'కేజీఎఫ్' చూసిన కళ్ళకి ఈ 'వారియర్' ఏం నచ్చుతుంది?
on Jul 14, 2022

'కేజీఎఫ్'లోని భారీ యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 'కేజీఎఫ్ చాప్టర్-2' తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు.. భాషతో సంబంధం లేకుండా ఎంతటి సంచలనాలు సృష్టించిందో. ఇక రీసెంట్ బ్లాక్ బస్టర్ 'విక్రమ్' కూడా అంతే. నలుగురు స్టార్స్, ట్విస్ట్ లు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు.. ఇంకేముంది ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు.
ఇప్పుడు కమర్షియల్ సినిమాలంటే.. ట్విస్ట్ లతో సాగే ఆసక్తికరమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలు, వాటికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇవి ఉంటే యాక్షన్ ప్రియులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. అలా కాకుండా ఇంకా 20 ఏళ్ళ క్రితం నాటి రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీస్తే ఎవరు చూస్తారు?. చూసినా 'కేజీఎఫ్', 'విక్రమ్' చూసిన కళ్ళకు అలాంటి సినిమాలు ఎలా నచ్చుతాయి?.
చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ ని బాగానే అలరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ ఉత్సాహంలో ఇక వరుస మాస్ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన 'ది వారియర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పైగా పోలీస్ స్టొరీ. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. కానీ సినిమానే అంచనాలు అందుకోలేకపోయింది.
పోలీస్ స్టోరీ అంటే రేసీ స్క్రీన్ ప్లే, భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఆశిస్తారు ఆడియన్స్. కానీ 'ది వారియర్'లో టైటిల్ లో ఉన్న పవర్ సన్నివేశాల్లో లేదు. రొటీన్ సీన్స్, స్లో స్క్రీన్ ప్లే తో నడిచింది. నిజానికి డాక్టర్ పోలీస్ అవ్వడం అనే కాన్సెప్ట్ బాగుంది. కానీ దానిని నడిపించిన విధానమే ఆకట్టుకోలేదు. ఒక ఊరిలో పెద్ద రౌడీ, అతని ఆగడాలకు అడ్డుకట్ట వేసే పోలీస్. ఇలాంటివి చాలా సినిమాల్లో చూసి ఉన్నాం. పోనీ హీరో, విలన్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటాపోటీ పోరు సాగుతూ.. బలమైన సన్నివేశాలు పడ్డాయా అంటే అదీ లేదు. ఆ సన్నివేశాలకు తగ్గట్లే దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా బలం లేదు.
ప్రేక్షకులు యాక్షన్ సినిమాలను ఆదరిస్తున్న మాట నిజమే. కానీ వారి అంచనాలు 'కేజీఎఫ్'లో హీరో ఎలివేషన్స్ రేంజ్ లో ఉన్నాయి. లింగుస్వామి వంటి సీనియర్ డైరెక్టర్స్ ఈ విషయాన్ని గ్రహించక.. ఇంకా అప్పటి కమర్షియల్ ఫార్మాట్ లో లాగే ఐదు పాటలు, ఐదు ఫైట్లతో సినిమా లాగిస్తానంటే.. వారియర్ అయినా రిజల్ట్ చూసి వర్రీ అవ్వాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



