అసలుసిసలు సెలబ్రేషన్.. ఆస్కార్ గెలిచిన 'నాటు నాటు'
on Mar 12, 2023

'ఆర్ఆర్ఆర్' చిత్రం చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ప్రపంచ సినిమాలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచినప్పటి నుంచే ఈ పాట ఖచ్చితంగా అవార్డు గెలుచుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆస్కార్ గెలిచిన మొదటి పాట ఇదే కావడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఎంతటి ఆదరణ లభించిందో.. ఇందులోని 'నాటు నాటు' పాటకు అంతకుమించిన ఆదరణ లభించింది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచ నలుమూలల్లో 'నాటు నాటు' పాట మారుమోగిపోయింది. ఈ సాంగ్ ఆస్కార్ గెలుస్తుందని హాలీవుడ్ ప్రముఖులు సైతం భావించారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సాంగ్ ఆస్కార్ గెలిచి సంచలనం సృష్టించింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



