పాయల్ 'మంగళవారం' చిత్రీకరణ పూర్తి!
on Jun 13, 2023

'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మహా సముద్రం' మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న మూడో సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' వంటి సూపర్ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.
నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ.. ''కంటెంట్, క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న సినిమా 'మంగళవారం'. జూన్ 12తో షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టింది. అందులో కేవలం 48 రోజులు పగటి పూట షూటింగ్ చేశాం. 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్న చిత్రమిది. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల తేదీలు, ఇతర వివరాలు వెల్లడిస్తాం. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన పాయల్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించడం సంతోషంగా ఉంది'' అని అన్నారు.

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ''గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తాం. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతుంది'' అని అన్నారు.
అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర, ఎడిటర్ గా మాధవ్ కుమార్ గుళ్ళపల్లి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



