బుడ్డోడ్ని ఓ ఆటాడిస్తున్న బుడ్డోడు
on Aug 31, 2016
రికార్డులతో ఓ ఆటాడుకొనే హీరో.. ఎన్టీఆర్. సినిమాలో విలన్లతో చెడుగుడు ఆడుకొనే హీరో.. ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌ని ఓ బుడ్డోడు తెగ ఆడించేస్తున్నాడు. తనెవరో కాదు. జూనియర్‌కి జూనియర్.. అభయ్‌రామ్. ఎన్టీఆర్ ముద్దుల తనయుడు అభిరామ్ ఒట్టి అల్లరి పిడుగట. చెప్పిన మాట వినడం లేదట. తన అల్లరికి ఆకాశమే హద్దని ఎన్టీఆర్ మురిసిపోతున్నాడు. మట్టిలో ఆడుకోవద్దంటే.. తననే తిరిగి కొడుతున్నాడట. ఆ దెబ్బలు కాస్త గట్టిగానే తగులుతున్నాయని ముసిముసిగా నవ్వుతూ చెబుతున్నాడు ఎన్టీఆర్. చిన్నప్పుడు తాను కూడా ఇలానే అల్లరి చేసేవాడట. అప్పట్లో అమ్మ ఎంత ఇబ్బంది పడిందో.. ఇప్పుడు నాకు తెలిసొచ్చిందంటున్నాడు ఎన్టీఆర్. నాన్న అయితే ప్రపంచమే మారిపోతుందని అందరూ చెప్పేవారని, ఇప్పుడు అది అనుభవంలోకి వచ్చిందని మురిసిపోతున్నాడు ఎన్టీఆర్. అభయ్‌తో ఆడుకొంటుంటే సమయమే తెలియడం లేదని, ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలడం లేదని అంటున్నాడు. తనకు వీలైనంత సమయం అభయ్‌తో ఆడుకోవడానికి కేటాయిస్తున్నాడట. ఇప్పుడే అభయ్ ఇంత అల్లరి చేస్తున్నాడంటే.. పెద్దయ్యాక ఇంకెలా ఉంటాడో?