పవన్ ఎందుకు ట్రెండ్ సెట్టర్ అయ్యాడు??
on Feb 25, 2017
ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా.. అనేది పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్. అది నిజం కూడా. పవన్ సినిమాలు రెగ్యులర్‌గా ఉండవు. ఒకవేళ రొటీన్ కథా కథనాలతో వచ్చినా.. ఏదో ఓ మ్యాజిక్ చేసి క్రియేటివిటీ జోడించేస్తుంటాడు. అందుకే టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో! సూపర్ స్టార్ మహేష్ బాబుకి పోటీ ఇవ్వగలిగిన ఏకైక నటుడు. పవన్ సినిమా హిట్ కానవసరం లేదు. కనీసం యావరేజ్ గా నిలబడినా కాసుల వర్షం కురుస్తుంది. అత్తారింటికి దారేదితో టాలీవుడ్‌కి తొలి వంద కోట్ల సినిమా అందించాడు పవర్ స్టార్. అసలు పవన్ ట్రెండ్ సెట్టర్ ఎందుకయ్యాడు అని చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలున్నాయి. అందులో కొన్ని మీకు మళ్లీ ఓ సారి గుర్తు చేస్తున్నామంతే!
తన తొలి సినిమా అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయితో తనలోని మార్షల్ ఆర్ట్స్ విద్యని పూర్తి స్థాయిలో ప్రదర్శించిన హీరో పవన్. అప్పటి వరకూ అలాంటి విన్యాసాలు టాలీవుడ్ ప్రేక్షకులు చూడలేదు.
పవన్ కల్యాణ్ ఫాలోయింగ్‌ని యూత్‌లో అమాంతంగా పెంచేసిన సినిమా తొలి ప్రేమ. ఇందులో పాటలన్నీ హిట్టే. అయితే.. హీరో, హీరోయిన్ల మధ్య ఒక్కటంటే ఒక్క డ్యూయెట్ కూడా ఉండదు. హీరో హీరోయిన్లపై డ్యూయెట్ లేకుండా తీసిన ఏకైక తెలుగు లవ్ స్టోరీ ఇదే.
పవన్‌ని స్టార్‌ని చేసేసిన సినిమా బద్రి. ఈ సినిమాలో ఫైట్లు... అప్పట్లో ఓ సన్సేషన్. హీరో అంటే.. చొక్కాలు చిరిగిపోయేలా ఫైట్లు చేయాలన్న రూల్‌ని పక్కన పెట్టి, క్లాసీ ఫైట్స్ రుచి చూపించాడు పవన్.
ఓ తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాటనీ, హిందీ పాటనీ ఊహిస్తారా?? తమ్ముడులో లుక్ ఎట్ ద ఫేస్ అనే పాట ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అదో ఇంగ్లీష్ గీతం. ఖుషీలో ఏ మేరా జహా.. అనే హిందీ పాట వినిపిస్తుంది. ఇవి రెండూ తెలుగు పాటలుగానే చలామణి అయ్యాయి. అదీ పవర్ స్టార్ అంటే.
పవన్ నుంచి వచ్చిన మరో లవ్ స్టోరీ.. ఖుషీ. ఈ సినిమాలో విలనే లేడు. హీరో హీరోయిన్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్నే విలన్‌గా చూపించారు. లవ్ స్టోరీల్లో ఇదో కొత్త ట్రెండ్. దాన్ని ఎవ్వరూ ఫాలో అవ్వలేకపోయారు.
పవన్ ఓ టాప్ స్టార్. సాధారణంగా స్టార్ల సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కానీ హీరోయిన్ లేకుండానే సినిమా చేసేసిన స్టార్ పవన్. బంగారం సినిమా చూశారా.. అందులో పవన్ పక్కన హీరోయిన్ ఉండదు. కేవలం కథని నమ్ముకొని ప్రయాణం సాగిస్తేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి.
టాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో అత్తారింటికి దారేది ఒకటి. జాగ్రత్తగా గమనిస్తే... ఈ సినిమాలో విలన్ అంటూ ఎవ్వరూ ఉండరు. కేవలం డైలాగులతో పది నిమిషాల క్లైమాక్స్ నడిపే సాహసం చేశాడు పవన్ కల్యాణ్. ఓ టాప్ స్టార్ సినిమాకి ఎమోషనల్ టచ్ ఇస్తూ క్లైమాక్స్ రావడం.. ఇదే తొలిసారి.
అత్తారింటికి దారేది ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా చాలా సాదా సీదాగా ఉంటుంది. అక్కడో ట్విస్టూ, సినిమాటిక్ మలుపు.. ఏమీ ఉండదు. కానీ.. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ఇలా ఒకటా రెండా? పవన్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి బోల్డన్ని కారణాలు. అందుకే పవన్ అంటే అంత క్రేజూ.. అంత మోజూ...!