ENGLISH | TELUGU  

'తందట్టి' మూవీ రివ్యూ

on Jul 19, 2023

సినిమా పేరు: తందట్టి
తారాగణం: రోహిణి, పశుపతి, దీపా శంకర్, అమ్ము అభిరామి, వివేక్ ప్రసన్న, మీనల్ తదితరులు 
సంగీతం: సామ్ సీఎస్, కేఎస్ సుందరమూర్తి
సినిమాటోగ్రాఫర్: మహేశ్ ముత్తుస్వామి
ఎడిటర్: శివనందీశ్వరన్
రచన, దర్శకత్వం: రామ్ సంగయ్య
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్ 
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

ఓటీటీలు వచ్చాక ఇతర భాషల సినిమాలను కూడా మన భాషలో మన ఇంట్లో ఉండే చూడగలుగుతున్నాం. ఇటీవల తమిళ్ లో థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న 'తందట్టి' మూవీ, ఇప్పుడు తెలుగు సహా పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ 'తందట్టి' చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ:
సుబ్రమణియన్(పశుపతి) నిజాయితీగల పోలీస్. అన్ని విషయాల్లో తలదూరుస్తూ తన పైఅధికారుల చేత చివాట్లు తింటూ, ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు అవుతుంటాడు. అలా రిటైర్మెంట్ వయసులో ఓ కొత్త పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అక్కడా అదే తీరుగా ప్రవరిస్తూ పైఅధికారుల చేత మాటలు పడుతుంటాడు. మరో పది రోజుల్లో సుబ్రమణియన్ రిటైర్ అవుతాడు అనగా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిడారిపట్టి గ్రామం నుంచి సెల్వరాజ్ అనే కుర్రాడు వచ్చి తన నానమ్మ తంగపొన్ను(రోహిణి) కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తాడు. ఆ స్టేషన్ లో ఎప్పటినుంచో పనిచేస్తున్న పోలీసులంతా కిడారిపట్టి గ్రామం పేరు వినగానే భయపడతారు. ఆ ఫిర్యాదు తీసుకోవడానికి గానీ, ఆమెని వెతకడానికి గానీ ఎవరూ ముందుకురారు. అయితే సుబ్రమణియన్ మాత్రం సెల్వరాజ్ కి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఆ గ్రామం గురించి చెప్పి, మిగతా పోలీసులు వద్దని హెచ్చరించినా వినకుండా సుబ్రమణియన్ ఆ కుర్రాడి వెంట వెళ్తాడు. అలా తంగపొన్ను కోసం ఎంతో వెతకగా ఆమె కనిపిస్తుంది.. కానీ మరణిస్తుంది. దీంతో తన కుటుంబసభ్యులు ఎలాంటివారో వివరించిన సెల్వరాజ్, ఆమె అంత్యక్రియలు పూర్తయ్యేవరకు తోడుగా ఉండమని సుబ్రమణియన్ ని కోరతాడు. సెల్వరాజ్ కోరికమేరకు సుబ్రమణియన్ కిడారిపట్టి గ్రామానికి వెళ్తాడు. తెల్లారితే అంత్యక్రియలు అనగా, ఆ అర్థరాత్రి తంగపొన్ను చెవులకు ఉన్న దుద్దులు ఎవరో దొంగిలిస్తారు. ఆ చెవి దుద్దులు అంటే తంగపొన్నుకి ప్రాణం. కట్టే కాలేటప్పుడు కూడా అవి తనతో ఉండాలనేది ఆమె కోరిక. అంత ప్రత్యేకమైన ఆ చెవి దుద్దుల దొంగను పట్టుకునే బాధ్యత సుబ్రమణియన్ పై పడుతుంది. చెవి దుద్దులపై తంగపొన్ను అంతగా ప్రేమ పెంచుకోవడానికి కారణమేంటి? ఆ దుద్దులను దొంగలించి ఎవరు? ఆ దొంగను సుబ్రమణియన్ పట్టుకోగలిగాడా? తన తోటి పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా రిటైర్మెంట్ చివరిరోజుల్లో కిడారిపట్టి గ్రామానికి వెళ్లిన సుబ్రమణియన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
చావు చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన 'బలగం' సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో జీవిత పాఠం చెప్పేలా ఆ సినిమాని మలిచారు. తమిళ సినిమా 'తందట్టి' కూడా ఇంచుమించు అదే శైలిలో సాగింది. ఇది కూడా చావు చుట్టూ అల్లుకున్న కథే. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలతో సాగుతూ 'మానవ సంబంధాల కంటే ఆర్ధిక సంబంధాలే ముఖ్యం' అనుకుంటున్న ఈతరం వారి కళ్ళు తెరిపించే సందేశాత్మక చిత్రమిది.

ఆస్తుల కోసమే కన్నవారిపై ప్రేమ చూపించేవారిని, ఆస్తుల కోసం అయినవాళ్లతో గొడవ పడేవాళ్ళని నిజ జీవితంలో చూస్తుంటాం. అలాంటి ఎన్నో జీవితాలకు అద్దంపట్టేలా ఈ సినిమా ఉంది. ఓ వైపు తల్లి చనిపోతే ఆమె దుద్దులు కొట్టేయాలనుకునే బిడ్డలు, అప్పటిదాకా గొడవ చేసి డబ్బులు వస్తాయని తెలియగానే దొంగ ప్రేమ నటించే పిల్లలు, చావు ఇంటికొచ్చి కూడా మర్యాదలు జరగట్లేదని గొడవచేసే బంధువులు.. ఇలా ఎన్నో పాత్రలు, సన్నివేశాలతో నేటి సమాజ తీరుని చూపించాడు దర్శకుడు.

ఊళ్ళల్లో కనిపించే కొందరు మనుషులను గుర్తుచేసేలా ఉన్న పాత్రలతో దర్శకుడు సహజమైన హాస్యాన్ని పండించాడు. చాలా సన్నివేశాలు మనకు నవ్వు తెప్పిస్తూనే ఆలోచింపజేసేలా ఉంటాయి. కామెడీ సన్నివేశాలను ఎంత చక్కగా రాసుకున్నాడో, ఎమోషనల్ సన్నివేశాలను అంతకంటే హృద్యంగా మలిచాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు, నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా సున్నితమైన సన్నివేశాలతో ఎంతో అందంగా నడిచింది. ముఖ్యంగా సినిమా ముగింపు ఊహకందని విధంగా ఉంటుంది. పతాక సన్నివేశాలు మనల్ని సర్ ప్రైజ్ చేయడంతో పాటు, ఎమోషనల్ గానూ మనకు కనెక్ట్ అవుతాయి. 

ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తాం అనే విషయాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. కన్న వాళ్ళ కంటే, వాళ్ళ ఆస్తులపైనే ప్రేమ చూపించే పిల్లలున్న ఈ సమాజంలో.. తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని కన్నీళ్లను గుండెల్లో దాచుకుంటారు.. అవన్నీ దాటుకొని పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా తపిస్తారు అనే విషయాన్ని దర్శకుడు చూపించిన తీరు హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. 

రచయితగా, దర్శకుడిగా రామ్ సంగయ్య సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. సామ్ సీఎస్, కేఎస్ సుందరమూర్తి సంగీతం ఆకట్టుకుంది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ మహేశ్ ముత్తుస్వామి తన కెమెరా పనితనంతో సినిమాకి సహజత్వం తీసుకొచ్చాడు. 

నటీనటుల పనితీరు:
కథకి ప్రధానమైన తంగపొన్ను పాత్రలో రోహిణి ఒదిగిపోయారు. తెరపై తక్కువసేపే కనిపించినా ఆ పాత్రతో బలమైన ముద్ర వేయాలి. ఆ విషయంలో రోహిణి విజయం సాధించారు. అయితే ఆమెని కథకి అవసరమైన దానికంటే ఎక్కువ వయస్సుగల ఆమెగా చూపించారు అనిపించింది. ఇక సినిమాకి ఎంతో కీలకమైన హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణియన్ పాత్రలో పశుపతి చక్కగా రాణించారు. ఓ వైపు మనిషి చావు, మరోవైపు మనుషుల వింత ప్రవర్తన.. వీటి నడుమ ఆయన హావభావాలు మెప్పించాయి. దీపా శంకర్, అమ్ము అభిరామి, వివేక్ ప్రసన్న, మీనల్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
అయినవాళ్ళ కంటే ఆస్తులు ముఖ్యం అనుకునే ప్రస్తుత సమాజంలోని మనుషుల తీరుకి అద్దం పట్టేలా ఉంది ఈ సినిమా. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో.. నవ్విస్తూనే ఆలోచింపజేసేలా నడిచిన ఈ చిత్రం కుటుంబమంతా కలిసి చూసేలా ఉంది.

- గంగసాని 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.