తెలుగులోకి 'శక్తి'గా తమిళ 'హీరో
on Feb 12, 2020
తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో సేమ్ టైటిల్ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. తమిళ టైటిల్ అర్థమే తెలుగులో వచ్చేలా పెట్టుకోవడమూ కుదరదు. అందుకని, మరో ఆప్షన్ వెతుకుతారు. కార్తీ, జ్యోతిక నటించిన 'దొంగ' తమిళ టైటిల్ 'తంబీ'. తెలుగులో 'తమ్ముడు' అని అర్థం. ఆ టైటిల్ దొరకలేదు. అందుకని, 'దొంగ' పెట్టారు. ఇటువంటివి కోకోల్లలు. తాజాగా శివ కార్తికేయన్ సినిమాకు కూడా అలాగే చేశారు.
తమిళ, తెలుగు భాషల్లో `అభిమన్యుడు` చిత్రంతో విజయం అందుకున్న దర్శకుడు పి.యస్. మిత్రన్. శివ కార్తికేయన్ హీరోగా ఆయన డైరక్ట్ చేసిన లేటెస్ట్ తమిళ మూవీ 'హీరో. తెలుగులో 'శక్తి'గా డబ్బింగ్ చేశారు. తెలుగు 'రెమో'తో శివ కార్తికేయన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా సినిమా విషయానికి వస్తే... యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించాడు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్‌కి సౌతిండియాలో తొలి సినిమా ఇదే. విద్యావ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శంకర్ తెరకెక్కించిన 'జెంటిల్‌మేన్' చిత్రం గుర్తుకొస్తుంది. అందుకు ఏమాత్రం తీసిపోని కథతో పి.యస్. మిత్రన్ 'శక్తి' తీశాడని నిర్మాతలు చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు తెల్సిన కల్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్.
ఈ సినిమా గురించి డైరక్టర్ పి.యస్.మిత్రన్ సినిమా గురించి మాట్లాడుతూ ''సూపర్ హీరోల పట్ల మనకుఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. శక్తిమాన్ సీరియల్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆ సీరియల్ ప్రభావంతో సూపర్‌మేన్ అవుదామనుకున్న ఓ అబ్బాయి... రియల్ లైఫ్‌లో చేసిన స్టంట్లు ఏంటి? తండ్రి సలహాతో లైఫ్‌లో ఎలా సెటిలయ్యాడు? అతను చేసిన సూపర్ మేన్ తరహా పనులేంటి? మన విద్యావ్యవస్థలోని లోపాలను అతనికి గుర్తు చేసిందెవరు? అతను బాగు చేసిందేంటి? వంటి విషయాలన్నీ ఇందులోఆసక్తికరంగా ఉంటాయి. తమిళంలో ఈ సినిమాకు చాలా మంచి ఆదరణ దక్కింది. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ కథలో వాస్తవ ఘటనలను చాలా చొప్పించాం. ప్రేక్షకులకు ఓ వైపు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూనే ఆలోచింపజేసేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు.