ENGLISH | TELUGU  

రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ

on Oct 18, 2017

తారాగణం: రవితేజా, మెహ్రిన్ కౌర్, రాధిక, ప్రకాశ్ రాజ్, సంపత్, శ్రీనివాసరెడ్డి...
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు

తెలుగు మాస్ హీరోకి.. ‘అడవిరాముడు’ చెప్పిన సక్సెస్ ఫార్ములా ఏంటంటే... ‘మనం లాజిక్కులకు అందం... సో... మీరు అలా వెళ్లిపోండి’ అని. ఇక్కడ హీరో... వందమందిని ఒక్కడే కొడితే తప్పులేదు. ఇక్కడ పిస్టల్ లో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్.. హీరోని చూసి వెనక్కి వెళ్లిపోతే తప్పులేదు. ఇక్కడ హీరోకు కోపం వస్తే... ఆకాశం నుంచి పిడుగులు పడతాయ్. ఉరుములు ఉరిముతాయ్..  తప్పులేదు. ఏనుగులొచ్చి హీరోగారి మెడలో పూలమాలలేసి... జేజేలు కొడతాయ్.. తప్పులేదు. పంచభూతులు కూడా హీరో చెప్పినట్టు వింటాయ్.. తప్పులేదు. ఇక్కడ మాస్ హీరో అంటే... మనిషికి ఎక్కువ... దేవుడికి కా....స్త తక్కువ. ‘అడవి రాముడు’ తర్వాత జనాలు అలా ఫిక్సయిపోయారు. అయితే... ఇదంతా హీరో పాయింట్ ఆఫ్ యూలో మాత్రమేనండోయ్. కథలో, కథనంలో కాదు. వాటిల్లో మాత్రం కచ్చితం లాజిక్కు ఉండాలి.  లేకపోతే.. జనాల చేతుల్లో ఖర్సయిపోతాం. అంచేత చెప్పేదేంటంటే.. ఎలాంటి సినిమాకైనా... కథ, కథనాల విషయంలో గ్రౌండ్ వర్క్ అవసరమే. కాకపోతే.. మాస్ హీరో సినిమా అంటే.. హీరోగారి ఇమేజ్ మీద కూడా వర్కవుట్ చేయాలి. అదన్నమాట విషయం. 

ఈ బుధవారం మన మాస్ మహరాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఇందులో రవితేజ అంధుడిగా నటించాడు. రవితేజ ఏంటీ... అంధునిగా నటించడం ఏంటి? కొంపదీసి ఇదేమన్నా ప్రయోగాత్మక, సందేశాత్మక, కరుణరసాత్మక చిత్రమా? అనే అనుమానాలు రావడం సహజం. కానీ.. అలాంటిదేం లేదండి. ఇది ఊర మాస్ సినిమా. ఇలాంటి కథలో రవితేజ అంధుడు అవ్వడమే ఇక్కడ వైరైటీ. అసలు రవితేజ బిరుదే.. ‘మాస్ మహారాజా’. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? అనిల్ రావిపూడి జనం మెచ్చేలా తీశాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ముందు కథలోకెళ్దాం. 

కథ:-
ఓ సిన్సియర్ పోలీస్ అధికారి. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మయి అంటే... పోలీసాయనకు పంచప్రాణాలు. ఓ దుర్మార్గుడి కబంద హస్తాల్లో చిక్కుకొని ఉన్న ప్రమాదకరమైన ఊరుకు ఆ పెద్దాయన ట్రాన్సఫర్ అవుతాడు. చూసీచూడనట్టు వెళ్లమని సాటి అధికారులు చెప్పినా ఆయన వినడు. ముందు వాడి మనుషుల్ని... ఆ తర్వాత వాడి తమ్ముడ్ని ఎన్ కౌంటర్ చేస్తాడు. దాంతో పగబట్టిన ఆ దుర్మార్గుడు.. ఆ పోలీస్ అధికారి కూతుర్ని, అతనికి సపోర్ట్ చేసిన పోలీసుల్ని ఎత్తుకొస్తాడు. కూతురికోసం, సహచరులకోసం ఆ పెద్దాయన.. వాడి అడ్డాలోకెళ్తాడు. అక్కడే.. ఆ పోలీస్ అధికారినీ.. సహకరించిన పోలీసులను దారుణంగా చంపేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం పారిపోతుంది. ఆ అమ్మాయి కోసం విలన్ వెతుకుతుంటాడు. పోలీసులేమో.. ఆ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తరుణంలో కథలోకి ‘ఒకడు’ ఎంటరవుతాడు. పైగా వాడు అంధుడు. వాడు ఆ అమ్మాయిని కాపాడతాడు. ఎలా కాపాడతాడు? అనేది సినిమా. 

విశ్లేషణ:-
ఇలాంటి కథలు కోకొల్లలు వచ్చాయ్. ఒక్కడు,  భద్ర, సరైనోడు... ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయ్. ఇది కూడా అలాంటి కథే. అయితే.. ఈ కథలో హీరో ఆంధుడు అవ్వడం వైరైటీ. జనాలకు కొత్త అనుభూతిని కలగించింది అదే. దేవుడు.. ఒకటి తీసుకుంటే.. తీసుకున్న దానికంటే పదింతలు శక్తిని ఇస్తాడంట. ఇందులో హీరో ప్రవర్తన అలాగే ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లున్నోళ్ల కన్నా.. అంధులే నయం అన్నట్టు చూపించాడు. అందులోంచి పుట్టుకొచ్చే కామెడీ... ఆ నేపథ్యంలో ఎస్టాబ్లీష్ అయ్యే... యాక్షన్ ఎలిమెంట్స్.. మాస్ కట్టిపడేస్తాయ్.

కథ పాతదైనా.. అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యింది అక్కడే. కథలో భాగమైన సన్నివేశాలన్నీ బాగానే తీశాడు కానీ.. కథకు సంబంధంలేని ఓ బ్యాంక్ రాబరీ సీన్ ఉంది. దాంతో మాత్రం ప్రేక్షకులను ఇరేటేట్ చేశాడు. అంతేకాదు... ప్రీ క్లయిమాక్స్ లో లైట్లు తీసేసి విలన్ ని మాయ చేస్తాడు హీరో. ఆ సీన్ తో నిజానికి సినిమా అయిపోయింది. అక్కడే విలన్ ని చంపేయొచ్చు. కానీ.. రాధిక పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేదనుకున్నాడో ఏమో.. సినిమాను కాస్త సాగదీశాడు. రాధిక కోసం రెండు ఎమోషనల్ సీన్లు. రవితేజ హీరోయిజం పీక్స్ లో చూపించే మరో సీన్.. ఓ భారీ క్లయిమాక్స్ ఫైట్.. ఇవన్నీ పెట్టేశాడు. అయితే... అవన్నీ బావున్నాయ్.

ఇక రవితేజ.. సినిమా కొంచెం బావుంటే.. తన నటనతో సినిమాకు ఇంకాస్త మైలేజ్ తీసుకొచ్చే నటుడు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. యావరేజ్ అనిపించే సినిమాను.. రవితేజ ఎనర్జీ సూపర్ హిట్ స్థాయిలో నిలబెట్టింది. అంధుడిగా అదరహో అనిపించేశాడు. కామెడీతో జనాలను పగలబడి నవ్వించాడు. హీరోయిజంతో మాస్ మహరాజా అనిపించేశాడు. హీరోయిన్ మెహ్రిన్ కౌర్ ది కథకు వెన్నెముక లాంటి పాత్ర. నటనకు అవకాశం ఉన్న రోల్. చాలాబాగా చేసింది. రాధిక గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. మిగిలిన వాళ్లందరూ చక్కగా చేశారు. 
సాంకేతికంగా చెప్పుకుంటే.. సాయికార్తీక్ నేపథ్య సంగీతం బావుంది. పాటలు అస్సలు అర్థం కావు. తమ్మిరాజు ఎడిటింగ్, మోహనకృష్ణ కెమెరా బావున్నాయ్. నిర్మాత ఖర్చకు వెనకాడలేదు. లావిష్ గా తీశాడు. 
టోటల్ గా... లాజిక్కులు పక్కనపెట్టి చూస్తే... అందరికీ నచ్చే సినిమా ఇది. 

రేటింగ్:- 3/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.