ENGLISH | TELUGU  

'పాప్‌కార్న్' మూవీ రివ్యూ

on Feb 9, 2023

సినిమా పేరు: పాప్‌కార్న్
తారాగణం: అవికా గోర్‌, సాయి రోనక్‌
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌
ఎడిటర్: కేఎస్ఆర్
రచన, దర్శకత్వం: మురళి గంధం
నిర్మాత: భోగేంద్ర ప్రసాద్‌ గుప్తా
బ్యానర్స్: ఆచార్య క్రియేషన్స్‌, అవికా స్క్రీన్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023 

బుల్లితెర మీద 'చిన్నారి పెళ్ళికూతురు'గా అలరించి 'ఉయ్యాల జంపాల'తో వెండితెరకు పరిచయమైన అవికా గోర్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మినహా చాలాకాలంగా ఆమెకు సరైన విజయాలు దక్కలేదు. ఈ క్రమంలో యువ హీరో సాయి రోనక్‌ కి జోడీగా ఆమె నటించిన 'పాప్‌కార్న్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రమైనా అవికా గోర్ కు విజయాన్ని అందించేలా ఉందా?..

కథ:
సమీరణ(అవికా గోర్)కు సింగర్ కావాలనే డ్రీమ్ ఉంటుంది. కానీ తనకున్న ఆస్తమా సమస్య వల్ల సింగర్ కాలేకపోతుంది. గాలి సరిగా లేకపోయినా, పొగ చుట్టుముట్టినా తన ప్రాణాలకే ప్రమాదం. ఒకసారి తన పుట్టినరోజుని ఫ్రెండ్స్ తో కలిసి కేరళలో జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్న ఆమె.. ముందురోజు షాపింగ్ కోసం ఒక పెద్ద మాల్ కి వెళ్తుంది. మరోవైపు పవన్(సాయి రోనక్‌)కి కూడా సంగీతమంటే ప్రాణం. అతను ఎంతో ప్రతిభ ఉన్న గిటార్ ప్లేయర్. అతనికి తాతయ్య అంటే ప్రాణం. తాతయ్యని వదిలి వెళ్ళడం ఇష్టంలేక విదేశాలలో పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా వదులుకుంటాడు. అతను కూడా తన తాతయ్య పుట్టినరోజు ఉందని షాపింగ్ కోసం అనుకోకుండా సమీరణ వెళ్లిన షాపింగ్ మాల్ లోకే వెళ్తాడు. అయితే అలా వెళ్ళడానికి కాసేపటి ముందు జరిగిన ఒక సంఘటన వలన సమీరణ కనిపిస్తే కొట్టాలనేంత కోపంగా ఉంటాడు. సమీరణ షాపింగ్ ముగించుకొని లిఫ్ట్ ఎక్కగా, ఆమెను చూసిన పవన్ వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కుతాడు. ఆమె తను ఒక ఐటమ్ మర్చిపోయాను, వెళ్ళాలని చెప్తున్నా వినకుండా.. పవన్ ఆమెని చెంప మీద బలంగా కొట్టి, లిఫ్ట్ లో బేస్ మెంట్ బటన్ నొక్కుతాడు. దీంతో లిఫ్ట్ కిందకు వెళ్తుంది. అదే సమయంలో మాల్ లో బాంబు బ్లాస్ట్ జరిగి.. లిఫ్ట్ ఆగిపోతుంది. ఒక పోలీస్ నిర్లక్ష్యం కారణంగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఆ లిఫ్ట్ ని చెక్ చేయకుండా వెళ్ళిపోతాడు. బాంబు బ్లాస్ట్ జరగడంతో మాల్ ని ఖాళీ చేసి, సీజ్ చేస్తారు. సమీరణ, పవన్ మాత్రం ఆ లిఫ్ట్ లోనే ఇరుక్కుపోతారు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం లేదు. అలాంటి వారిద్దరూ ఒకరితో ఒకరు ఎలా ఉన్నారు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? ఆ లిఫ్ట్ ప్రమాదం వారిద్దరికీ ఒకరి మీద ఒకరికున్న అభిప్రాయాన్ని మార్చిందా? ఆస్తమా సమస్య ఉన్న సమీరణ ఆ లిఫ్ట్ నుంచి ప్రాణాలతో బయటపడగలిగిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
ఇది చాలా చిన్న కథ. నిజం చెప్పాలంటే ఒక షార్ట్ ఫిల్మ్ కి సరిపోయే కథ. ఇలాంటి కథని తీసుకొని సినిమా చేయడం, దానిని ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం సాహాసమనే చెప్పాలి. పైగా ఇదేం కొత్త కాన్సెప్ట్ కూడా కాదు. ఈ తరహా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా అనసూయ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్' సినిమా లిఫ్ట్ కాన్సెప్ట్ తోనే రూపొందింది. అందులో నెలలు నిండిన గర్భవతి.. స్త్రీలంటే గౌరవం లేని, బాధ్యత లేని ఒక యువకుడితో లిఫ్ట్ లో ఇరుక్కుపోతుంది. ఈ సినిమాలోనేమో ఇద్దరు యువతి యువకులు లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. దీనిని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

హీరో, హీరోయిన్ ని లిఫ్ట్ లో బంధించి దాదాపు రెండు గంటల పాటు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేసి, మెప్పించడం అంత సులభం కాదు. వారి మధ్య జరిగే ప్రతి సంభాషణ, ప్రతి సన్నివేశం.. అందంగా, కట్టి పడేసేలా ఉండాలి. కానీ ఈ విషయంలో చిత్ర రచయిత, దర్శకుడు మురళి గంధం పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా మొత్తం మాటలు, పాటలతో నింపేసి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. సంభాషణలు సన్నివేశాలకు తగ్గట్లుగా కాకుండా అసందర్భంగా, అనవసర పోలికలు, ప్రాసలతో విసిగించేలా ఉన్నాయి. ఇద్దరూ సంగీత ప్రియులు అనే ఒకే ఒక్క కారణంలో పదే పదే పాటలు పెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. రెండు గంటల నిడివి ఉన్న సినిమాలో 15-20 నిమిషాలు పాటలే ఆక్రమిస్తాయి. పైగా పాటలన్నీ మాల్ లోనూ, లిఫ్ట్ లోనే ఉంటాయి.

ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయాలన్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు కానీ.. మనసుకి హత్తుకునే సన్నివేశాలు, సంభాషణలతో క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మలిచి ఉంటే కనీసం ఓటీటీలో అయినా వర్కౌట్ అయ్యుండేదేమో. ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఒకానొక దశలో హీరో హీరోయిన్లను లిఫ్ట్ లో బంధించడం కాదు.. సినిమా చూస్తున్న మనల్ని థియేటర్ లో బంధించారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగక మానదు.

ఉన్నంతలో శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం బాగానే ఉంది. ఒకట్రెండు పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ఎం.ఎన్. బాల్ రెడ్డి కెమెరా పనితనం కూడా పర్లేదు. లిఫ్ట్ సన్నివేశాలను తన కెమెరాలో బాగానే బంధించాడు. కెఎస్ఆర్ కూర్పు బాగానే ఉన్నప్పటికీ.. కాన్సెప్ట్, సన్నివేశాల్లో ఉన్న ల్యాగ్ కారణంగా బోర్ కొట్టకుండా చేయలేకపోయాడు. ఈ సినిమాకి పెద్దగా ఖర్చు కూడా అయ్యుండదు. ఎందుకంటే సినిమాలో ఎక్కువ భాగం లిఫ్ట్ లోనే జరుగుతుంది.

నటీనటుల పనితీరు:
ఆస్తమా సమస్య ఉన్న సమీరణ పాత్రలో అవికా గోర్ ఆకట్టుకుంది. ఈ భూమ్మీద తనకంటే అందగత్తె లేదని ఫీలయ్యే అమాయకమైన అల్లరి పిల్లగా.. తెలియని వ్యక్తితో లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు ఆమె పడే భయం, ఇబ్బంది.. ఆస్తమా వల్ల ఆమె ప్రాణం మీదకు రావడం వంటి సన్నివేశాల్లో రాణించింది. తాతయ్య, సంగీతమే ప్రపంచంగా బ్రతికే పవన్ అనే యువకుడి పాత్రలో సాయి రోనక్‌ మెప్పించాడు. కామెడీ, ఎమోషన్ సన్నివేశాల్లో బాగానే రాణించాడు. ఇది ఎక్కువగా లిఫ్ట్ లో ఇద్దరి మధ్య జరిగిన కథ కావడంతో మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మిగతా పాత్రలన్నీ ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యాయి.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
హీరో, హీరోయిన్ ని లిఫ్ట్ లో బంధించి రెండు గంటల పాటు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా 'పాప్‌కార్న్'. ఇంత చిన్న కాన్సెప్ట్ తో సినిమా తీసి, థియేటర్లలో విడుదల చేయాలన్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.. కానీ థియేటర్ లో కూర్చొని ఈ సినిమా చూడాలంటే మాత్రం చాలా ఓపిక కావాలి.

రేటింగ్: 2/5

-గంగసాని

గమనిక: మీడియా కోసం ముందుగానే ప్రత్యేక షో వేశారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.