కొంచెమైనా సిగ్గు ఉండాలి.. తెలుగు హీరోలపై ఫైర్..!
on Jun 9, 2025
"పర భాషలు నేర్చుకోండి, కానీ మాతృ భాషను మరువకండి" అని భాషా ప్రేమికులు కోరుతున్నా.. కొందరు మాతృ భాషను మరుస్తున్నారు. ముఖ్యంగా తెలుగునాట తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గుతోంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అయితే.. ఇంగ్లీష్ మాట్లాడటాన్ని గొప్పగా భావిస్తూ, తెలుగుని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి రమాప్రభ, సీనియర్ నటుడు జానీ లీవర్ గళం విప్పారు. తెలుగు నటీనటులకు తమదైన శైలిలో చురకలు వేశారు.
ఇటీవల రమాప్రభ యూట్యూబ్ లో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. అందులో తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. ఇంకో విశేషం ఏంటంటే.. జానీ లీవర్ ముంబై నుంచి వచ్చి మరీ తెలుగు భాష పట్ల తన ప్రేమను చాటుకున్నారు.
కొందరు తెలుగు నటులు ఇంటర్వ్యూలలో సినిమా గురించి చెప్పమంటే.. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని జానీ లీవర్ ఇమిటేట్ చేసి చూపించారు. "మేము ముంబైలో పెరిగినప్పటికీ మాకు తెలుగు మీద చాలా ప్రేమ. ఎందుకంటే అది మాతృ భాష. కానీ తెలుగు నేల మీద ఉంటున్న నటులు మాటలు మాటల్లో తెలుగు ఉండట్లేదు. తెలుగు చచ్చిపోతుంది. మన మాతృ భాష తెలుగును ప్రేమించాలి, తెలుగులో మాట్లాడాలి." అని జానీ లీవర్ అన్నారు.
రమాప్రభ మాట్లాడుతూ.. "జానీ లీవర్ గారు ముంబైలో ఉన్నా తెలుగును మర్చిపోలేదు. కానీ, ఇక్కడున్న వారు తెలుగు మాట్లాడటంలేదు. కొంచెమైనా సిగ్గు ఉండాలి. బతుకుదెరువు కోసం పర భాషను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ మన భాషను అవమానపరచకండి. మాతృ భాషను రక్షించండి అని అడుక్కునే స్థితికి వచ్చాము. సిగ్గుండాలి మనకు. మన భాషను మనం అడుక్కోవాలా?" అని ఆవేదన వ్యక్తం చేశారు.
"తెలుగు భాషకు పట్టం కట్టండి", "మాతృ భాషను రక్షించండి" అని ప్లకార్డులు చూపిస్తూ రమాప్రభ, జానీ లీవర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు వీరికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
