ENGLISH | TELUGU  

పద్మ అవార్డులు ప్రతిభకు కొలమానాలా?

on Apr 1, 2015

పద్మ అవార్డులు.... వివిధ రంగాల్లో ప్రతిభ ప్రదర్శించే వారిని గుర్తిస్తూ...మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఇది. ప్రతి సంవత్సంర లాగే ఈ ఏడాది కూడా పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 9మందికి పద్మవిభూషణ్, 20మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మ శ్రీ అవార్డు అందించారు. అయితే ఏటా ఎన్నో నామినేషన్లు వస్తుంటాయి. వారిలో అర్హులైన వారిని కొద్దిమందినే ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అయితే ఈ ఎంపిక వందశాతం న్యాయంగానే జరుగుతోందా? అవార్డు తీసుకున్న వాళ్లంతా అర్హులైనా.....అర్హులైన మిగిలిన వాళ్లకీ అవార్డు దక్కుతోందా?

అవార్డు వరించిన వాళ్ల సంగతి పక్కనపెడితే....ఎందరో మహానుభావుల వైపు పద్మ అవార్డు కన్నెత్తైనా చూడలేదు. అంటే వారంతా ఈ అవార్డుకు అనర్హులని భావించాలా? ఇదే చాలా రంగాల్లో .... చాలామందిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. సమాధానం దొరకని ప్రశ్నకూడా. అన్ని వర్గాల వారికీ తెలిసిన సినిమా రంగాన్నే తీసుకుందాం. ఈ కళారంగంలో ఎంతమందికి పద్మ అవార్డు వచ్చింది? వచ్చిన వారంతా నిజంగా ఆ అవార్డు పొందేందుకు అర్హులేనా? ఆ అవార్డుని దుర్వినియోగం చేసినవాళ్లెందరు? ఇప్పటి వరకూ పద్మ అవార్డు తీసుకున్న వాళ్లని వదిలేస్తే.....ఆ అవార్డుకు సరిపడా నటులెవ్వరూ ఇండస్ట్రీలో లేరా?

వివిధరంగాల్లో నిన్నగాక మొన్న కెరీర్ మొదలెట్టిన వారంతా.....తమ పేరు పద్మ అవార్డుల లిస్ట్ లో లేదని అలక బూనుతున్నారు. సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ ఆబాలగోబాలాన్ని అలరించిన ఎందరో నటదిగ్గజాలు, మహానుభావులు...ఇప్పటికీ ప్రభుత్వానికి కనిపించకపోవడం దారుణం. ఎవ్వరో ఎందుకు ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు, మహానటి సావిత్రి, నటదిగ్గజం ఎస్వీ రంగారావు, కంఠశాలగా పేరొందిన ఘంటశాల వెంకటేశ్వరరావు, అసమానప్రతిభావంతులైన బాపురమణ... ఇలాంటి మహానుభావులు ప్రభుత్వానికి కనిపించలేదా? వీరీలో ఎన్టీఆర్, బాపు,  ఘంటశాలకు బాగోదన్నట్టు పద్మశ్రీ మాత్రమే ప్రకటించారు. మిగిలిన వారికి అదీలేదు.



నటనకు నిలువెత్తు రూపమైన ఎన్టీఆర్ ని మించిన నటులెవరు? ఇప్పటికీ రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఫొటోలు పెట్టుకుని పూజించే వారు ఉన్నారంటే అతిశయోక్తిలేదు. నిండైన విగ్రహంలా తెరవేల్చుగా నిలిచిన తారకరామారావు అటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఏళ్లతరబడి ఏకఛత్రాధిపత్యం అనుకున్న పార్టీలను మట్టికరపించి.....నోవోదయంలా వెలిగారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లోనూ తిరుగులేదనిపించుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ప్రభుత్వాలకు ఎందుకు కనబడడం లేదు?. భారతరత్న ఇవ్వాలని ఇప్పటికే ఎన్నో ప్రపొజల్స్ వెళ్లాయి. కానీ సర్కారు నుంది స్పందన కరవైంది.


 
నటీమణుల్లో మకుటం లేని మహరాణి ఎవరంటే మహానటి సావిత్రి అని ఠక్కున చెబుతారంతా. ఆమె ఆహార్యం, హావభావాలు, అభినయం, అందం ఇలా అన్నింటిలోనూ ఇప్పటి వరకూ ఆమెను మించిన నటి లేదని ఘంటాపధంగా చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ ఆ మహానటిని ఒక్క అవార్డు వరించలేదు.


నటదిగ్గజం ఎస్వీరంగారావు. ఈయనను అభిమానించని వారుండరేమో. దేశం గర్వించదగ్గ నటుల్లో ఎస్వీఆర్‌ ఒకరు.ఆయన నటనకు హాలీవుడ్‌ నటులే ఆశ్చర్యపోయారు.అద్భుతమైన నటుడని మెచ్చుకున్నారు.కానీ ఆయనకు ఇక్కడ గుర్తింపు దక్కలేదు.పద్మశ్రీ లాంటి ఏ అవార్డులు ఇవ్వలేదు.


కోట్ల తెలుగుల ఎదఅంచుల ఊగిన ఊయల, తీయని గాంధర్వ హేల... గాయకమణి ఘంటసాల.  వేంకటేశ్వరస్వామి మేలుకొలుపైనా, భగవద్గీత అయినా ఆయన గొంతు తప్ప మరేదీ ఊహించుకోలేం. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినిమాకు ఎంత ప్రాధాన్యత లభించిందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పాటల కంఠశాలగా పేరొందిన  ఘంటసాల వేంకటేశ్వరరావుకి దక్కింది. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఒక్కటీ సరిపోతుందా?



అసమాన ప్రతిభకు తార్కాణాలైన బాపురమణ...వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఆయన చేతిలో పిచ్చిగీతలు సైతం ప్రాణం పోసుకుంటాయి. అచ్చ తెలుగు ఆడపడుచుకు ప్రతిబింబం బాపుబొమ్మ. ఆయన కొంటె గీతలు హాస్యపు మాధుర్యాన్ని అందించాయి. బాపు కార్టూన్ చూసి చిరునవ్వు చిందించని వారుండరు. దశాబ్దాలుగా కళామతల్లికి సేవచేసిన ఆ దిగ్గజాలు ప్రభుత్వానికి కనిపించలేదెందుకో. ఇక ఇవ్వకపోతే బాగోదన్నట్టు బాపు గారికి పద్మశ్రీ ప్రకటించారు. అప్పటికే ఆయనలో సగం రమణ దూరమైపోయారు. పద్మశ్రీ తీసుకున్న కొన్నాళ్లకే బాపు శాశ్వతంగా దూరమైపోయారు.  

అయితే  పద్మ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ ఎదోఒక వివాదం తెరపైకి వస్తుంటుంది. ఎవరో ఒకరు తమకు అన్యాయం జరిగిందని గొడవకు దిగుతుంటారు. అవార్డు గ్రహీతల ఎంపిక పారదర్శకంగా జరిగితే అసలీ వివాదాలు వచ్చేవా? లాబీలకు అలవాటు పడిన పద్మ పురస్కారాలకు విలువ ఉందా అని ఒకరు కామెంట్ చేస్తారు. అర్హులైన వారెవ్వరూ కనిపించరని ఇంకొందరంటారు. అసలేం జరుగుతోంది?

గతేడాది పద్మఅవార్డులు ప్రకటించిన జాబితాలో నటి విద్యాబాలన్ ఉంది. ఆమెకు పద్మశ్రీ ఇవ్వడాన్ని చాలామంది సినీ పెద్దలు వ్యతిరేకించారు. "సీనియర్ తారలను మర్చిపోవడం బాధాకరం అని పలువురు ట్విట్టర్ ద్వారా చాలా తీవ్రంగా స్పందించారు. వీరిలో  విజయ నిర్మలకు నటిగా ఎంతో గుర్తింపు ఉంది. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డ్ కూడా సాధించింది. ఆమెకు ఇంకా "పద్మ" పురస్కారం రాకపోవడం ఏంటి? అలాగే నాటి తరం తారల్లో నటి లక్ష్మి కూడా భారతీయ భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన ఆమెను గుర్తించకపోవడం ఏంటి? అని ట్విట్టర్లలోనే ధ్వజమెత్తారు. రీసెంట్ గా అవార్డులు ప్రకటించినప్పుడు సైతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాన్ అసంతృప్తి వ్యక్తంచేసింది. తనపేరు తొలగించి సుశీల్ కుమార్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ గా వెలుగుతున్న మన తెలుగమ్మాయి సైనా.....రూల్స్ రెగ్యులేషన్స్.... మనిషిని బట్టి మారిపోతాయా అని యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పద్మ అవార్డులు అంగట్లో కొనుక్కునే చాక్లెట్లా?  మా ఉద్దేశం అవార్డు ఇచ్చినవారిని కించపరచడం కాదు....అర్హులైన ఎందరికో గుర్తింపు లభించడం లేదనే బాధ.

ముఖ్యంగా తెలుగువారికి చాలా అన్యాయం జరుగుతోంది. ఇంతకీ పద్మ అవార్డుల జాబితా ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? పేర్లను సిపార్సు చేసేవారిలోనే లోపం ఉందా? ఎంపికలో లోపం ఉందా? ఏదైనా లాబియింగ్ జరుగుతోందా? ప్రతిభకు తార్కాణంగా చెప్పుకునే పద్మ అవార్డులు రాజకీయంమవుతున్నాయా? పెద్దల సిఫార్సులు, బెదిరింపులకు తలొగ్గి అర్హుల పేర్లు పక్కనపెడుతున్నారా?

ఏం జరిగినా....తెలుగు ఇండస్ట్రీలో అత్యద్భుత ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలైన వారెందరికో అవార్డులు దక్కలేదన్నది జీర్ణించుకోలేని వాస్తవం. అయితే వారికి అవార్డులు దక్కనందుకు బాధపడాలా ? వారి ప్రతిభకు ఈ అవార్డులేవీ సరిపోవని అనుకోవాలా? మగిలిన రంగాల్లో ప్రతిబావంతులదీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భవిష్యత్ లో అయనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని బావించొచ్చా?

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.