ENGLISH | TELUGU  

సల్మాన్ ఒక్కడే కాదు!

on May 7, 2015

బాలీవుడ్ తారలకి సినిమా కష్టాలు తప్పడం లేదు.... ఒకరి తర్వాత కటకటాలు లెక్కంటేందుకు పోటీపడుతున్నారు. మొన్న మోనికా బేడి, నిన్న సంజయ్‌దత్‌, ఇవాళ సల్మాన్ ఖాన్. వీళ్లే కాదు ఇంకా ఈ జాబితాలో చాలా మంది తారలున్నారు. పలు రకాల కేసుల్లో దోషులుగా తేలిన వారు కొందరైతే, అభియోగాలు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగిన, తిరుగుతున్న వారు ఇంకొందరు.

నిన్నటి వరకూ మేకప్, పేకప్ అంటూ సందడి చేసిన కండలవీరుడుని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఐదేళ్లు శిక్ష విధించింది. హిట్ అండ్ రన్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోజు సల్మాన్ మద్యం తాగి కారు నడుపుతూ ఒకరి మృతికి కారణమయ్యాడని, దీనికి సంబంధించి పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుతో పాటూ కృష్ణ జింకలను వేటాడిన కేసులోనూ సల్మాన్‌ను సెషన్స్‌ కోర్టుగా దోషిగా తేల్చి అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే శిక్ష అమలుపై రాజస్థాన్‌ హైకోర్టు స్టే విధించడంతో భాయ్‌ బెయిల్‌పై బయటే తిరుగుతున్నాడు. తాజా తీర్పుతో కటకటాలు లెక్కెట్టడం ఖాయం అయిపోయింది.

ఖల్‌ నాయక్‌ సంజయ్ దత్...వెండితెరపైనే కాదు నిజజీవితంలోనూ ఖల్‌నాయకేనని తేలిపోయింది. 1993లో ముంబైలో జరిగిన వరస పేలుళ్ల ఘటనకు సంబంధించి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో సంజయ్‌దత్‌ శిక్ష అనుభవిస్తున్నారు. టాడా కోర్టు మొదట సంజూబాబాకి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆయన పై కోర్టులకు వెళ్లినా ఎదురు దెబ్బే తగిలింది. సుప్రీం కోర్టు ఆయనకి అయిదేళ్లు శిక్ష ఖరారు చేయడంతో ప్రస్తుతం జైల్లో కాలం గడుపుతున్నాడు. పెరోల్‌ పై అప్పుడప్పుడు బయటకి వస్తూ ముందుగా సంతకం చేసిన ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాడు. బాలీవుడ్ పటౌడీ సైఫ్‌ ఆలీఖాన్‌ పై కూడా పెద్ద అభియోగాలే ఉన్నాయి. సల్మాన్‌ఖాన్‌తో పాటు కృష్ణ జింకను వేటాడిన కేసులో సైఫ్‌ ప్రమేయం కూడా ఉందని రుజువైంది. అదే కాకుండా 2012లో ముంబై తాజ్‌హోటల్‌లో దిగిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రవాస భారతీయుడు ఇక్బాల్‌ శర్మపై... తన మిత్రబృందంతో కలసి సైఫ్ దాడికి దిగాడనే ఆరోపణలున్నాయి.  ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో నడుస్తోంది.

సల్మాన్‌  వాంటెడ్‌  లో మెరిసిన ఇందర్‌కుమార్‌....కూడా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఇంటికి పిలిపించి అత్యాచారం చేయడమే కాదు.. శారీరకంగా వేధించాడని ఓ మోడల్‌ ఆరోపించింది. పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అతనికి బెయిల్‌ మంజూరైంది. ఈ కేసు ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. తెలుగులో తాజ్ మహల్ తో సుపరిచితమైన మోనికాబేడీ కూడా ఇందుకు అతీతం కాదు. నకిలీ పాస్‌పోర్టు కేసులో దోషిగా తేలింది... చంచల్‌గుడ జైల్లో కొన్నేళ్లు జైలు శిక్ష అనుభవించింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ అబూసలేంతో మోనికాకు సంబంధాలున్నాయని తేలింది.

ఇంట్లో పనిమనిషిని అత్యాచారం చేసిన కేసులో షైనీ అహుజాకు ఏడేళ్లు శిక్ష విధించింది. ఆ తర్వాత నెల రోజులకే బెయిల్‌ మంజూరైనప్పటికీ కేసు ప్రభావం అతని కెరీర్‌పై పడింది. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ మధుర్‌ భండార్కర్‌కు....తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ నటి ప్రీతి జైన్‌ కోర్టుకెక్కింది. ఈ కేసులో మధుర్‌ని అరెస్ట్‌ చేసినా...ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కోర్టు కేసుతో ఎనిమిదేళ్ల తన జీవితం నాశనమయ్యిందంటూ మధుర్‌ ఎన్నోసార్లు బాధపడ్డాడు. సుప్రీం కోర్టులో ఈ  కేసు విచారణ నడుస్తోంది.

మాదక ద్రవ్యాల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు నటుడు  ఫర్దీన్‌ ఖాన్‌. ఈ కేసులో కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు... ఆ తర్వాత న్యాయస్థానంలో క్షమాపణలు కోరి బయటపడ్డారు. బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ మృతికి సూరజ్‌ పాంచోలి కారకుడన్న అనుమానంతో కేసు నమోదైంది. ఆ కేసు నడుస్తోంది. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న మరో నటుడు విందు దారా సింగ్‌. ప్రముఖ నటుడు దారా సింగ్‌ కుమారుడైన విందు దారాసింగ్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసులు నమోదై ఉన్నాయి..

వీళ్లే కాదు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బోఫోర్స్‌ కుంభకోణంలో అమితాబ్‌ ప్రమేయం ఉందని అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆ కేసులో ఆ తర్వాత ఆయనకి క్లీన్ చిట్‌ లభించింది. అంతే కాదు. లైసెన్స్‌ లేకుండా తుపాకీ దగ్గర ఉంచుకొని ముంబై ఎయిర్‌పోర్టులో ఓసారి అధికారులకు పట్టుబడడం కూడా కలకలం రేపింది.

అయితే ఆనందాన్ని అందించే వీరిలో క్షమించరాని నేరం చేసిన వాళ్లకి శిక్ష విధించడంలో తప్పులేదు. కానీ ఎంతోమందికి భవిష్యత్ ఇచ్చి, పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న సల్మాన్ కు శిక్ష అంటే సినీ జనం తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సల్మాన్ తెలిసి చేసిన తప్పుకాదు అది. తాగిన మైకంలో అలా చేశాడంతే. అయితే అది తప్పుకాదు అని సమర్థించడంలేదు కానీ.... ఇంతకన్నా పెద్ద పెద్ద తప్పులు చేసిన మహానుభావులు సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్నారు. మైకంలో చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు కండలవీరుడు.

దేశద్రోహానికి పాల్పడిన కసబ్ ను కొన్నాళ్లు పాటూ కోట్లు పెట్టి పెంచిపోషించాం. మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు వికారుద్దీన్ ని ఎన్ కౌంటర్ చేస్తే నిరసనలు తెలిపి తెగ బాధపడిన మహానుభావులున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు చేసి హాయిగా తప్పించుకు తిరుగుతున్న వారినీ చూస్తూఊరుకుంటున్నాం. కోట్లలో కుంభకోణాలకు పాల్పడిన వారికీ పదవులు కట్టబెట్టాం. బ్యాక్ గ్రౌండ్ చూసుకుని ఘోరాలకు పాల్పడే వ్యక్తులను పెద్దమనుషులుగా పూజిస్తున్నాం. కానీ జనాలకు ఆనందాన్ని పంచిపెట్టే సినీ నటులు కొందరు మాత్రం తెలియక చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. సినీ హీరోలకు శిక్షలు వేసినా-వేయకున్నా జనాలు పట్టించుకోరు కానీ..ప్రజల అమాయకత్వంతో చెలగాట మాడే వ్యక్తులను వదిలిపెడితే ఊరుకోరు.

ఇందులో న్యాయస్థానం తీర్పుని తప్పుపట్టడం లేదు...హీరోలైనంత మాత్రం తప్పులు ఒప్పులైపోవాలనీ లేదు. కానీ నిజమైన నేరస్థులందర్నీ ఇంతే ధైర్యంగా శిక్షించినప్పుడే....సమన్యాయం పాటించినట్టు. అప్పుడే న్యాయస్థానాలపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వాశం ఉంటుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.