ది ట్రయల్ వెబ్ సిరీస్ రివ్యూ
on Jul 15, 2023

వెబ్ సిరీస్ : ది ట్రయల్
నటీనటులు: కాజోల్, జిషు సేన్ గుప్తా, విజయ్ విక్రమ్ సింగ్, గౌరవ్ పాండే, కుబ్రా సైత్, అలీ ఖాన్, షీబా చద్ధా తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ సోని
కథ : హుస్సేమ్ దలాల్, అబ్బాస్ దలాల్
ఎడిటింగ్: నినాద్ ఖనోల్కర్
సంగీతం: సంగీత్ సిద్దార్థ్
దర్శకత్వం: సుపర్ణ్ వర్మ
నిర్మాతలు: అజయ్ దేవగణ్, దీపక్ ధర్, రాజేశ్ చద్ధా
బ్యానర్: బనిజయ్ ఆసియా, అజయ్ దేవగణ్ ఎఫ్ ఫిలిమ్స్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
నిన్న మొన్నటి దాకా సినిమాలకున్న క్రేజ్ అంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీదకి మళ్ళింది. బాలివుడ్ నటి కాజోల్ నటించిన ' ది ట్రయల్' వెబ్ సిరీస్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. మరి ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం.
కథ:
నొయోనిక సేన్ గుప్త(కాజోల్), రాజీవ్ సేన్ గుప్త(జిషు సేన్ గుప్త) ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే రాజీవ్ సేన్ గుప్త ఒక హైకోర్ట్ జడ్జ్ గా చేస్తున్నాడు. అయితే అతను లైంగిక వేధింపులు చేశాడని అతడిని అరెస్ట్ చేసారు. దాంతో కుటుంబాన్ని అతని భార్య నొయోనిక సేన్ గుప్త చూసుకుంటుంది. అయితే తను కూడా ఒక లాయర్. కానీ పెద్దగా కేసులు లేకపోవడంతో ఒకరి దగ్గర జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతుంది. రాజీవ్ సేన్ గుప్తాని నొయోనిక బయటకు తీసుకురాగలిగిందా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
నొయోనిక భర్త రాజీవ్ జైలుకి వెళ్ళడంతో వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా మారాయనే ఇంటెన్స్ తో కథ మొదలవుతుంది. దాంతో అసలేం జరిగిందనే ఉత్కంఠతను డైరెక్టర్ సువర్ణ్ వర్మ ప్రేక్షకులలో కలిగించాడు. నొయోనిక తన భర్త కేస్ కాకుండా చిన్న చితక కేస్ లు వాదించడంలో తన ఇంటలిజెన్స్ ని, న్యాయపరమైన సెక్షన్ లని వెలికితీసే విధానం బాగుంది.
తన భర్త తప్పు చేశాడని మీడియా చేసిన ప్రచారానికి చట్టం కళ్ళకు గంతలు కట్టుకుందా అన్నట్టు నొయోనిక వాదించిన తీరు బాగుంది. అయితే నొయోనిక, ఆమె భర్త రాజీవ్ జైలుకి వెళ్ళేముందు వారి లైఫ్ ఎలా ఉందో చూపించిన విధానం బాగుంది. కానీ ఆ సీన్లని ఎక్కువగా చూపించలేదు. అయితే ఒక్కో ఎపిసోడ్ లో నొయోనిక ఒక్కో కేస్ ని వాదిస్తూ చివరి ఎపిసోడ్ వరకు సాగదీసారు మేకర్స్. రాజీవ్ సేన్ గుప్త చేసిన తప్పేంటి? అతని అరెస్ట్ వెనుకాల ఉన్న సాక్షాలేంటి? వీటిని ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం జరిగేలా చేయాలి.. ఈ ముఖ్యమైన పాయింట్ ని వదిలేసి ఇతర కేసులని వాదించడం చూస్తుంటే ఇంకెప్పుడు అసలు కథలోకి వస్తారా అనే ఫీలింగ్ ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. అందులోను ప్రతీ ఎపిసోడ్ నిడివి నలభై నిమిషాలు ఉండటంతో చూసే ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది.
కథకి అవసరం లేని సీన్లు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిలో కోర్ట్ రూమ్ లో సాగే సీన్లలో డైలాగులు బలంగా ఉండాలి. రెండు, మూడు డైలాగులు మినహా ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ప్రతీ ఎపిసోడ్ ఒక కొత్త కేస్ తో మొదలవడం, అది పెద్దగా ఇంట్రెస్ట్ గా లేకపోవడంతో ప్రేక్షకుడి సహనానికి డైరెక్టర్ సువర్ణ్ వర్మ పరీక్ష పెట్టాడు.
ఆరవ ఎపిసోడ్ 'లైఫ్ లైన్ ', ఏడవ ఎపిసోడ్ ' ట్రయల్ బై మీడియా' .. నొవోనిక లాయర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి తీసినట్టుంది. అయితే రాజీవ్, నోయోనికల మధ్య ఎమోషనల్ సీన్లు ఇంకాస్త ఉండి ఉంటే ఇంకా బాగుండేది. చివరి ఎపిసోడ్ అయిన 'క్లాక్ అండ్ డాగ్గర్' చివర్లో ' తప్పుడు మనిషికి సాయం చేయడానికి ప్రయత్నిస్తే మనకి న్యాయం దక్కదు.. ద్రోహమే మిగులుతుంది' అనే డైలాగ్ మరో సీజన్ ఉంటుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి సీజన్ -2 లో ఎలా ఉంటుందో చూడాలి మరి. భర్త కోసం నొయోనిక పోరాడే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. తల్లిదండ్రులు సంపాదనలో బిజీగా ఉండిపోతే పిల్లలు ఎలా మారుతారో చూపించిన తీరు బాగుంటుంది. మనోజ్ సోని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నినాద్ ఎడిటింగ్ బాగుంది. ఎడిటింగ్ లో కత్తిరించే సీన్లు చాలానే ఉన్నాయి. స్లో సీన్లని తీసేస్తే ఇంకా బాగుండేది. కోర్ట్ రూంలో నొయోనిక వాదించేప్పుడు వచ్చే బిజిఎమ్ ఆ సీన్లకు మరింత బలాన్నిచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
నొయోనిక పాత్రలో కాజోల్ అద్భుతంగా చేసింది. ఒకవైపు భర్త కోసం పోరాడుతూ, మరోవైపు తన పిల్లలను కాపాడుకుంటూ 'ది గుడ్ వైఫ్' అనిపించుకుంది. అయితే నొయోనికకి భర్తగా రాజీవ్ సేన్ గుప్త పాత్రలో జిషు సేన్ గుప్త ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళంతా వారి వారి పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ప్రతీ ఎపిసోడ్ నిడివి, స్లో సీన్స్ పక్కన పెడితే, కోర్ట్ రూమ్ లో ఆసక్తికరంగా సాగే కొన్ని సీన్ల కోసం ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2 / 5
✍🏻. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



