ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత!
on Jan 27, 2023
తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. 55 ఏళ్ల శ్రీనివాస మూర్తి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి సన్నిహితులు, సినీ వర్గాలు షాక్ కి గురయ్యారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస మూర్తికి ఎంతో పేరుంది. తెలుగులో డబ్ అయ్యే తమిళ్, హిందీ, ఇంగ్లీష్ తో పాటు పలు ఇతర భాషల చిత్రాలకు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. తమిళ హీరోలు సూర్య, అజిత్, విక్రమ్ సినిమాలకు తెలుగులో ఎక్కువగా ఆయనే డబ్బింగ్ చెప్పేవారు. సూర్య నటించిన సింగం సిరీస్ లో ఆయన చెప్పిన తెలుగు డైలాగ్ లు ఎంతో ఫేమస్ అయ్యాయి. అలాగే సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ల సినిమాలకు కూడా వాయిస్ అందించారు. రాజశేఖర్ నటించిన శివయ్య(1998) చిత్రానికి గాను ఆయన ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకోవడం విశేషం.