అప్పుడు 'ఆర్ఎక్స్ 100'... ఇప్పుడు 'గుణ 369'!
on Apr 26, 2019
సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్! సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మూడు అక్షరాల సెంటిమెంట్ ఉందని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. లేటెస్ట్ 'మహర్షి'తో పాటు అంతకు ముందు మూడు అక్షరాల టైటిళ్లతో ఆయన చాలా సినిమాలు చేశారు. టైటిల్లో 'సున్నా' ఉండాలనేది గోపీచంద్ సెంటిమెంట్. 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయకు టైటిల్లో నంబర్ ఉండటం సెంటిమెంట్ ఏమో?
బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమాకు 'గుణ 369' టైటిల్ ఖరారు చేశారు. సినిమాలో హీరో పేరు గుణ. మరి, 369 ఏంటి? అంటే... ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. 'ఆర్ఎక్స్ 100'కి బైక్ పేరు టైటిల్‌గా పెట్టారు. అందులో '100' ఉంది. లేటెస్ట్ సినిమాలో '369' ఉంది. టైటిల్లో నంబర్ ఉండటమే కాదు... రెండిటికీ మరో కామన్ థింగ్ ఉంది. రెండూ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన కథలే. ఈ రెండు సినిమాల మధ్య చేస్తున్న మరో సినిమా 'హిప్పీ'లో ఏ నంబరూ లేదు. 'గుణ 369' తరవాత సినిమా టైటిల్లో కూడా నంబర్ ఉంటే... కార్తికేయకు నంబర్ సెంటిమెంట్ అనుకోవలసిందే. 'గుణ 369' షూటింగ్ ఆల్మోస్ట్ చివరకు వచ్చింది. ఈ నెలాఖరు నుంచి మే 15 వరకు భారీ షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నారు. దాంతో ఒక పాట మినహా సినిమా పూర్తి కానుంది.