చిరు,పవన్ కలిశారు.. అభిమాని చనిపోయాడు
on Apr 4, 2016

మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో రెండు భిన్న ధృవాలు. ఒకరు శాంతి,సహనానికి మారుపేరు అయితే ఇంకోకరు ఆవేశం, దూకుడు కలగలిసిన వ్యక్తి. స్వతహాగా తనను ఇంత స్థాయికి తీసుకువచ్చిన అన్నయ్య అంటే పవన్‌కు భక్తి గౌరవం. అన్నయ్య మీద ఈగ వాలినా అగ్గిమీద గుగ్గిలం అవుతాడు పవన్. అన్నయ్యని నాలుగు మాటలంటేనే నిండు సభలో ఒక అగ్రనటుడి మీద వాగ్భాణాలు సంధించాడు పవన్ కళ్యాణ్ . ఐతే అదంతా గతం. ప్రజారాజ్యం పార్టీ అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిల్చింది. ఏ పార్టీ నేతల్ని పంచలూడదీసి పవన్ పరుగులెత్తిస్తానన్నాడో అలాంటి పార్టీలోకి ప్రజారాజ్యాన్ని విలీనం చేయడాన్ని పవర్ స్టార్ జీర్ణించుకోలేకపోయాడు. అన్నయ్య నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ తలొక దిక్కు అయ్యారు. రాజకీయాల్లో అన్నయ్య బిజీ అయితే, సినిమాల్లో తమ్ముడు దూసుకెళ్తున్నాడు.
సర్దార్ గబ్బర్ సింగ్ సందర్భంగా మళ్లీ ఇద్దరు ఒక్కటవుతున్న తరుణంలో ఇద్దిరికి ఉన్న గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ వీరి మధ్య వివాదాన్ని రాజేసింది. కర్ణాటకలోని బళ్లారిలో ఒక చిరంజీవి అభిమాని పవన్ అభిమానిని కొట్టి చంపాడు. నగరంలోని కౌల్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20న ఒక చోట కలిశారు. వీరిలో ఒకరు పవన్ అభిమాని కాగా మరొకరు చిరంజీవికి వీరాభిమాని. ఈ క్రమంలో మా అన్న మెగాస్టార్‌ను మించిన హీరో ఎవ్వరూ లేరు అంటూ చిరు అభిమాని అన్న మాటలు వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.
ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో చిరంజీవి అభిమాని చేతికందిన ఐరన్ రాడ్ తీసుకుని పవన్ కళ్యాణ్ అభిమానిని చితక బాదాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ ఘటన ఇద్దరు అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. ఇద్దరు హీరోలు కలిస్తున్న సందర్భంలో అభిమానులు మాత్రం ఇలాంటి చర్యలతో మళ్లీ చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



