ENGLISH | TELUGU  

వేసవి తుది సమరానికి టాలీవుడ్ రెడీ!

on May 20, 2019


 

సినిమాలు... క్రికెట్... దేశంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టే ముఖ్యమైన రెండు రంగాలు. క్రికెట్‌లో ఐపీఎల్‌ ముగిసింది. వేసవిలో వినోదాన్ని పంచి వెళ్లింది. తెలుగులో ఈ వేసవికి స్టార్ హీరోల సినిమాల సందడి కూడా ముగిసింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచి వెళ్లాయి. ఐపీఎల్‌లో వీక్షకులను నిరాశ పరిచిన క్రికెటర్లు ఉన్నారేమో కానీ, వేసవిలో ప్రేక్షకులు నిరాశపరిచిన స్టార్ హీరోలు లేరు. 

'మజిలీ'తో నాగచైతన్య, 'చిత్రలహరి'తో సాయిధరమ్ తేజ్, 'జెర్సీ'తో నాని, 'కాంచన 3'తో రాఘవ లారెన్స్, 'మహర్షి'తో మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ పిచ్ మీద అందరూ బ్యాటింగ్ ఇరగదీశారు. వసూళ్ల పట్టికలో మంచి మంచి స్కోర్లు నమోదు చేశారు. 'మహర్షి' స్కోర్ మీద అనుమానాలు ఉన్నాయేమో కానీ మహేష్ నటన, సినిమా మెజార్టీ ప్రేక్షకులకు నచ్చింది. మొత్తానికి ఈ వేసవి తెలుగు సినిమా పరిశ్రమకు మంచి ఫలితాలు ఇచ్చింది. ఇదే సంతోషంలో స‌మ్మ‌ర్‌ ఎండింగ్‌కి టాలీవుడ్ సిద్ధ‌మైంది. వేసవి తుది సమరానికి రెడీ అంటోంది. పెద్ద సినిమాల హడావిడి ముగియడంతో చిన్న సినిమాలు ఒక్కసారిగా థియేటర్లలోకి వచ్చి పడుతున్నాయి.

స‌మ్మ‌ర్‌ ఎండింగ్‌లో వస్తున్న సినిమాల్లో చెప్పుకోదగ్గది 'సీత'. 'నేనే రాజు నేనే మంత్రి' తరవాత తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ఈ కాలంలో సీత ఉంటే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. అదే రోజున 'లీసా త్రీడీ' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగమ్మాయి అంజలి నటించిన తొలి త్రీడీ చిత్రమిది. హారర్ సినిమా త్రీడీ ఎలా ఉంటుందో చూడాలి. 

ఈ నెల 24న వస్తున్న మరో సినిమా 'ఎవడు తక్కువ కాదు'. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తమిళంలో హిట్టైన 'గోలీసోడా'కు రీమేక్ ఇది. కొత్త తరహా చిత్రాలను ఆదరించేవాళ్లకు, ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుందని యూనిట్ కంటెంట్ మీద నమ్మకంగా ఉంది. తమిళ డబ్బింగ్ సినిమా 'నాగకన్య' కూడా 24న విడుదలవుతోంది. 

మే చివర్లో 31న మరో నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఒకటి... 'ఎన్.జి.కె'. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో రూపొందిందీ సినిమా. దీనికి పోటీగా 'సువర్ణ సుందరి', 'అభినేత్రి 2' వస్తున్నాయి. తెలుగులో 'అభినేత్రి' పెద్దగా ఆడలేదు. ఇప్పుడీ సీక్వెల్ కి సరిగా ప్రచారం కూడా చేయడం లేదు. దీనికి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పటి నుంచి ఓ అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కి వేస్తున్న 'సువర్ణ సుందరి' ఫాంటసీ కథతో తెరకెక్కింది. 'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన 'ఫలక్ నుమా దాస్' కూడా 31న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జూన్‌ ఫస్ట్ వీక్లో 'సెవెన్', 'హిప్పీ' విడుదలకు సిద్ధమయ్యాయి.  

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.