రజనీకాంత్ అభిమానుల దెబ్బకు...
on Aug 6, 2019
తమిళనాట రజనీకాంత్ అభిమానుల దెబ్బకు నిర్మాత ఇశారి గణేష్ దిగొచ్చారు. హీరో ‘జయం’ రవి, దర్శకుడు ప్రదీప్ రంగనాథ్‌తో మాట్లాడి ఏకంగా సినిమాలో ఓ సన్నివేశాన్ని తొలగించారు. లేదంటే సినిమా విడుదలకు ఎన్ని సమస్యలు ఎదురవుతాయోనని భయపడ్డారు. అదీ రజనీ అభిమానుల పవర్! అసలు వివరాల్లోకి వెళితే... ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో ‘కోమలి’ సినిమాలో నటించారు. పంద్రాగస్టుకు విడుదల కానుంది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సెటైరికల్ సీన్ ఒకటి ఉంది. అదేంటో చెప్పేముందు సినిమా కాన్సెప్ట్, ట్రైలర్ గురించి చెప్పాలి. హీరో పదహారేళ్లు కోమాలో ఉండి బయటకొస్తాడు.
టీవీ ఆన్ చేస్తే... తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఫ్యాన్స్‌కి రజనీకాంత్ ప్రామిస్ చేస్తున్న ప్రసంగం ప్లే అవుతుంటుంది. అప్పుడు ‘ఇది ఏ సంవత్సరం?’ అని స్నేహితులను అడుగుతాడు. వారు ‘2016’ అని సమాధానం ఇస్తారు. ‘కాదు... 1996’ అని హీరో అంటాడు. జయలలిత పాలనను ప్రస్తావిస్తూ 1996లో రజనీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ రాలేదనే అంశాన్ని వ్యంగ్యంగా, వినోదంగా చూపించారు. ఈ సన్నివేశంపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ కోమలి’, ‘తమిళనాడు భవిష్యత్తు రజనీకాంత్’ అంటూ హడావిడి చేశారు. ‘జయం’ రవి, దర్శకుడు ప్రదీప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘కోమలి’ ట్రైలర్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందంటే... నిర్మాతకు కమల్ హాసన్ ఫోన్ చేసి ఆ సీన్ గురించి మాట్లాడేంత! పరిస్థితులు ఉద్రిక్తంగా మారబోతున్నాయని అర్థం చేసుకున్న నిర్మాత... హీరో, దర్శకుడితో మాట్లాడి సినిమాలో ఆ సీన్ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అభిమానులను హర్ట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని, వినోదాత్మకంగా ఆ సీన్ పెట్టినట్టు దర్శకుడు అన్నారు. రజనీకాంత్ అభిమానులు వీరి స్పందన పట్ల సంతోషిస్తారో? లేదో? చూడాలి.