తడిసి మోపెడైంది.. సరదా తీరిపోయింది
on Nov 2, 2017
‘జీవితం ఎవరి సరదా వాళ్లకు తీర్చేస్తది’ అన్నట్లు.. పాపం.. రాజశేఖర్ కు కూడా సరదా తీరిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేవాడూ.. ‘ఎవడైతే నాకేంటి’ అనే రేంజ్ లో ఉండేవాడు. కానీ.. ఇప్పుడు తనే ఓ ‘మమతల కోవెల’గా మారాడు. అందర్నీ కలుపుకుపోతూ.. పూర్వ వైభవం కోసం తపిస్తున్నాడు. ‘అనువు గాని చోట అధికులమనరాదు’ అన్న సూక్తిని అప్పుడే అనుసరిస్తే.. రాజశేఖర్ సినిమాల కుళాయి పలుచబడేదా? చెప్పండి? పలుచపడటం కాదు.. కొన్నాళ్లుగా కొళాయి కట్టేయడం కూడా జరిగింది.
బలవంతుడితో పోటీ పడొచ్చు. ధనవంతుడితో పోటీ పడొచ్చు. మేధావితో పోటీ పడొచ్చు.. కానీ అదృష్టవంతుడితో మాత్రం పోటీ పడకూడదు. పడితే.. ఇంతే సంగతులు. రాజశేఖర్ కి ఈ విషయం ఆలస్యంగా అర్థమైంది. తనకు తానుగా ఆ అదృష్టవంతుడి ఇంటికెళ్లి ఆహ్వానించేదాకా వెళ్లింది వ్యవహారం. సరదా తీరిపోవడం అంటే ఇదే కదా.
నిజానికి రాజశేఖర్ గొప్ప నటుడు. చిరంజీవితో సమానంగా సినిమాలు చేసిన రోజులున్నాయ్. ఒకానొక దశలో అందరి అభిమానులూ రాజశేఖర్ అభిమానులే. అంతగా పేరుతెచ్చుకున్న నటుడు తను. కానీ... తర్వాత్తర్వాత సినిమాల ఎంపిక పరంగా కూడా పక్కదారి పట్టాడు. అంకుశం, అగ్రహం.. లాంటి సినిమాలను పక్కనపెట్టి ‘అల్లరి ప్రియుడు’ మాయలో పడిపోయాడు. తనకు తాను ఎక్కువగా ఊహించుకున్నాడు. రాజశేఖర్ కోసమే అన్నట్లు అప్పట్లో కొన్ని కథలుండేవి. వాటన్నింటినీ పక్కనపెట్టాడు. తన ధర్మాన్ని పక్కన పెట్టి పర ధర్మం కోసం పాకులాడాడు. వరుస పరాజయానలు చవిచూశాడు. వివాదాలను ఎదుర్కొన్నాడు. ఎవరి సినిమాలతో పేరు సంపాదించాడో.. వారితోనే శత్రుత్వం పెట్టుకున్నాడు. తర్వాత ఏమైందీ... తడిసి మోపెడైంది.
‘చిరంజీవి పార్టీ పెడితే.. నేను చేరను.. ఆయనకు అనుభవం శూన్యం’ అన్నందుకు ఆ రోజుల్లో మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆ పరిణామం విషయంలో చిరంజీవి తనకు తాను వాళ్ల ఇంటికొచ్చి క్షమాపణ కోరిన తర్వాత కూడా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వూలో... చిరంజీవి గురించి నెగిటీవ్ కామెంట్లు చేశాడు. నిజానికి మీడియా అంతగా లేనప్పుడు రాజశేఖర్ యాటిడ్యూడ్ ఎవరికీ తెలీదు. మీడియా పెరిగాక.. అతని యాటిడ్యూడ్ జనాలు లైవ్ లో చూశారు. నిజానికి అది అమాయకత్వంతో కూడిన పొరపాటు. కానీ అదే ఆయనకున్న ఫ్యామిలీ ఇమేజ్ ని డామేజ్ చేసింది. పక్కనున్నవాళ్ల సలహాలు కూడా ఆయన్ను దెబ్బతీశాయ్.
ఏదిఏమైనా.. రాజశేఖర్ లాంటి మంచి నటుడికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం నిజంగా బాధాకరం. నిజానికి రాజశేఖర్ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఆయన గతంలో చేసిన సినిమాలు అలాంటివి మరి. వందేమాతరం, ప్రతిఘటన, రేపటిపౌరులు, అరుణకిరణం, స్టేషన్ మాస్టర్, న్యాయం కోసం, నవభారతం, మమతల కోవెల, అక్కమొగుడు, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, ఆగ్రహం, అన్న, మొరటోడు నా మొగుడు... అసలు ఈ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకుడు ఉంటాడా? అందుకే.. మళ్లీ రాజశేఖర్ కి మళ్లీ పూర్వ వైభవం రావాలి. ‘గరుడ వేగ’ మళ్లీ మరో ‘అంకుశం’ అవ్వాలి. ఇది తెలుగువన్ ఆకాంక్ష మాత్రమే కాదు.. అందరి ఆకాంక్ష. బెస్ట్ ఆఫ్ లక్ రాజశేఖర్ గారూ..