'సార్' కోసం సుద్దాల రాసిన 'బంజారా' పాట!
on Jan 17, 2023

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెలుగు, తమిళంలో రూపొందుతోన్న ద్విభాషా చిత్రం 'సార్'(తమిళంలో 'వాతి'). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'మాస్టారు మాస్టారు' సాంగ్ ఆకట్టుకుంది. ఈ చిత్రం నుంచి 'బంజారా' అంటూ సాగే రెండో తాజాగా విడుదలైంది. ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించడం విశేషం.
"ఆడవుంది నీవే ఈడవుంది నీవే
నీది కానీ చోటే లేనేలేదు బంజారా
యాడ పుట్టె తీగ యాడ పుట్టె బూర
తోడు కూడినాక మీటి చూడు తంబూర"
అంటూ సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. "ఏదీ మన సొంతం కాదు. కష్టాలు, సుఖాలు శాశ్వతం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం" అనే అర్థమొచ్చేలా పదునైన మాటలతో, లోతైన భావంతో ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సుద్దాల అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతమైన జి వి ప్రకాష్ సంగీతం, అనురాగ్ కులకర్ణి స్వరం తోడై పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
'బంజారా' లిరికల్ వీడియోలోని లోకేషన్లు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కథానాయకుడు ఊరిలో వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం, అలాగే హోటల్ లో స్నేహితులతో కలిసి తిని బయటకు వచ్చాక అక్కడున్న చిన్నారికి డబ్బు సాయం చేయడం వంటివి అతని పాత్ర తీరుని, స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. పాటలోని సాహిత్యానికి అద్దం పట్టేలా కథానాయకుడి పాత్ర ఉంది.
"జీవితం వెనుక ఉన్న వేదాంతాన్ని, జనన మరణాల మధ్య ఉన్న బతుకు బాట, దాని పరమార్థాన్ని చిత్ర కథానుసారం చెప్పే ప్రయత్నం చేశాం. భగవంతుడు మనకు ఏమీ చేయట్లేదని అనుకోవద్దు. నీకోసం ఒక స్థానం పెట్టాడు. అక్కడికి చేరుకోవటం నీ భాధ్యత అని చెప్పే పాట ఇది. బతుకు ప్రయాణం గురించి పాట కావాలని, చిత్ర కథ, సందర్భం దర్శకుడు చెప్పిన తీరు నచ్చింది. ఆది శంకర తత్వాన్ని, భగవద్గీత సారాన్ని దృష్టి లో ఉంచుకుని ఈ గీతానికి సాహిత్యం అందించటం జరిగింది అన్నారు" సుద్దాల అశోక్ తేజ.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, 'మాస్టారు మాస్టారు' పాటకు విశేష స్పందన లభించింది. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు 'సార్' జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తిని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో 'సార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



