ENGLISH | TELUGU  

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ రివ్యూ

on Apr 28, 2023

వెబ్ సిరీస్: సేవ్ ది టైగర్స్
తారాగణం: అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు వెల్దండి, రోహిణి, 'వైవా' రాఘవ తదితరులు
సంగీతం: అజయ్ అర్సద
ఎడిటింగ్: శ్రవణ్ కాతికనేని
సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
నిర్మాతలు: మహి. వి. రాఘవ, చిన్నా వాసుదేవరెడ్డి
 దర్శకత్వం : తేజ కాకుమాను
ఓటిటి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:

ఒక పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో ముగ్గురు పట్టుపడతారు. అయితే వాళ్ళు ముగ్గురు అక్కడ సీఐ ని కలిసి వారి గతం గురించి చెప్పి వారి కార్ ని తీసుకొని వెళ్దామనుకుంటారు. ఆ ముగ్గురు ఒకరు గంటా రవి(ప్రియదర్శి), మరొకరు రాహుల్ (అభినవ్ గోమఠం), ఇంకొకరు విక్రమ్(చైతన్య కృష్ణ.. వీరి ముగ్గురు వారింట్లో వాళ్ళ భార్య పిల్లలతో ఎలా ఉంటారో.. ఆ ఫ్రస్టేషన్ లో ఎలా చేశారో ? ఏం చేస్తున్నారో సిఐకి చెప్తుంటారు.. గంటా రవి బోరబండ బస్తీలో పాల వ్యాపారం చేస్తుండేవాడని.. అతనికి తన భార్యకి మధ్య గొడవలని గంటా రవి చెప్తాడు. రాహుల్ మంచి రచయిత కావాలనే ఆశతో తన జాబ్ కి రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటాడు. తన భార్య రాహుల్ ని ప్రేమించి పెళ్ళిచేసుకుంటుంది. కానీ పెళ్ళి తర్వాత తను ఖాళీగా ఉండటాన్ని భరించలేక ఎప్పుడు తన భార్య ఎప్పుడు తనమీద చికాకు పడుతుందని రాహుల్ చెప్తాడు. విక్రమ్(చైతన్య కృష్ణ) ఒక ఆడ్ ఏజెన్సీలో క్రియేటివ్ కాన్సెప్ట్ డిజైనర్ గా జాబ్ చేస్తుంటాడు. అతని భార్య లాయర్. తనెప్పుడూ క్రమశిక్షణ అంటూ వాళ్ళ పాపని బాధపెడుతుంది.. మరొకవైపు విక్రమ్ వాళ్ళ అమ్మతో గొడవలు.. ఇలా వారిద్దరి మధ్య గొడవలని విక్రమ్ చెప్తుంటాడు.. ఈ ముగ్గురు పోలీస్ స్టేషన్ నుండి బయటకొచ్చారా లేదా అనేది మిగతా కథ.. అసలు వీరి ముగ్గురికి ఈ సేవ్ టైగర్స్ కి సంబంధమేంటో తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. 

విశ్లేషణ: 

పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ గా పట్టుపడ్డ ముగ్గురి జీవితాలను సీఐ కి చెప్తూ ఈ సిరీస్ కథని ఆసక్తికరంగా మొదలుపెట్టారు డైరెక్టర్ తేజ కాకుమాను.  భార్య భాదితులుగా పరిచయమైన గంటా రవి, విక్రమ్, రాహుల్ పాత్రలు ప్రతీ ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అవుతాయి. 

గంటా రవి(ప్రియదర్శి) అతని భార్య హైమవతిల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలని చూపించిన విధానం బాగుంది. గంటా రవి కుమార్తె డింపుల్ వాళ్ళ స్కూల్ లో జరిగిన ఒక సంఘటనతో.‌. అతని జీవితం ఎలా మారిందనేది.. పెద్దలు నిత్యం ఇంట్లో మాట్లాడే మాటలు పిల్లలని ఎలా ప్రభావితం చేస్తాయనేది కళ్ళకి కట్టినట్టుగా చూపించిన తీరు సామాన్య ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. గంటా రవి(ప్రియదర్శి) మాట్లాడే మాటలన్నీ కూడా వినడానికి నవ్వు తెప్పించినా ఒక సీరియస్ మెసెజ్ ని అందించడంలో డైరెక్టర్ విజయం సాధించాడనే చెప్పాలి. పెళ్ళయిన ప్రతీ భార్యభార్తలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలని వేలెత్తి చూపుతూ.. వాటికి సొల్యూషన్ ఉందంటూ ఒక్కో జంట ద్వారా ప్రేక్షకులకు తెలియజేసిన తీరు బాగుంది. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఫన్ ని జనేరేట్ చేస్తూ కథని నడిపిన విధానం బాగుంది. కామెడీతో కూడిన మెసేజ్ కి ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యేలా మలిచాడు డైరెక్టర్.

రాహుల్ రచయిత అవ్వాలనే కలతో ఉంటాడు. కానీ అతని భార్య చిరాకు పడుతుంటుంది. వాళ్ళింట్లో పనిమనిషిగా రోహిణి ఆకట్టుకుంది. ఈ సిరీస్ లో కామెడీ ఎంత మేరకు ఉంచాలో అంతవరకే ఉంచి చివరి వరకూ కథని ల్యాగ్ లేకుండా సాగించారు మేకర్స్. ముఖ్యంగా రాహుల్(అభినవ్ కోమఠం), రోహిణిల మధ్య జరిగే సంభాషణలు కడుపుబ్బా నవ్వు తెప్పించేస్తాయి. రాహుల్ (అభినవ్ కోమఠం) తన భార్య కోసం పొట్ట తగ్గించాలని జిమ్ చేస్తుండగా చేయి పట్టేయడంతో.. రాహుల్ ని పనిమనిషి రోషిణి, గంటా రవి హాస్పిటల్ కి తీసుకెళ్ళే సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. విక్రమ్ తనలో ఉన్న ఆలోచనల్నీ చాలా కామ్ గా భరిస్తూ తన భార్యకి ఇచ్చే విలువని చూసి తన మీద తనకే జాలి కలుగుతుంది. అలా భార్య భాదితులు చాలానే ఉన్నారంటూ బార్ కి వెళ్ళి అక్కడ తాగేవాళ్ళందరికి ఒక మోటివేషన్ ఇచ్చే సీన్స్ అన్నీ కూడా ఆసక్తికరంగా సాగుతాయి. మరొకవైపు విక్రమ్ డిజైన్ చేసి‌న డ్రాయర్ ఆడ్ కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి.

ఈ సిరీస్ లో మొదటి మూడు ఎపిసోడ్ లు కథలోకి తీసుకెళ్ళగా.. చివరి మూడు ఎపిసోడ్ లు కథని మలుపు తిప్పేలా ఉంటాయి. కానీ చివరి ఎపిసోడ్ లు సరైన ముగింపు ఇవ్వకుండా ఈ సిరీస్ పై క్యూరియాసిటిని పెంచడానికి రెండవ భాగం ఉండబోతుందని ముగించారు మేకర్స్. కామెడీతో పాటు కంటెంట్ బాగుంది. శ్రవణ్ కాతికనేని కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండు. మిగతాదంతా బాగా ఎడిట్ చేసాడు. ఎస్వీ విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అజయ్ అర్సదా సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు పనితీరు: 

ఈ సిరీస్ తో గంటా రవిగా ప్రియదర్శి‌ ఆకట్టున్నాడు. ఆ పాత్రలో నిమగ్నమై చేసిన తీరు అందరికి గుర్తుండిపోతుంది. గంటా రవి భార్యగా హైమావతి పాత్రలో జోర్దార్ సుజాత ఆకట్టుకుంది. గంటా రవి అమ్మ పాత్రలో గంగవ్వ ఉన్నంతలో బాగా చేసింది. విక్రమ్ గా చైతన్య కృష్ణ సరిపోయాడు. రాహుల్ పాత్రలో అభినవ్ కోమఠం ఒదిగిపోయాడు. ఈ సిరీస్ లో రాహుల్ పాత్ర చూస్తున్నంతసేపు.. 'ఈ నగరానికి ఏమైంది' లో కౌశిక్ పాత్రనే గుర్తొస్తుంటుంది. అభినవ్ తన కామెడీ టైమింగ్ తో మస్తీ అనిపించాడు. ఒక ప్రముఖ ఛానెల్ లో‌ టీవి యాంకర్ గా వేణు వెల్దండి ఆకట్టుకున్నాడు. వైవా రాఘవ, హర్షవర్ధన్ వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.


తెలుగువన్ పర్ స్పెక్టివ్: 

కథతో పాటు కామెడీ బాగున్న ఈ వెబ్ సిరీస్ ని వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి సరదగా చూడొచ్చు.

రేటింగ్:  3.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.