంద్ర గారు రాయాల్సిందే (నవ్వుతూ)
త్రివిక్రమ్ : వాళ్లిద్దరిదీ ఆర్మీ కనెక్షన్ కదా (నవ్వుతూ) శాస్త్రి గారు కూడా ఇది భువనచంద్ర పాటే కదా? అని అన్నారు (నవ్వుతూ).. ప్రియతమా అనే పాటను భువనచంద్ర గారు రాశారు కదా

 

స్రవంతి రవికిషోర్ : కోటి గారు మంచి సంగీతం ఇచ్చారు. సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. నేను, భాస్కర్ కలిసి రామానాయుడులో ఆర్ఆర్ పనులు చూసుకున్నాం. ఏదో తేడా కొడుతోందని భయపడ్డాను.
త్రివిక్రమ్ : ఆ రోజు నేను కూడా వచ్చాను.. అర్దరాత్రి వరకు కూర్చున్నాను.
స్రవంతి రవికిషోర్ : ఆ రాత్రి ఏం తేలకపోయే సరికి సినిమా కోసం కొన్న  ప్రకాష్ రాజ్ కారుని తీసుకుని విజయవాడ హైవే ఎక్కేశా.. ఆర్ఎఫ్‌సికి వెళ్లిన తరువాత గుర్తుకు వచ్చి మళ్లీ రిటర్న్ అయ్యా. 
త్రివిక్రమ్ : ఆ తర్వాత రోజు నేను కూడా వచ్చాను.. ప్రతీ సీన్‌ను మళ్లీ చూసాం .. ఆయన పక్కన ఎవరో అసిస్టెంట్ కూడా ఉండేవాడు..
స్రవంతి రవికిషోర్ : మన జీబూ..
త్రివిక్రమ్ : హా.. జీబూ.. ఆయన కన్సోల్ వదిలి బయటకు వెళ్లేవారు.. కోటి గారు చాలా కష్టపడ్డారు..
స్రవంతి రవికిషోర్ : కోటి ప్రాణం పెట్టి చేశారు..
త్రివిక్రమ్ : కోటి గారు ఎంత పెద్ద వారో నాకు అప్పుడు తెలిసేది కాదు.. ‘నువ్వే కావాలి’ అప్పుడు నేను చాలా యంగ్. నా ఒపీనియన్‌ను చెప్పినా ఫీల్ అయ్యేవారు కాదు. ఏదో చిన్న పిల్లాడు అని అనుకునేవాడు.
స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే నువ్వే’ టైంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి..
త్రివిక్రమ్ : ఇలాంటి విచిత్రకరమైన వంటకం నేనెప్పుడూ తినలేదని అన్నారు.. హారతి సంఘటన గుర్తుందా? ఫైర్ అలారమ్ వచ్చింది.. పోలీసులు కూడా వచ్చారు..
స్రవంతి రవికిషోర్ : తరుణ్  సాంబ్రాణి పుల్ల అంటించాడు స్విట్జర్లాండ్ హోటల్ లో ./ చాలా డబ్బులు కట్టాం..
త్రివిక్రమ్ : నాకు గుర్తుంది (నవ్వుతూ) చాలా కాస్ట్ లీ భక్తి అని అన్నారు.. పొద్దున్నే స్నానం చేసి టవల్ కట్టుకుని పూజ చేశాడు..
స్రవంతి రవికిషోర్ : నేను చాలా భక్తితో పూజ చేశాను అని మళ్లీ చెప్పాడు (నవ్వుతూ)

 

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ స్క్రిప్ట్ చెప్పినప్పుడు పెళ్లి టైంలో ఇంటికి కలర్స్ వేసే సీన్ ఒకటి చెప్పావు . అక్కడి నుంచే ‘ఆకాశం దిగి వచ్చి’ అనే పాట పుట్టింది. ఆ పాటని శాస్త్రి గారు 8 రోజులు రాశారు.
త్రివిక్రమ్ : ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని పాటలన్నీ రాసినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. ‘ఓ నవ్వు చాలు’ పాటకి మాత్రం లేను. ఆయనతో అలా రాత్రి పూట కూడా కూర్చుండేవాడిని. విజయ భాస్కర్ మాత్రం రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు నిల్చుని పడుకునేవారు. భాస్కర్ నీ కళ్లేంటి? అలా ఎర్రగా అయ్యాయ్.. వెళ్లి పడుకో అని శాస్త్రి గారు అనేవారు (నవ్వుతూ)

 

స్రవంతి రవికిషోర్ : మాకు ఎప్పుడూ మూడ్ బాగా లేకపోయినా సినిమాని చూస్తాం.. ఇది మాకు స్ట్రెస్ బస్టర్ సార్ అని అంతా అంటుంటారు..
త్రివిక్రమ్ : ఆ క్రెడిట్ అంతా వెంకటేష్ గారికే. కథ చెప్పిన వెంటనే మీతో ఆయన వచ్చి మనం చేసేస్తున్నాం కిషోర్ అని అన్నారు. క్యారెక్టర్ బేస్‌డ్ సినిమా అని, రెండు మూడుసార్లు డైలాగ్ వర్షెన్ చెప్పించుకున్నారు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఆయన కాబట్టి ముందుకు వచ్చి అలా చేసినట్టుగా అనిపిస్తుంది.
స్రవంతి రవికిషోర్ : వెంకటేష్ గారికి కథపై మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది..
త్రివిక్రమ్ : సినిమాలో ట్విస్టులు ఉండవు.. కమర్షియల్ అంశాలుండవు.. చాలా ఫ్లాట్‌గా ఉంటుంది.. కానీ కథ చెప్పినప్పుడే ఆయన సినిమాని చూసేశారు.

స్రవంతి రవికిషోర్ : వెంకటేష్ గారు సెట్‌లో వేరే సీన్ జరుగుతుంటే.. అలా మేకప్ రూంలో ఉండేవారు. నా షాట్ ఎప్పుడు? నేను ఎప్పుడు రావాలని అడిగేవారు కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవారు. 

 

త్రివిక్రమ్ : నేను మొదటిసారిగా ఈ మూవీ కోసం బ్రహ్మానందం గారికి ఎక్కువ ట్రాక్ రాశాను. చివర్లో ట్విస్ట్ కూడా వస్తుంది.
స్రవంతి రవికిషోర్ : నేను తీసిన ఫోటో వల్ల పెళ్లి కొడుకు మారాడా? (నవ్వుతూ)
త్రివిక్రమ్ : విజయ భాస్కర్ గారికి చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. నేను పేపర్ మీద రాసినప్పుడు అది చాలా ఫ్లాట్‌గా ఉండొచ్చు. కానీ ఆయన దాన్ని పసిగట్టేవారు.
స్రవంతి రవికిషోర్ : స్క్రిప్ట్ ఇచ్చిన తరువాత 25 రోజులు రిహార్సల్స్ చేసుకునేవారు.. రాయడం కాదు..
త్రివిక్రమ్ : మీటర్ సెట్ చేసుకోవడానికి.. ఆయన లేకపోతే ఆ హ్యూమర్ అంతగా వచ్చేది కాదు.. ఆయనకి ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ వల్లే అంత బాగా వచ్చింది. ఇది ఆయనది.. అది నాది అని అందుకే ఇందులో తూకం వేసి చెప్పలేం. అల్లసాని పెద్దన చెప్పినట్టుగా మనం చెప్పేదాన్ని అర్థం చేసుకుని శభాష్ అనే శ్రోత ఉండాలి. ఇలా ఈ టీం ఇంత బాగా కలిసి వచ్చింది కాబట్టే సినిమా అంత గొప్పగా వచ్చింది.

 

స్రవంతి రవికిషోర్ : ఆర్తి అగర్వాల్, సుహాసిని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. వెనకాల నుంచి వెంకటేష్ వినే సీన్‌ను మీరు తీసేద్దామని అనేవారు గుర్తుందా?
త్రివిక్రమ్ : మామూలుగా అయితే నిర్మాతలు అలా తీసేయమని అంటారు.. దర్శక, రచయితలు ఉంచమంటూ పోరాడతారు. కానీ ఇందులో రివర్స్. నేను తీసేద్దామని అంటే.. మీరేమో పెడదామని అంటారు. సినిమా రిలీజ్ చేసిన మొదటి రోజు సంతాప సభలో ఉన్నట్టుగా అనిపించింది. ఆ రోజు సినిమా చూసి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా నేను తప్పు చేశా.. నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుండేది అని అన్నా.. నేనేం మాట్లాడుతున్నానో మా అమ్మకి అర్థం కాలేదు. ఆ టైంలోనే మీరు ఫోన్ చేసి హైదరాబాద్‌కి రమ్మన్నారు.
స్రవంతి రవికిషోర్ : శాంతి థియేటర్‌కు తీసుకెళ్లాను..
త్రివిక్రమ్ : అప్పుడు అక్కడ పది మందే ఉన్నారు.. అప్పుడు నేను ఇంకా బెంబేలెత్తిపోయాను. ఆ పది టికెట్లు అమ్ముడు పోయాక హౌస్ ఫుల్ బోర్డు పడింది. అప్పుడు నేను కొంచెం కుదుటపడ్డాను. ధైర్యంగా అనిపించింది. డోర్ వద్ద నిల్చుని ఆడియెన్స్ రియాక్షన్ చూడమని అన్నారు. సినిమా బాగానే ఉందని అనుకుని ఆ రోజు రాత్రి కాస్త నిద్రపోయాను. 

 

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ రిలీజ్ అప్పుడు అమెరికా నుంచి మా మామయ్య ఫోన్ చేశారు. రెండు వారాలే అని అన్నారు. సినిమా బాగా లేదని నాతో చెప్పలేరు.. (నవ్వుతూ)
త్రివిక్రమ్ : కానీ అది ఆడుతూనే ఉంది.. వన్ ఇయర్ ఆడింది.. నేను భీమవరంలో సినిమా చూశాను. గేట్ కీపర్ అయితే ఈ మూవీ కష్టం సార్ అని అన్నాడు. అలా షాక్‌లో నేను నడుచుకుంటూ వెళ్లాను. అక్కడే 300 రోజులు ఆడింది. మళ్లీ అదే గేట్ కీపర్ ‘నేను మీకు ముందే చెప్పాను కదా సర్’ అని అన్నాడు.
స్రవంతి రవికిషోర్ : ఏంటి.. కష్టం సార్ అని అన్నవాడేనా?
త్రివిక్రమ్ : హా అవును.. కానీ నాకు గుర్తుంటుంది కదా.. విన్నది నేను.. (నవ్వుతూ).. కొన్ని సినిమాలు డబ్బులు తీసుకొస్తాయి.. కొన్ని సినిమాలు పేరుని తీసుకొస్తాయి.. గౌరవం మాత్రం కొన్ని సినిమాలే తీసుకొస్తాయి..
స్రవంతి రవికిషోర్ : ఇందాక నేను చెప్పింది అదే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.