ENGLISH | TELUGU  

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ రివ్యూ

on Sep 4, 2015

మారుతిపై జ‌నాల్లో ఓ అభిప్రాయం ఏర్ప‌డిపోయింది. ఈరోజుల్లో, బ‌స్ స్టాప్ చూసిన ఎవ్వ‌రైనా స‌రే... `బూతు డైరెక్ట‌ర్‌` అనేస్తారు. అయితే ఆ త‌ర‌వాత మారుతి మారాడు. కొత్త‌జంట‌ని క్లీన్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్పుడు 100 % క్లీన్ సినిమా తీశాడు. అదే.... భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌. త‌ను కామెడీని టేక‌ప్ చేసిన విధానం చూస్తే.. 'బూతు' ట్యాగ్ తొల‌గిపోయి.. 'కామెడీ' డైరెక్ట‌ర్ అనే ముద్ర ప‌డిపోతుంద‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. మారుతి రాసుకొన్న స్ర్కిప్ట్ 50 % కార‌ణ‌మైతే, నాని మ‌రో 50 % త‌న భుజాల‌పై వేసుకొని మోసేశాడు. మొత్తానికి వీళ్లిద్ద‌రూ క‌ల‌సి,.. న‌వ్వులు పంచుతూ భ‌లే.. భ‌లే అనిపించేసుకొన్నారు.

క‌థేంటి?

 లక్కీ (నాని) ఓ సైంటిస్ట్‌. అంటే.. గొప్ప మేధావి అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. జ్ఞాప‌క శ‌క్తిలో ప‌ర‌మ‌వీక్‌. డైవెర్ష‌న్ అత‌ని జ‌బ్బు. ఒక విషయం గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు మ‌రో ఆలోచ‌న వ‌స్తు..  మొదటి విషయాన్ని  మరిచిపోతాడు. తల్లితండ్రులు (నరేష్,సితార) ల‌క్కీని పెళ్లి చేయలేక నానా తంటాలూ ప‌డుతుంటారు. అలా ల‌క్కీ క‌థ సాగుతూండ‌గా  నందన (లావణ్య త్రిపాఠీ) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే త‌న మ‌తిమ‌రుపు గురించి ఎక్క‌డ నంద‌న‌కు తెలిస్తే.. త‌న‌కు దూరం అవుతుందో అన్న భ‌యంతో తన మరుపు లోపాన్ని ఎప్పటికిప్పుడు కవర్ చేసుకుంటూ వస్తుంటాడు. అయితే నందన ఎవరో కాదు.. ఒక్కప్పుడు ల‌క్కీకి త‌న కూతుర్ని ఇవ్వ‌డానికి  తిరస్కరించిన పాండురంగారావు (మురళీ శర్మ) కూతురు. నంద‌న‌ని ప్రేమిస్తున్న‌ది ల‌క్కీనే అని ఆయ‌న‌కూ తెలీదు. పాండు రంగారావు ద‌గ్గ‌ర త‌న‌ని దాచుకొని, నంద‌న ద‌గ్గ‌ర త‌న మ‌తిమ‌రుపుని దాచుకోవ‌డానికి నానా పాట్లూ ప‌డుతుంటాడు ల‌క్కీ.
ఈలోగా  అజయ్ (అజయ్) అనే మ‌రో పాత్ర ఎంట‌ర్ అవుతుంది. అజ‌య్ ధ్యేయం నంద‌న‌ని పెళ్లి చేసుకోవ‌డ‌మే. ఈ ముగ్గురితో ల‌క్కీ, త‌న మ‌తిమ‌రుపు ఆడిన ఆట‌లే ఈ సినిమా.

* విశ్లేష‌ణ‌

ఈ సినిమాలో క‌థ చాలా చిన్న‌ది. ఆ మాట‌కొస్తే లైన్ త‌ప్ప క‌థేం లేదు. మ‌తిమ‌రుపు అనే అంశం చుట్టూ సీన్లు రాసుకొన్నారంతే. అందులోంచి పండిన వినోదం, అందులోంచి పుట్టిన క‌న్‌ఫ్యూజ‌న్‌, అందులోంచి పుట్టిన డ్రామా, అందులోంచే పుట్టుకొచ్చిన ఎమోష‌న్స్ త‌ప్ప ఈ సినిమాలో ఇంకేం లేవు. అయితే ఫ‌స్ట్ సీన్ నుంచి చివ‌రి వ‌ర‌కూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని మిక్స్ చేస్తూ వెళ్ల‌డం వల్ల అస్స‌లేమాత్రం బోర్ కొట్ట‌కుండా చేశాడు మారుతి. ఈ సినిమా స‌క్సెస్ కి ప్ర‌ధాన‌మైన కార‌ణం అదే!  నాని పాత్ర‌ని మ‌ల‌చుకొన్న విధానం, ఆ పాత్ర‌లోంచి పండించిన కామెడీ భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌కి శ్రీ‌రామ ర‌క్ష‌. ఎంత‌సేపూ ఒకే లైన్ ప‌ట్టుకొని తిరిగినా.. ఆ విష‌యం ప్రేక్ష‌కుల‌కు తెలీయ‌కుండా త‌న న‌వ్వుల‌తో మాయ చేశాడు. ల‌క్కీ పాత్ర త‌న మ‌తిమ‌రుపుతో చేసిన త‌ప్పులు, దాన్ని క‌వ‌ర్ చేసుకొనే విధానం, రోడ్డుమీద అడుక్కుతినేవాడ్ని నా త‌మ్ముడు అని చెప్పి.. హీరోయిన్ ద‌గ్గ‌ర డాన్స్ నేర్పించ‌డానికి ప‌డిన పాట్లు, సెకండాఫ్‌లో నాని, వెన్నెల కిషోర్‌ల మ‌ధ్య న‌డిచిన క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామా ఇవ‌న్నీ... సినిమాని న‌డిపించేశాయి. ఫ‌స్టాఫ్ ఫాస్ట్ ఫాస్ట్‌గా లాగించేసిన మారుతి.. సెకండాఫ్‌లోకొచ్చేస‌రికి నెమ్మ‌దించాడు. శ్రీ‌శైలం టూర్ అంతా సాగ‌దీసిన‌ట్టు అనిపించింది. క్లైమాక్స్‌లో గొప్ప మ‌లుపులేం లేకుండా ఫ్లాటుగా రాసుకొన్నాడు. అయితే అక్క‌డ‌క్క‌డ పండిన న‌వ్వులు సెకండాఫ్‌నీ గ‌ట్టెక్కించేశాయి. మొత్తానికి ఈ సినిమాని ఓ టైమ్ పాస్ మూవీగా మార్చేశాయి.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఈ సినిమాకి మెయిన్ పిల్ల‌ర్ నాని. త‌న బాడీ లాంగ్వేజ్‌, టైమింగ్‌తో అద‌ర‌గొట్టేశాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఒంటి చేత్తో సినిమాని న‌డిపించేశాడు.త‌న కామెడీ టైమింగ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. చిన్న సీన్‌నీ త‌నదైన శైలిలో ఎలివేట్ చేశాడు. చివ‌ర్లో డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర సీన్‌.. లో ఎమోష‌న్స్‌ని బ‌య‌ట‌కు తీసుకొచ్చాడు. లావ‌ణ్యకీ మంచి మార్కులు ప‌డ‌తాయి. అందాల రాక్ష‌సి అంత గొప్ప‌గా కాక‌పోయినా.. త‌న వంతు సాయం చేసింది. ముర‌ళీ శ‌ర్మ తండ్రి పాత్ర‌కు బాడ్ ఛాయిస్ అనే చెప్పాలి. ఏదో కొత్త‌గా ఉంటుంద‌ని విల‌న్ పాత్ర‌లు చేస్తున్న ముర‌ళీ శ‌ర్మ‌ని ట్రై చేసుకొంటారు. రోటీనే అయినా.. రావు ర‌మేష్‌ని ఎంచుకొని ఉంటే ఈ సినిమా రేంజు మ‌రోలా ఉండేది. అజ‌య్ ఫ‌ర్వాలేదు. వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ కాసేపు న‌వ్వించారు. శంక‌ర్ దాదా కేర‌మ్ బోర్డ్ స్నూఫ్ మాత్రం ప‌ర్‌ఫెక్ట్‌గా వాడుకొన్నారు ఈ సినిమాలో.
* టెక్నిక‌ల్‌గా..

సినిమా చాలా రిచ్‌గా ఉంది. నిర్మాత‌లు బాగా ఖ‌ర్చు పెట్టార‌న్న సంగ‌తి కెమెరామెన్ త‌న ప‌నిత‌నంతో చెప్పేశారు. గోపీ సుంద‌ర్ ఇచ్చిన పాట‌లు, ఆర్‌.ఆర్‌.. సూప‌ర్బ్‌. సీన్ ని ఓ లెవిల్‌కి తీసుకెళ్ల‌డంలో నేప‌థ్య సంగీతం ఎంత కీల‌క‌మో ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడిగా మారుతి త‌న ముద్ర‌ని చెరిపేసుకొనే ప్ర‌య‌త్నంలో మ‌రో ప‌ది అడుగులు ముందుకేశారు. త‌న బ‌లం. వినోదం.. దాన్ని బ‌లంగా చూపించారిందులో. సెకండాఫ్ విష‌యంలోనూ కాస్త శ్ర‌ద్ధ పెట్టుంటే ఇంకొంచెం మంచి ఫ‌లితం వ‌చ్చుండేది.

మ‌తిమ‌రుపు మ‌నిషి చుట్టూ పండించిన ఈ డ్రామాలో వినోదం పండింది. మ‌ర్చిపోలేనంత గొప్ప సినిమా కాక‌పోయినా.. ఒక్క‌సారి చూసి హాయిగా న‌వ్వుకోవాల్సిన సినిమా ఇది.

రేటింగ్ 3

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.