శృతి హాసన్ పైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు!
on Jun 20, 2023

'బాహుబలి' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమాలతో నిరాశపరుస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ఆయన నటించిన 'సాహో' సినిమా నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడంతో.. శ్రీరాముడు, ప్రభాస్ ఇమేజ్ కలిసొచ్చి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని భావించారంతా. కానీ నాలుగో రోజు కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. సెలవులు లేకపోవడం, పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఇక పుంజుకునే అవకాశాలు లేవంటున్నారు. ఇక బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని, నష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే 'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ కి ఇది వరుసగా మూడో పరాజయం అవుతోంది. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రం 'సలార్'పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా ఈ సినిమాకి శృతి హాసన్ సెంటిమెంట్ తోడైంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆ స్థాయిలో ఎదురుచూస్తున్న చిత్రం 'సలార్' అని చెప్పొచ్చు. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడం దీనికి ప్రధాన కారణం. ప్రశాంత్ నీల్ కి తోడు శృతి హాసన్ రూపంలో పాజిటివ్ సెంటిమెంట్ తోడైంది. ఫ్లాప్స్ లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చే హీరోయిన్ గా శృతికి పేరుంది. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. పరాజయాలతో కెరీర్ ని ప్రారంభించిన శృతికి తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్'లో నటించే అవకాశం లభించింది. 'ఖుషి' నుంచి 'గబ్బర్ సింగ్' వరకు పదేళ్లపాటు పవన్ వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. మధ్యలో 'జల్సా' మాత్రమే ఆకట్టుకుంది. అలాంటి సమయంలో శృతి హీరోయిన్ గా నటించిన 'గబ్బర్ సింగ్' ఆమెకి మొదటి ఘన విజయాన్ని అందించడమే కాకుండా, అప్పటికి పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అప్పటి నుంచి అదే సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వస్తోంది శృతి. 'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో పరాజయం అందుకున్న అల్లు అర్జున్ కి 'రేసుగుర్రం' రూపంలో బ్లాక్ బస్టర్ అందించింది. '1 నేనొక్కడినే', 'ఆగడు' వంటి పరాజయాల తర్వాత మహేష్ బాబుకి 'శ్రీమంతుడు' రూపంలో బ్లాక్ బస్టర్ అందించింది. చిరంజీవి గత చిత్రాలు 'ఆచార్య' డిజాస్టర్ కాగా, 'గాడ్ ఫాదర్' పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. అలాంటి సమయంలో శృతి హీరోయిన్ గా నటించిన 'వాల్తేరు వీరయ్య' రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. ఇక ప్లాప్స్ లో ఉన్న రవితేజకు 'బలుపు', 'క్రాక్' రూపంలో రెండుసార్లు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది శృతి. ఇలా ప్లాప్స్ లో ఉన్న హీరో సరసన శృతి హాసన్ నటిస్తే.. సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఆయా హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇదే సెంటిమెంట్ 'సలార్'కి రిపీట్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



