'ఒకే ఒక జీవితం' చూసి కంటతడి పెట్టిన నాగార్జున!
on Sep 7, 2022
శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఒకే ఒక జీవితం'. సినిమాకి కీలకమైన శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తల్లీకొడుకుల బంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న(మంగళవారం) రాత్రి సినీ ప్రముఖులు, సన్నిహితుల కోసం ప్రత్యేక షో వేశారు. అయితే ఈ మూవీ చూసి అక్కినేని నాగార్జున కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో 'ఒకే ఒక జీవితం' స్పెషల్ షో వేశారు. ఈ షోకి నాగార్జున, అఖిల్ తో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు దర్శకులు హాజరయ్యారు. సినిమా చూస్తూ నాగార్జున, అఖిల్ ఎమోషనల్ అయ్యారట. ముఖ్యంగా తల్లీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు చూసి కంటతడి పెట్టినట్టు సమాచారం. అమల నటనకు, సినిమాకు ముగ్దుడైన నాగ్ తన భార్య అమలను ఆనందభాష్పలతో హత్తుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా చాలా బాగుందని టీమ్ కి అభినందించిన నాగ్.. హీరో శర్వా నటనను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలుస్తోంది.
స్పెషల్ షో చూసిన వారంతా 'ఒకే ఒక జీవితం' బాగుందని ప్రశంసిస్తున్నారు. మరి చాలాకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శర్వా.. ఈ చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బెజాయ్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ సారంగ్, ఎడిటర్ గా శ్రీజిత్ సారంగ్ వర్క్ చేశారు.
Also Read