లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు: నాగశౌర్య
on Dec 27, 2019
"నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చిరాకు. ఆ ఇమేజ్ నుండి బయటకు వచ్చి రఫ్ గా ఉండే ఈ క్యారెక్టర్ చేశా. నాకు ఇలాగే ఉండడం ఇష్టం" అని 'అశ్వథ్థామ' టీజర్ లాంచ్ కార్యక్రమంలో యువ హీరో నాగశౌర్య అన్నాడు. 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్య', 'ఒక మనసు', 'కళ్యాణ వైభోగమే', 'జ్యో అచ్యుతానంద', 'ఛలో' సినిమాలు నాగశౌర్యకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చాయి.
'అశ్వథ్థామ' టీజర్ చూస్తుంటే... అతడికి యాక్షన్ ఇమేజ్ తెచ్చిపెట్టేలా ఉంది. ముఖ్యంగా 'కెజిఎఫ్'కు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన అన్బరివు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. యాక్షన్ కట్స్ చాలా బావున్నాయి. అయితే... యాక్షన్ ఇమేజ్ కోసం ఇంతకుముందు నాగశౌర్య ప్రయత్నం చేయలేదని కాదు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని చేసిన 'జాదూగాడు' ప్లాప్ అయింది. ఈసారి మాత్రం 'అశ్వథ్థామ'తో శౌర్య సక్సెస్ కొట్టేలా ఉన్నాడు.
'అశ్వథ్థామ' టీజర్ విడుదల కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ "ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. ఢిల్లీ, ముంబైలో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ కథ రాశా. 'ఛలో'కీ నేను కథ రాశా. కానీ, పేరు వేసుకోలేదు. సాధారణంగా నాకు కథలు రాయడం... చెప్పడం ఇష్టం. అమ్మాయిలకు రక్షణ లేదనీ, అందరూ బాగుండాలనీ ఈ సినిమా చేశాం. నా కథను నేను అనుకున్నట్టు దర్శకుడు రమణ తేజ చక్కగా తెరకెక్కించాడు. నా తల్లితండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను. ప్రేక్షకులకి తప్పకుండా సినిమా నచ్చుతుంది" అని అన్నారు.