తెలుగు ప్రేక్షకులకి, తమిళ ప్రేక్షకులకి తేడా ఇదే.. ధనుష్ కి షాకిచ్చిన తమిళ తంబీలు!
on Jun 23, 2025

ప్రేక్షకులందు తెలుగు ప్రేక్షకులు వేరయా అంటారు. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు, స్ట్రయిట్ సినిమానా, డబ్బింగ్ సినిమానా వంటి లెక్కలు వేసుకోకుండా.. సినిమా నచ్చితే చాలు తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకే తెలుగునాట పలు డబ్బింగ్ సినిమాలు కూడా మంచి వసూళ్ళను రాబడుతుంటాయి. తమిళనాట మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తమ సినిమా కాదనిపిస్తే.. వారు దానిని ఓన్ చేసుకోరు. తాజాగా 'కుబేర' విషయంలో ఇది మరోసారి రుజువైంది.
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న కుబేర.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లోనే తెలుగునాట రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది. కానీ, తమిళనాడులో మాత్రం రూ.13 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. అంటే తెలుగు వసూళ్లతో పోలిస్తే కనీసం సగం కూడా రాలేదు.
ధనుష్ తమిళ హీరో అయినప్పటికీ.. తమిళనాడులో కుబేర పెద్ద ప్రభావం చూపలేకపోతోంది. అందుకు కారణం.. దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు కావడంతో పాటు, కీలక పాత్ర పోషించిన నాగార్జున కూడా తెలుగువాడు కావడం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. అయినప్పటికీ తమిళ్ ఆడియన్స్ దీనిని తెలుగు సినిమాగానే చూస్తున్నారు. అందుకే ధనుష్ తమ హీరో అనే విషయాన్ని కూడా మరిచి.. సినిమాని పెద్దగా ఆదరించట్లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు ఆడియన్స్ అలా కాదు. సినిమా నచ్చితే చాలు.. ఓన్ చేసుకుంటారు. కుబేరను కూడా అలాగే ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా ధనుష్ పర్ఫామెన్స్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. తమిళ్ లో కంటే తెలుగులోనే ధనుష్ కి ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి కుబేరతో ధనుష్.. తెలుగులో హిట్ ని, తమిళ్ లో ఫ్లాప్ ని చూసేలా ఉన్నాడు.
గతంలో ఓసారి తమిళ హీరో కార్తి.. తనకి తమిళ్ ఆడియన్స్ కంటే, తెలుగు ఆడియన్స్ ఇష్టమని చెప్పాడు. హీరోతో, భాషతో సంబంధం లేకుండా.. సినిమా నచ్చితే చాలు ఆదరిస్తారని... అందుకే తెలుగు ప్రేక్షకులు ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 'కుబేర'తో కార్తి చెప్పింది నూటికి నూరు శాతం నిజమని మరోసారి రుజువైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



