ENGLISH | TELUGU  

రివ్యూ : రారండోయ్ వేడుక చూద్దాం

on May 26, 2017


కొత్త‌గా మెగా ఫోన్ ప‌ట్టే ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ఓ భ‌యంక‌రమైన అల‌వాటు ఉంది. త‌మ ప్ర‌తిభ‌, త‌మ ఆలోచ‌న‌లు, ఐడియాల‌జీ అంతా తొలి సినిమాతోనే చూపించేస్తుంటారు. రెండో సినిమా వ‌చ్చేస‌రికి... చేతులెత్తేస్తారు. అందుకే ద్వితీయ వీఘ్నాలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. తొలి సినిమా హిట్ చేసుకొన్న ద‌ర్శ‌కుల‌కు రెండో సినిమాతో `ఫ్లాపు` ఎదుర‌వుతుంది.  ఇప్పుడు క‌ల్యాణ్ కృష్ణ వంతు వ‌చ్చింది. `సోగ్గాడే చిన్ని నాయ‌న‌` సినిమాతో నాగార్జున‌కు రూ.50 కోట్ల సినిమా ఇచ్చాడు క‌ల్యాణ్ కృష్ణ‌. ఆ హోప్‌తోనే చైతూని క‌ల్యాణ్ చేతుల్లో పెట్టేశాడు. మ‌రి... క‌ల్యాణ్ కృష్ణ నాగార్జున న‌మ్మ‌కాన్ని మ‌రోసారి నిల‌బెట్టుకొన్నాడా?  లేదంటే సెంటిమెంట్‌కి కొన‌సాగిస్తూ.. ద్వితీయ వీఘ్నానికి దొరికేశాడా?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.


* క‌థ‌

భ్ర‌మ‌రాంబ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌)ని నాన్న ఆది (సంప‌త్‌రాజ్‌) అంటే ప్రాణం.  ఏం చేసినా,నాన్న‌కు చెప్పేయాల్సిందే. ఆది కూడా త‌న కూతురిపై పంచ ప్రాణాలు పెట్టుకొంటాడు. ఓ పెళ్లిలో.. శివ (నాగ‌చైత‌న్య‌) ప‌రిచ‌యం అవుతాడు. భ్ర‌మ‌రాంబ అల్ల‌రి చూసి ఆక‌ర్షితుడ‌వుతాడు. ప్రేమిస్తాడు. భ్ర‌మ‌రాంబ పైచ‌దువుల కోసం విశాఖ‌ప‌ట్నం వెళ్తుంది. అక్క‌డ భ్ర‌మ ఒంట‌రిత‌నాన్ని, భ‌యాన్ని దూరం చేస్తాడు శివ‌. `నువ్వు ప్రేమిస్తే నాకు ముందే చెప్పేయ్‌.. ఇప్పుడే మాట్లాడ‌డం మానేస్తా` అని బెదిరిస్తుంది భ్ర‌మ‌రాంబ‌. దాంతో శివ త‌న‌ ప్రేమ‌ని మ‌న‌సులోనే దాచుకోవాల్సివ‌స్తుంది. అయితే ఓ సంద‌ర్భంగా శివ‌ది స్నేహం కాదు, ప్రేమ అని తెలిసిపోతుంది. `మీ అబ్బాయిలంతా ఇంతే` అంటూ చీద‌రించుకొని వెళ్లిపోతుంది. మ‌రి శివ‌, భ్ర‌మ ఎలా క‌లిశారు?   అనేదే... `రారండోయ్ వేడుక చూద్దాం` క‌థ‌.

* విశ్లేష‌ణ‌

నిన్నే పెళ్లాడ‌తా లాంటి సినిమా చేయాలి అని చైతూ ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నాడు. స‌రిగ్గా క‌ల్యాణ్ కృష్ణ కూడా అదే సీడీ చూసి ఈ క‌థ త‌యారు చేసుకొని ఉంటాడు. ప్ర‌తీ ఫ్రేమూ క‌ల‌ర్‌ఫుల్‌గా, న‌టీన‌టుల‌తో ఫుల్లుగా నింపేశాడు. ఏ సీన్ చూసినా కృష్ణ‌వంశీ సినిమాలో మాదిరిగా హ‌డావుడి క‌నిపిస్తుంటుంది. అయితే.. క‌థ‌లో లోపం వ‌ల్ల‌నేమో.. ఆయా స‌న్నివేశాల‌న్నీ తేలిపోతుంటాయి. పెళ్లి.. అక్క‌డ హంగామా ఇవ‌న్నీ రంగుల హ‌రివిల్లులా ఉన్నా సాగ‌దీసిన ఫీలింగ్ క‌లుగుతుంది. విశ్రాంతికి ముందు సినిమా కాస్త గాడిన ప‌డిట్టు అనిపిస్తుంది. అయితే ద్వితీయార్థం ప్రారంభ‌మ‌య్యాక క‌థ మ‌ళ్లీ మామూలే. ఇంత సాదాసీదా క‌థ‌కు నాగార్జున ఎలా ఒప్పుకొన్నాడో అర్థం కాదు. బ‌హుశా.... నిన్నే పెళ్లాడ‌తా ఫ్లేవ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ఒప్పుకొని ఉంటాడు. క‌థానాయికలో క‌న్‌ఫ్యూజ‌న్‌.. ఏం కావాలో తెలియ‌క‌పోవ‌డం.. ప్రేమ‌, స్నేహం మ‌ధ్య ఉన్న తేడా అర్థం చేసుకోక‌పోవ‌డం వీటితో సంఘ‌ర్ష‌ణ కావ‌ల్సినంత పుట్టించొచ్చు. ద‌ర్శ‌కుడు కూడా అదే అనుకొన్నాడు. కానీ తాను అనుకొన్న‌ది వేరు.. చూపించింది వేరు. క‌థ‌లో విష‌యం లేక‌పోవ‌డంతో సన్నివేశాల‌న్ని వీలైనంత సాగ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నించి, ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించాడు. ర‌కుల్ క్యారెక్ట‌రైజేష‌న్ బాగున్నా.. ఆ పాత్ర‌ని ప్రేక్ష‌కుడు ఓన్ చేసుకోలేడు. దాంతో.. క‌థ‌లో లీనం అవ్వ‌డం క‌ష్టం అవుతుంది. తెర‌పై ఏం జ‌రుగుతుందో, ఏం జ‌ర‌గ‌బోతోందో ప్రేక్ష‌కుడికి ఈజీగానే తెలిసిపోతుంటుంది. దాంతో.. ఆ కాస్త థ్రిల్ కూడా మిస్స‌వుతుంది.


* న‌టీన‌టులు

చైతూ ప‌రంగా... మైన‌స్సులేం క‌నిపించ‌వు. శివ పాత్ర‌కు ఎంత చేయాలో అంతే చేశాడు. బ్రేక‌ప్ స‌మ‌యంలో చైతూ చెప్పిన డైలాగుల‌కు విజిల్స్ ప‌డ‌తాయి. భ్ర‌మ‌రాంబ పాత్ర ర‌కుల్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ చేయ‌లేరేమో అన్నంత బాగా చేసింది. సినిమా మొత్తం ప‌రికిణీ ఓణీలో క‌నిపించి ఆక‌ట్టుకొంది. వీరిద్ద‌రి జంటే.. ఈ సినిమాని కాస్తో కూస్తో చూసేలా చేసింది. జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి డిగ్నిటీ నిండిన పాత్ర‌లో డీసెంట్‌గా న‌టించాడు. సంత‌ప్ రాజ్ న‌ట‌న కూడా మెప్పిస్తుంది. తెర‌పై ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్లు ఉన్నా.. ఒక్క‌రూ కామెడీ పండించ‌లేక‌పోయారు. ఉన్నంత‌లో వెన్నెల కిషోర్ కాస్త బెట‌ర్‌.

* సాంకేతికంగా...

దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు థియేట‌ర్ వ‌ర‌కూ బాగానే ఉన్నాయి.. భ్ర‌మ‌రాంబ‌కు న‌చ్చేశా.. పాట హుషారుగా సాగింది. నేప‌థ్య సంగీతం మాత్రం సో..సోగానే ఇచ్చాడు. కెమెరా వ‌ర్క్ ఓకే అనిపించింది. ద‌ర్శ‌కుడు ఎడిట్ చేయాల్సిన స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా నిదానంగా సాగింది. కొన్ని స‌న్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. ర‌కుల్ క్యారెక్ట‌రైజేష‌న్ తో పాటు.. మిగిలిన పాత్ర‌ల‌పై ద‌ర్శ‌కుడు దృష్టి పెట్టుంటే బాగుండేది. ఇన్ని వన‌రులు, ఇంత బ‌డ్జెట్ చేతిలో ఉన్నా... దాన్ని స‌రిగా వాడుకోలేపోయాడు క‌ల్యాణ్ కృష్ణ‌.


* లాస్ట్ పంచ్ :  రారండోయ్.. అంత తొంద‌రేం లేదు.. మెల్లాగా చూడొచ్చు లెండి!


రేటింగ్‌: 2.25

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.