కృష్ణగారి ఇల్లు ఎలా వుంటుందో తెలుసా?
on Nov 14, 2022

ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలో ఉండే, ఇప్పుడు సిటీలో కలిసిపోయిన నానక్‌రాంగూడ విలేజ్‌లో 'ప్లానెట్ 10' అనే ప్లేస్ ఉంది. అది.. కృష్ణ ఉండే ఇంటి పేరు. ఆ పేరును కృష్ణ భార్య విజయనిర్మల పెట్టుకున్నారు. ఆమె 2019 జూన్‌లో మృతిచెందారు. అప్పటి నుంచీ కృష్ణ అక్కడే ఒంటరిగా ఉంటున్నారు. ఆయన బాగోగులను నటుడు నరేశ్ చూసుకుంటూ వస్తున్నారు. ఆదివారం అర్ధ రాత్రి గుండెపోటుకు గురైన కృష్ణను దగ్గరలోని కాంటినెంటర్ హాస్పిటల్‌కు తరలించారు. విషమ స్థితిలో ఉన్న ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు వైద్యులు.
మిగతా చాలామంది సెలబ్రిటీల ఇళ్లతో పోలిస్తే కృష్ణ ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కారణం.. అక్కడి పక్షుల కిలకిలా రావాలు, రకరకాల మొక్కలు. ఒక పొదరిల్లు తరహాలో ఆ ఇంటిని కట్టుకున్నారు కృష్ణ. ఆవరణలోకి అడుగుపెట్టగానే ఒక వనాన్ని తలపించే రీతిలో అక్కడి చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. వాటి మధ్య గోపాలకృష్ణుడి విగ్రహం. ఇంటి ముందు గులాబీ మొక్కల మధ్య వాటర్ ఫౌంటెన్.. ఆ తోటలో తులసి, దానిమ్మ, అరటి మొక్కలు, రకరకాల కూరగాయల మొక్కలు, ఆవరణలో విజయ నిర్మల కాంస్య విగ్రహం, ఇంటి వెనుక పెరట్లో మామిడి తోట.. ఇదీ సూపర్‌స్టార్ కృష్ణ ఇంటి చుటూ ఉండే రమణీయ వాతావరణం.
కృష్ణ ఇంట్లో విశాలమైన ఒక హోం థియేటర్ ఉంది. అక్కడే కృష్ణ సినిమాలు చూస్తుంటారు. మహేశ్ నటించిన సినిమా రిలీజయ్యిందంటే.. వెంటనే అక్కడ ఆ సినిమాని ఆయన చూసేస్తారు. తన అభిప్రాయాన్ని చెప్పేస్తారు. రీసెంట్‌గా నరేశ్, అలీ నటించిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' మూవీని చూసి, దాన్ని ప్రశంసించారు కృష్ణ. ప్లేయింగ్ రూంలో గోడమీద ఛత్రపతి శివాజీ గెటప్‌లో ఉన్న కృష్ణ ఫొటో ఆకట్టుకుంటుంది. కృష్ణ తన నట జీవితంలో అందుకున్న అనేక మెమెంటోలు లివింగ్ రూంలో దర్శనమిస్తాయి. ఆ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌లో కృష్ణ ఉంటారు. ఇదివరకు మెట్లు ఎక్కి వెళ్లేవారు. విజయ నిర్మలకు మోకాలి నొప్పుల కారణంగా కొంత కాలం క్రితం లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్నుంచీ రాకపోకలన్నీ ఆ లిఫ్ట్ ద్వారానే.
ఇలా ఆ ఇల్లు ఆకర్షణీయంగా చూడగానే 'ఎంత బాగుంది ఈ ప్రదేశం!' అనిపించేలా ఉంటుంది కృష్ణగారి ఇల్లు. ఆ ఇంటిని చూడాలంటే కృష్ణ కుమార్తె మంజుల చేసిన 'నానాస్ హోం టూర్' వీడియోను చూస్తే చాలు. 'మంజుల ఘట్టమనేని' అనే యూట్యూబ్ చానల్లో ఇది అందుబాటులో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



