అసలు సినిమాలే చేయనన్న పవన్.. వరుసగా నాలుగు సినిమాలు!
on Feb 1, 2020

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో 'గబ్బర్ సింగ్'ది స్పెషల్ ప్లేస్. తనకు తాను పవన్ భక్తుడిగా ప్రకటించుకున్న హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా రికార్డులు సృష్టించింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో అటువంటి హిట్స్ అరుదుగా వస్తుంటాయి. 'నాకొంచెం తిక్క ఉంది. దానికో లెక్క ఉంది', 'పాటొచ్చి పదేళ్లు అయింది. అయినా పవర్ తగ్గలేదు' వంటి డైలాగులు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా అభిమానులు పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలని అనుకుంటున్నారో... దర్శకుడు హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్'లో అలా చూపించారు. అందులో హీరోయిజం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. త్వరలో మరిన్ని విషయాలు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని పేర్కొంది.
రాజకీయాల నుండి సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్, అంగీకరించిన మూడో చిత్రమిది. ఆల్రెడీ 'పింక్' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మించే సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ప్రకటన వచ్చింది. ఇవి కాకుండా డాలీ (కిషోర్ పార్ధసాని)తో మరో సినిమా చేయనున్నారని సమాచారం. ఇంతకు ముందు పవన్ తో 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' సినిమాలు చేశారు డాలీ. కాగా, ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



