Akhanda 2: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అఖండ-2..!
on Dec 5, 2025
.webp)
అఖండ-2 వాయిదా
ఓపెనింగ్స్ పై ప్రభావం పడనుందా?
కొత్త విడుదల తేదీ ఏది?
బడా సినిమాలకు భారీ ఓపెనింగ్స్ కీలకం. కానీ, ఇప్పుడు 'అఖండ-2' భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాన్ని చేజేతులారా మిస్ చేసుకుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Akhanda 2: Thaandavam)
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'అఖండ 2: తాండవం'. 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ మూవీ నేడు(డిసెంబర్ 5) భారీస్థాయిలో విడుదల కావాల్సి ఉంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో.. అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దాంతో ఒకరోజు ముందుగా డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్స్ ని కూడా ప్లాన్ చేశారు. మరికొద్ది గంటల్లో థియేటర్లలో అఖండ తాండవం మొదలవుతుంది అనగా.. అనూహ్యంగా సినిమా వాయిదా పడింది.
గతంలో 14 రీల్స్ నిర్మించిన సినిమాల విషయంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఆర్ధిక సమస్యలు ఉన్నాయి. తమకు బకాయి పడ్డ డబ్బు చెల్లించే వరకు 'అఖండ-2' విడుదలపై స్టే ఇవ్వాలంటూ.. ఈరోస్ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. అలా 'అఖండ-2'కి రిలీజ్ కి బ్రేక్ లు పడ్డాయి.
బాలకృష్ణ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'అఖండ-2' చివరి నిమిషంలో వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే, ముందే పరిష్కరించుకోవాలని.. ఏకంగా సినిమా వాయిదా పడేవరకు తెచ్చుకోకూడదని ఫైర్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో మోస్ట్ హైప్డ్ మూవీ 'అఖండ-2' అనడంలో సందేహం లేదు. నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. తెలంగాణలో ప్రీమియర్ షోలతో పాటు, అన్ని చోట్లా పూర్తిస్థాయిలో బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎంతో వెయిట్ చేశారు. పూర్తిస్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాకుండానే.. బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవుతూ ట్రెండ్ అయిందంటే.. హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
'అఖండ-2'పై నెలకొన్న హైప్ ని బట్టి.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ బయ్యర్లకు మెజారిటీ రిటర్న్స్ తెచ్చిపెడుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ, వాయిదా కారణంగా లెక్కలు మారేలా ఉన్నాయి.
గురువారం రాత్రి, శుక్రవారం నాడు అభిమానులు పెద్ద ఎత్తున అఖండ-2 చూసేవారు. అలాగే శని, ఆది వారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేవారు. దాంతో ఫస్ట్ వీకెండ్ లోనే వసూళ్ల వర్షం కురిసేది.
అయితే ఇప్పుడు ఈ సినిమా శనివారం(డిసెంబర్ 6) విడుదలవుతుంది అంటున్నారు. అదే జరిగితే ఫస్ట్ వీకెండ్ రెండు రోజులకే పరిమితమవుతుంది. దాంతో ఓపెనింగ్స్ కి భారీ గండి పండుతుంది. ఒకవేళ డిసెంబర్ 6న కాకుండా.. వారానికో, రెండు వారాలకో వాయిదా పడినా.. బుకింగ్స్ పై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశముంది.
మొత్తానికి ఓపెనింగ్స్ తోనే ఎన్నో రికార్డులకు ఖాతాలో వేసుకోగల సత్తా ఉన్న 'అఖండ-2'.. అనూహ్యంగా ఒక అడుగు వెనక్కి వేసింది. మరి రెట్టింపు ఉత్సాహంతో థియేటర్లలో అడుగుపెట్టి.. అన్ని లెక్కలు సరిచేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



