ప్రభాస్ కోసం కృష్ణంరాజు కన్న కలలు.. 'ఒక్క అడుగు', 'ఏడు అడుగులు'!
on Sep 11, 2022
.webp)
రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. నటుడిగా ఆయన ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. అయితే ఆయన తన తమ్ముడి కుమారుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కన్న కలలు మాత్రం కొన్ని నెరవేరలేదు.
కృష్ణంరాజు నటించిన గొప్ప సినిమాల్లో 'భక్త కన్నప్ప' ఒకటి. ఈ చిత్రాన్ని తానే దర్శకనిర్మాతగా వ్యవహరిస్తూ ప్రభాస్ తో రీమేక్ చేయాలని ఆయన భావించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అలాగే ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ 'ఛత్రపతి'లోని 'ఒక్క అడుగు' అనే డైలాగ్ ని టైటిల్ గా పెట్టి ఒక పవర్ ఫుల్ మూవీ తీయాలనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని నెలల పాటలు స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కానీ ఆ మూవీ పట్టాలెక్కలేదు. అలాగే 'మన వూరి పాండవులు' చిత్రాన్ని కూడా ప్రభాస్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించారు.
ఇక సినిమాల కంటే ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ఎంతగానో ఎదురుచూశారు. ఆయన మీడియా ముందుకొస్తే చాలు ఎక్కువగా ప్రభాస్ పెళ్ళికి సంబందించిన ప్రశ్నలే ఎదురయ్యేవి. అయితే ప్రభాస్ ఏడడుగులు వేయకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు.
ప్రభాస్ ని డైరెక్ట్ చేయాలని, ప్రభాస్ పెళ్లి చూడాలని కలలు కన్న కృష్ణంరాజు.. నటుడిగా తన చివరి సినిమాని మాత్రం ప్రభాస్ తోనే చేశారు. 'రాధేశ్యామ్' చిత్రంలో ఆయన పరమహంస అనే కీలక పాత్రలో నటించారు. అలాగే 'బాహుబలి'తో ప్రభాస్ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం ఆయనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



