రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్.. మరి మిగతా హీరోలు?
on Oct 16, 2018
శ్రీకాకుళం తుఫాను బాధితులకు సహాయం చేయడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందుకి వచ్చింది. మొదటగా సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు సాయం ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు. తరువాత విజయ దేవరకొండ 5 లక్షలు, ఎన్టీఆర్ 20 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు ప్రకటించారు. ఇలా హీరోలు ఎవరికి తోచిన ఆర్థిక సాయం వారు చేస్తూ బాధితులకు అండగా ఉంటుంటే.. ఒక హీరో మాత్రం బాధితులను పరామర్శించి, వారికి ప్రత్యక్షంగా సాయంగా చేసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. అతనే యంగ్ హీరో నిఖిల్.
నిఖిల్ ‘తితిలీ’ ప్రభావిత ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించి దగ్గరుండి మూడు వేల మందికి భోజన సదుపాయం కల్పించాడు. అంతేనా.. 2500 కిలోల రైస్, 500 దుప్పట్లు, పవర్ కట్స్ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ అందించాడు. అంతేకాదు వారితో కలిసి భోజనం చేశానని, ఇది చాలా సంతృప్తిని ఇచ్చిందని నిఖిల్ ట్వీట్ చేశారు. ‘ఎంతో సంతృప్తి పొందిన ఈ రోజు.. మనస్ఫూర్తిగా భోజనం చేశా. 500 దుప్పట్లు, విద్యుత్లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం పోర్టబుల్ జనరేటర్లు, 3వేల మందికి భోజనం శ్రీకాకుళంలో పంపిణీ చేశాం. శ్రీకాకుళం ప్రజలు ధైర్యంగా ఉండాలి’ అని నిఖిల్ రాత్రి ట్వీట్ చేశారు. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్ ని మిగతా హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నెటిజనులు కోరుతున్నారు.