కృష్ణ రీఎంట్రీ.. మహేష్, పవన్ రికార్డులు బ్రేక్ అవుతాయా?
on Sep 4, 2022

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) కానుకగా 'పోకిరి' చిత్రాన్ని 350కి పైగా స్పెషల్ షోలు వేయగా రూ.1.73 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2)కి 'జల్సా' సినిమాని 700కి పైగా స్పెషల్ షోలు వేయగా ఏకంగా రూ.3.20 కోట్ల గ్రాస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రీరిలీజ్ ల ట్రెండ్ లో భాగంగా ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23)కి 'బిల్లా' సందడి చేయనుంది. అయితే ఈ ట్రెండ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ రంగంలోకి దిగుతున్నారు.

కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో 'సింహాసనం'(1986) ఒకటి. ఈ చిత్రానికి ఆయనే దర్శకనిర్మాత కావడం విశేషం. సాహసాలకు, ప్రయోగాలకు పెట్టింది పేరైన కృష్ణ.. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు. అదే బాటలో 'సింహాసనం' కూడా మొదటి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని సరికొత్తగా మళ్ళీ విడుదల చేయబోతున్నారు. ఇటీవల రీరిలీజ్ అవుతున్న సినిమాలన్నీ 4k లో విడుదలవుతుండగా.. 'సింహాసనం' మాత్రం వచ్చే ఏడాది 8k లో విడుదల కానుంది. మే 31న కృష్ణ పుట్టినరోజు. కావున ఆరోజు ఈ చిత్రం రీరిలీజ్ అయ్యే అవకాశముంది. మరి 'సింహాసనం' రీరిలీజ్ తో కృష్ణ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



