2.ఓ ట్రైలర్... వావ్!
on Nov 3, 2018
రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ ట్రయిలర్లో ఓ డైలాగ్ వుంది... ‘వావ్’ అని! ఆల్రెడీ ట్రయిలర్ చూస్తూ కళ్లు అప్పగించిన ప్రేక్షకులు అప్పటికి ఒక పదిసార్లు ‘వా......వ్!’, ‘వా.............వ్!’ అని అనుంటారు! అంత అద్భుతంగా శంకర్ ట్రయిలర్‌ని రూపొందించారు. రజనీ, శంకర్ కాంబినేషన్లో ‘2.ఓ’ మూడో సినిమా! ముఖ్యంగా ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న సినిమా! నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న సినిమా! 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా! అన్నీటి కంటే ముఖ్యంగా శంకర్ పగలూ రాత్రి కష్టపడి ప్రాణం పెట్టి తీసిన సినిమా! అందుకని, ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్లో వున్నాయి. లీకయిన టీజర్, తరవాత అధికారికంగా విడుదల చేసిన టీజర్ అంచనాలను మరింత పెంచితే... శనివారం విడుదల చేసిన ట్రయిలర్ అంచనాలు ఎన్ని అయినా పెట్టుకోండని అన్నట్టు వుంది.
‘2.ఓ’ ఒక విజువల్ వండర్! ఇందులో గ్రాఫిక్స్ మాత్రమే కాదు... మితిమీరిన సెల్ ఫోన్ వాడకాన్ని, సెల్ ఫోనుల వచ్చే సమస్యలను చర్చించారు. సెల్ ఫోన్ వాడుతున్న మనుషులపై ఒక మనిషి రూపంలో వున్న పక్షి యుద్ధానికి దిగితే... చిట్టి రోబో ‘2.ఓ’ వచ్చి ఎలా కాపాడాడు? అనేది కథ. దాన్ని శంకర్ ఏ స్థాయిలో చిత్రీకరించాడంటే... ‘వావ్’ అనేలా! చిట్టి రోబో, పక్షి మధ్య యుద్ధంతో పాటు.. రజనీకి, అమీ జాక్సన్‌కి మధ్య రొమాన్స్‌కి ఏమాత్రం లోటు లేదు. శంకర్ అన్నీ చూపించారు. రజనీ, అక్షయ్ నటనకు తోడు శంకర్ దర్శకత్వ ప్రతిభ, రెహమాన్ సంగీతం సినిమాని ఉన్నత స్థాయిలో నిలబెడతాయని ట్రయిలర్ చూస్తే అర్థమవుతుంది.