ENGLISH | TELUGU  

తీయ‌టి తెలుగింటి కొరివి కారం... సూరేకాంతం

on Oct 28, 2014



ప‌దాల్ని ప‌చ్చ‌డి చేసేస్తుంది...
డైలాగుల్ని న‌మిలి అవ‌త‌ల పారేస్తుంది..
ఎంత‌టి పాత్ర‌నేనా మొట్టికాయ వేసి లొంగ దీసుకొంటుంది..
ఎదుట ఉన్న‌ది ఎవ్వ‌రైనా.. చెవి మెలేసి ఆధిప‌త్యం చెలాయిస్తుంది..
ఇన్ని చేసేదెవ్వ‌రు...??  సూరేకాంతం కాక‌పోతే...??


సూరేకాంతం - ఈ పేరే బ‌హు ప‌వ‌ర్ ఫుల్‌. ఆమెకు త‌ప్ప‌... మ‌రెవ్వ‌రికీ సూటు కాదు. పెట్టుకొనే ధైర్య‌మూ లేదు. సూరేకాంతం - ఈ పేరు వింటే కోడ‌ళ్లు ఝ‌డుసుకొంటారు. అల్లుళ్లు పారిపోతారు. అత్త‌లు గ‌ర్వంగా త‌లెగ‌రేస్తారు! కొంగు బొడ్డో దోపి, జుట్టు ముడేసి, కుడి చేతిని న‌డుంపై వేసుకొని, ఎడ‌మ చేత్తో విసుర్లు విసురుతుంటే.. ఎంత‌టివాడైనా గండైపోవాల్సిందే. ద‌టీజ్ సూరేకాంతం. ఇన్ని మాట‌లెందుకూ.... టీవీని మ్యూట్‌లో పెట్టినా డైలాగ్ వినిపించిందంటే... అగ్గ‌దీ సూరేకాంత‌మంటే!! సూరేకాంత‌మొచ్చిందిరోయ్ - అంటూ థియేట‌ర్లో అంద‌రూ అటెన్ష‌న్ అయిపోయేవారు. కుటుంబ క‌థా చిత్రంలో సూరేకాంతం ఓ హార‌ర్ ఎలిమెంట్‌! కానీ ఆ భ‌య‌మూ బాగుండేది. `హ‌య్యో...` అంటూ సూరేకాంతం మూతి విరుపులూ, నిష్టూరాలూ, మాట మెరుపులూ, విసుర్లు, తిట్లు, శాప‌నార్థాలూ వింటుంటే, ఒక్కో డైలాగ్‌కీ ఆమెలో మారే రంగులు గ‌మ‌నిస్తుంటే, స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అంత‌కంటే వినోదం ఉంటుందా..?? ఆమె ప‌క్క‌న న‌టించే మొగుడు అన‌బ‌డే మ‌గాడెవ‌రైనా స‌రే - సూరేకాంతం దెబ్బ‌కు కుదేలైపోవాల్సిందే. ఎస్వీఆర్‌, రేలంగి, ర‌మ‌ణారెడ్డి - ఎవ్వ‌రైనా కానివ్వండి - సూరేకాంతం ఆధిప‌త్యం చ‌లాయించేసేది. కోడ‌ళ్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది. హీరోల ముండు ఠీవీగా నిల‌బ‌డేది. వాళ్ల‌ను మాట‌ల్తో ప‌డ‌గొట్టేది.  సంసారం, ర‌క్త‌సంబంధం, మాంగ‌ల్య‌బ‌లం, గుండ‌మ్మ క‌థ‌,  కుల‌గోత్రాలు... ఒక‌టా రెండా వంద‌ల సినిమాల్లో గ‌య్యాళి పాత్ర‌. ఎన్నిసార్లు చేస్తుంది, ఇంకెన్నిసార్లు చూడాలి...??  ఎన్నిసార్లు చూసినా చూడ‌బుద్ధేసే న‌ట‌న ఆమెది. గ‌య్యాళిత‌నానికి ఓ ట్రేడ్ మార్క్‌. అత్త పాత్ర‌ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌.

ర‌క్త‌సంబంధం చూసి జ‌నాలు ఠారెత్తిపోయారు. సూరేకాంతం మీద మండిప‌డ్డారు. మ‌రీ అంత గ‌య్యాళి త‌న‌మా...??  అంటూ నివ్వెర‌బోయారు. సినిమా చూసిన ప్రేక్ష‌కుడు నిజంగానే ఫీలైపోయి సూరేకాంతాన్ని థియేట‌ర్ల‌లోనే ఆడిపోసుకొనేవారంటే న‌మ్మండి!  బ‌య‌ట ఆమె ఆటోగ్రాఫ్ అడ‌గ‌డానికి కూడా జ‌నం భ‌య‌ప‌డేవారు. అమ్మాయిలైతే సూరేకాంతం ఉన్న ద‌రిదాపుల్లోకే వెళ్లేవాళ్లు కాదు. ఆమె పాత్ర‌ల్లో న‌టించ‌దు - జీవిస్తుంది అని చెప్ప‌డానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ‌లేం కావాలి...??

ఆమె హీరో కాదు. కానీ వాళ్లకు త‌ల‌ద‌న్నే ఇమేజ్ ద‌క్కించుకొంది.
ఆమె హీరోయిన్ కాదు.. కానీ వాళ్ల‌కు మించిన క్రేజ్ సంపాదించుకొంది.
ఆమె విల‌న్ కాదు.. కానీ సినిమా అంత‌టినీ త‌న వైపు నుంచి న‌డిపించింది.
ఎన్టీఆర్ - ఏఎన్నార్ - ఎస్వీఆర్ ఇలాంటి ఉద్దండులున్న సినిమాకి సూరేకాంతం పేరుతో టైటిల్ పెట్ట‌డం ఏంటి??  - గుండ‌మ్మ క‌థ కాక‌పోతే??!

ఓసారి చ‌క్ర‌పాణి నాగిరెడ్డిల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగింది.
మ‌న సినిమాలో సూరేకాంతంకి భ‌ర్త‌గా ఎవ‌ర్ని పెడ‌దాం అన్న‌దే టాపిక్కు!
సూరేకాంతం ఉండ‌గా, మ‌రో మొగుడెందుకు...??  వ‌ద్దులే అనుకొన్నార్ట చివ‌రాఖరికి. అదీ సూరేకాంతం గ‌య్యాళిత‌నం అంటే.

చ‌రిత్ర ఎంతోమంది న‌టీన‌టుల్ని చూసుంటుంది. కానీ సూరేకాంతం వేరు. అలాంటి న‌టి మ‌ళ్లీ రారు!
ఘంట‌సాల లేని లోటు బాలు తీర్చుండొచ్చు!
ఎస్వీఆర్‌ని కాస్తో  కూస్తో కైకాల స‌త్య‌నారాయ‌ణ భ‌ర్తీ చేసుండొచ్చు!
అప్పుడు సావిత్రి.. ఇప్పుడు సౌంద‌ర్య అని చెప్పుకొనే ధైర్యం చేసుండొచ్చు...!
కానీ సూరేకాంతంకి అటు, ఇటూ.. ఆమెకు ప్ర‌త్యామ్నాయంగా నిలిచిన న‌టీమ‌ణి లేరు. రారు. అందుకే వ‌న్ అండ్ ఓన్లీ... సూరేకాంతం అయ్యారావిడ‌. ఆమెకు మ‌రో రూపం ఇవ్వ‌లేక‌, ఆమెలాంటి మ‌రో న‌టీమ‌ణిని త‌యారు చేయ‌లేక కాలం కూడా కొయ్య‌బారిపోయింది.

సూరేకాంతం తిట్టు కూడా అట్టులా ఉంటుంది.
ఆమె విరుపులు మెరుపుల్లా మార‌తాయి.
ఆమె నిష్టూరాలు మ‌న‌కు చ‌క్ర‌పొంగ‌ళులు
ఆమె కారాలు నూరితే... అవే కార‌ప్పూస‌లు!

సూరేకాంతం మిగిల్చిన జ్ఞాప‌కాల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ నెమ‌ర‌వేసుకొంటూ తృప్తిగా త్రేన్చుదాం. ఆమె చిత్ర‌రాజాల‌ను చూస్తూ  నామ‌స్మ‌ర‌ణ‌లో గడిపేద్దాం.


(ఈరోజు సూర్య‌కాంతం జ‌యంతి సంద‌ర్భంగా)

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.