బెల్లంకొండ హిట్ కొట్టినట్లే!
on Aug 3, 2019
"ఎన్నాళ్లో వేచిన విజయం.. ఈనాడే ఎదురవుతుంటే.." అని పాడుకుంటున్నాడు యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. అతను కథానాయకుడిగా నటించిన 'రాక్షసుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు చక్కని వసూళ్లను సాధించి, విజయం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. శుక్రవారం (ఆగస్ట్ 2) తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సుమారు రూ. 2 కోట్ల షేర్ వచ్చిందనేది ట్రేడ్ విశ్లేషకుల అంచనా. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అటు నిర్మాతల, ఇటు డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.
అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించడం, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మినహా మిగతావాళ్లు పెద్దగా నమ్మకం పెట్టుకోని రమేశ్‌వర్మ డైరెక్ట్ చెయ్యడంతో 'రాక్షసుడు'పై మొదట ఎవరికీ అంతగా అంచనాలు లేవు. అయితే మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా బాగుందనే టాక్ రావడం, అతి తక్కువ సమయంలోనే అది విస్తరించడంతొ షోకి షోకీ కలెక్షన్లు పెరుగుతూ పోయాయి. తాజా సమాచారం ప్రకారం శనివారం మార్నింగ్ షోకు మంచి కలెక్షన్లు వచ్చాయి. సోమవారం నుంచి థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తానికి హిట్ టాక్ రావడంతో ఇన్నాళ్లకు నిర్మాత బెల్లంకొండ సురేశ్‌తో పుత్రోత్సాహం తొణికిసలాడుతోంది.