నేను పడిన కష్టాలు 'వాసు' పడలేదు!
on Dec 22, 2021

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేసిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని మీడియాతో మచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను పడిన కష్టాలు ఈ సినిమాలో వాసు పాత్ర పడలేదని అన్నాడు.
సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణాన్ని ప్రారంభించిన నాని.. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. అయితే అప్పుడప్పుడు తన సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంటున్నాడు నాని. 'మజ్ను' సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించి మెప్పించిన నాని.. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' లోనూ అలాంటి పాత్రలోనే కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ లో 'లో బడ్జెట్ సినిమా డైరెక్టర్ వాసు'గా నాని కనిపించాడు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ గా తాము పడిన కష్టాలని ఈ సినిమాలో చూపించడం లేదని నాని చెప్పాడు. ఆ కష్టాలను చూపిస్తూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయని, ఈ సినిమాలో వాసు పాత్ర సరదాగా సాగిపోతుందని నాని తెలిపాడు. 'శ్యామ్ సింగ రాయ్' పాత్ర కోసం తాను బరువు పెరగలేదని, బాడీ ల్యాంగ్వేజ్ తోనే ఆ వేరియేషన్ చూపించానని అన్నాడు. లుక్ పరంగా నాయకుడు వంటి సినిమాలు గుర్తుకురావొచ్చని.. కానీ ఆ సినిమాకి దీనికి అసలు సంబంధం లేదని నాని చెప్పాడు.
'శ్యామ్ సింగ రాయ్' సినిమా పూర్తిగా దేవదాసి వ్యవస్థపై పోరాటం గురించి ఉండదని, సినిమాలో అది కూడా భాగమని నాని తెలిపాడు. ఈ మూవీలో ఆకట్టుకునే ఎపిసోడ్స్ ఎన్నో ఉన్నాయని అన్నాడు. ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ అద్భుతం అని, ఎక్కడా సెట్స్ చూసిన ఫీయింగ్ కలగదని నాని చెప్పాడు. ఈ సినిమా చూస్తుంటే నిజంగానే 50-60 ఏళ్ళు వెనక్కెళ్ళి.. అప్పటి ప్రపంచం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుందని అన్నాడు. సాను వర్గీస్ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. ఆయన తన పేరు కోసం పనిచేయడని, సినిమా కోసం పనిచేస్తాడని.. అందుకే అంత మంచి ఔట్ పుట్ వస్తుందని నాని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



