ENGLISH | TELUGU  

'నేను స్టూడెంట్ సర్' మూవీ రివ్యూ!

on Jun 2, 2023

సినిమా పేరు: నేను స్టూడెంట్ సర్
తారాగణం: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రమోదిని, ఆటో రాంప్రసాద్, రవి సాయితేజ
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: 'నాంది' సతీష్ వర్మ
బ్యానర్: ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ 
విడుదల తేదీ: జూన్ 2, 2023

నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' చిత్రంతో హీరోగా పరిచయమై బాగానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన రెండో చిత్రం 'నేను స్టూడెంట్ సర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచార చిత్రాలతోనే ఇది విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రమనే అభిప్రాయం కలిగింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? బెల్లంకొండ గణేష్ కు విజయాన్ని అందించేలా ఉందా?...

కథ:
మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుబ్బు(బెల్లంకొండ గణేష్)కి ఐఫోన్ అంటే చాలా కష్టం. ఎప్పుడూ ఐఫోన్ గురించే ఆలోచిస్తూ, ఐఫోన్ కొనాలని కలలు కంటుంటాడు. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఫోన్ కొనాలని భావించిన సుబ్బు.. ఓ వైపు కాలేజ్ లో చదువుకుంటూనే, మరోవైపు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ రూపాయి రూపాయి దాచుకుంటాడు. అలా కొన్ని నెలలపాటు డబ్బు దాచి, రూ.90,000 తో ఐఫోన్ కొంటాడు. ఎంతో ఇష్టపడి, కష్టపడి కొనుక్కున్న ఆ ఫోన్ ని సొంత తమ్ముడిలా ఫీలవుతాడు. తన తల్లి సూచన మేరకు ఆ ఫోన్ కి బుచ్చిబాబు అని పేరు కూడా పెడతాడు. కానీ తన కలల ఫోన్ చేతికి వచ్చిందన్న ఆనందం సుబ్బుకి ఎంతోసేపు ఉండదు. కాలేజ్ లో రెండు గ్రూప్ ల మధ్య గొడవ జరుగుతుంది. అయితే ఆ రెండు గ్రూప్ లతో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న సుబ్బుని కూడా పోలీసులు పట్టుకెళ్తారు. స్టూడెంట్స్ దగ్గర ఫోన్లు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకొని, మరుసటి రోజు రమ్మని పంపించేస్తారు. అయితే సుబ్బు మాత్రం వెళ్లకుండా తన కొత్త ఫోన్ ఇప్పుడే తిరిగి ఇవ్వాలని పట్టుబడతాడు. ఈ క్రమంలో ఫోన్లు ఉంచిన బాక్స్ లోనుంచి తన ఫోన్ మిస్ అయిందని తెలుసుకుంటాడు. దీంతో పోలీసులే తన ఫోన్ ని దొంగిలించారని తిరగబడతాడు. అంతేకాదు ఏకంగా కమిషనర్(సముద్రఖని)కే ఎదురుతిరుగుతాడు. ఆ తర్వాత సుబ్బు జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు సుబ్బు ఫోన్ ఏమైంది? కమిషనర్ గన్ కొట్టేయాల్సిన అవసరం సుబ్బుకి ఎందుకు వచ్చింది? సుబ్బుని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? దీని వెనుక ఉన్న స్కామ్ ఏంటి? ఆ స్కామ్ వెనుక ఉన్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథ అందించాడు. కథానాయకుడు ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ పోవడం, ఆ ఫోన్ ఏమైందో తెలుసుకునే క్రమంలో ఓ పెద్ద స్కామ్ బయటపడటం అనే పాయింట్ బాగానే ఉంది. కానీ ఆ పాయింట్ ని ఆసక్తికరమైన కథనంతో నడిపించి మెప్పించడంలో దర్శకుడు రాఖీ ఉప్పలపాటి సక్సెస్ కాలేకపోయాడు. హీరోకి ఐఫోన్ అంటే ఇష్టం ఉండటం, అతను కష్టపడి ఐఫోన్ కొనుక్కోవడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. పరిచయ సన్నివేశాలు కాస్త ల్యాగ్ అనిపించినా, హీరో ఫోన్ పోయాక సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఆ టెంపో ఎంతోసేపు ఉండదు. కాసేపటికే కమిషనర్ కూతురిగా హీరోయిన్ అవంతిక దస్సాని పాత్ర పరిచయమవుతుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా ఉండవు. ప్రథమార్థం ఏదో నడుస్తుందంటే నడుస్తుందనే భావన కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్లాక్ ని మాత్రం బాగానే డిజైన్ చేశారు. సెకండాఫ్ లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని కలిగించేలా ఫస్టాఫ్ ని ముగించారు.

ఇంటర్వెల్ తర్వాత సినిమా వేగం పుంజుకుంటుందని, సెకండాఫ్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేసే సన్నివేశాలు వస్తాయని భావిస్తే.. సహజత్వానికి దూరంగా, వరుస సినిమాటిక్ సన్నివేశాలతో సోసోగా నడుస్తుంది. ఓ సన్నివేశంలో "పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి ఏదో చూపించిందంట" అనే డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఆ సన్నివేశానికి ఏమో గానీ, సినిమాకి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సాధారణ యువకుడు పదే పదే కమిషనర్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా అతన్ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోలేకపోవడం, పోలీసుల కళ్లుగప్పి అతను సిటీ అంతా తిరగడం, ఒకవేళ పోలీసులకు చిక్కినా అవలీలగా తప్పించుకోవడం వంటి సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. అయితే బ్యాంక్ నేపథ్యంలో వచ్చే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం మెప్పించాయి. క్లైమాక్స్ మాత్రం జస్ట్ ఓకే.

మహతి స్వర సాగర్ సంగీతం ఈ సినిమాకి పెద్దగా ప్లస్ కాలేదు. పాటలు గుర్తుపెట్టుకొని పాడుకునేలా లేవు. నేపథ్య సంగీతం పరవాలేదు. అనిత్ మధాడి కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ కనీసం మరో ఐదు-పది నిమిషాలు సినిమాని ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
అమాయకత్వం, నిజాయితీ కలగలిసిన మధ్యతరగతి యువకుడు సుబ్బు పాత్రలో బెల్లంకొండ గణేష్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ప్రారంభ సన్నివేశాల్లో తన అమాయకపు నటన, మాటలతో మెప్పించాడు. అయితే ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. పోలీస్ కమిషనర్ పాత్రలో సముద్రఖని ఎప్పటిలాగే అదరగొట్టాడు. పాత్ర మరీ శక్తివంతంగా లేకపోయినా, తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కమిషనర్ కూతురు శృతి పాత్రలో అవంతిక దస్సాని రాణించింది. టిక్ టాక్ స్టార్ గా ఎదిగి, టిక్ టాక్ బ్యాన్ కావడంతో ఫోన్ అంటేనే అసహ్యించుకునే పాత్రలో ఉన్నంతలో మెప్పించింది. అయితే కమిషనర్ కూతురు అయ్యుండి, రీల్స్ చేసి టిక్ టాక్ స్టార్ అవ్వడం అనేది కాస్త నమ్మశక్యంగా అనిపించదు. ప్రమోదిని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, ప్రమోధిని, రవి సాయితేజ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ, ఆసక్తికరమైన కథనంతో చిత్రాన్ని ఆకట్టుకునేలా మలచలేకపోయారు. నెమ్మదిగా సాగే కథనం, అక్కడక్కడా బోర్ కొట్టించేలా ఉన్నప్పటికీ.. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లి, కాస్త ఓపికగా చూస్తే.. చిత్ర బృందం చేసిన ప్రయత్నం కోసం, కొన్ని సన్నివేశాల కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5 

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.