2022 ఫస్టాఫ్ రివ్యూ 7: అలరించిన సీక్వెల్స్, ఫ్రాంచైజీ సినిమాలు!
on Jun 26, 2022
2022 ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలు సందడి చేశాయి. వాటిలో కొన్ని విజయపథంలో పయనించాయి. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..
బంగార్రాజుః
2016 నాటి సంక్రాంతి సెన్సేషన్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయనా`లో కథానాయకుడిగా నటించిన కింగ్ నాగార్జునతో పాటు ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య కూడా ఇందులో సందడి చేశారు. నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, చైతూకి జోడీగా కృతి శెట్టి అలరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సీక్వెల్.. `సోగ్గాడే..` స్థాయిలో సంచలనం సృష్టించకపోయినా చెప్పుకోదగ్గ ఫలితాన్ని చూసింది. జనవరి 14న ఈ సినిమా తెరపైకి వచ్చింది.
కేజీఎఫ్ః చాప్టర్ 2:
2018 క్రిస్మస్ స్పెషల్ గా విడుదలై జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ః చాప్టర్ 1`. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన సదరు పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కి సీక్వెల్ గా తెరకెక్కిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` ఇదే ఏడాది ప్రథమార్ధంలో రిలీజైంది. ఏప్రిల్ 14న జనం ముందు నిలిచిన ఈ కొనసాగింపు చిత్రం.. చాప్టర్ 1కి మించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంతో రాకింగ్ స్టార్ యశ్, టాలెంటెడ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఇమేజ్ పదింతలు పెరిగింది.
ఎఫ్ 3:
2019 సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2` అప్పట్లో సంచలనం సృష్టించింది. కట్ చేస్తే.. ఈ సంవత్సరం మే 27న ఈ సినిమా ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా `ఎఫ్ 3` తెరపైకి వచ్చింది. `ఎఫ్ 2`లో హీరోహీరోయిన్లుగా నటించిన విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ఇందులోనూ కొనసాగారు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రంలో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు.
విక్రమ్ః
1986 నాటి తమిళ చిత్రం `విక్రమ్`కి స్పిరిచ్యుయల్ సీక్వెల్ గా తెరకెక్కిన `విక్రమ్` కూడా బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించింది. లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో కొనసాగిన ఈ చిత్రాన్ని `ఖైదీ` ఫేమ్ లోకేశ్ కనకరాజ్ రూపొందించాడు.
మరి.. సీక్వెల్స్ (సిరీస్), ఫ్రాంచైజీలకు 2022 ఫస్టాఫ్ కలిసొచ్చిన వైనం.. సెకండాఫ్ లోనూ కొనసాగుతుందేమో చూడాలి. `కార్తికేయ 2`, `హిట్ః ద సెకండ్ కేస్` వంటి సీక్వెల్స్ 2022 ద్వితీయార్ధంలో సందడి చేయనున్నాయి.