ENGLISH | TELUGU  

ఎన్.జి.కె సినిమా రివ్యూ

on May 31, 2019


నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, పొన్నవన్ తదితరులు

పాటలు: చంద్రబోస్, రాజేష్ ఎ. మూర్తి

సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్ 

సంగీతం: యువన్ శంకర్ రాజా 

నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు (తమిళ్), కె.కె. రాధామోహన్ (తెలుగు విడుదల) 

కథ, దర్శకత్వం: సెల్వ రాఘవన్ 

విడుదల తేదీ: మే 31, 2019


'7/జి బృందావన కాలనీ', 'యుగానికి ఒక్కడు', 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో సెల్వ రాఘవన్‌కి అభిమానులు ఏర్పడ్డారు. సూర్య సంగతి చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా 'ఎన్.జి.కె'. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.


కథ:

గోపాలం అలియాస్ నందగోపాలకృష్ణ (సూర్య) ఎంటెక్ గ్రాడ్యుయేట్‌. అగ్రికల్చర్ కూడా చదివాడు. ఆర్గానిక్ వ్యవసాయంతో గ్రామాన్ని, రైతులను అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటాడు. గోపాలం ప్రయత్నాలకు వడ్డీ వ్యాపారులు, రైతుల నుంచి కాయగూరలను కొని ఇతరులకు అమ్మేవారు, తెర వెనుక రాజకీయ నాయకులు అడ్డు తగులుతారు. సహాయం కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరకు వెళతాడు. 'నీకు సహాయం చేస్తే... ప్రతిఫలంగా నాకు ఏం చేస్తావ్' అని ఎమ్మెల్యే అడగటంతో ప్రతిపక్ష పార్టీలో చేరతాడు. ప్రతిపక్ష పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, చివరకు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే స్థాయికి చేరుకుంటాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి? అతడికి వనిత (రకుల్ ప్రీత్ సింగ్) ఎటువంటి సహాయం చేసింది? ఆమెతో అతడికి ఉన్న సంబంధం ఏంటి? భార్య గీతాకుమారి (సాయి పల్లవి) పాత్ర ఏమిటి? రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది సినిమా. 


ప్లస్ పాయింట్స్:

హీరో హీరోయిన్ల కాంబినేషన్

యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం


మైనస్ పాయింట్స్:

కథ, కథనం, దర్శకత్వం

సాగదీత

రొటీన్ రాజకీయాలు


విశ్లేషణ:

ఓ సామాన్య వ్యక్తి రాజకీయ శక్తిగా ఎలా ఎదిగాడనే కథతో ఇప్పటివరకూ భారతీయ తెరపై చాలా సినిమాలు వచ్చాయి. 'ఎన్.జి.కె' సదరు సినిమాలకు విభిన్నంగా, కొత్తగా ఏమీ లేదు. రాజకీయ నాయకుల స్వలాభం, స్వార్థం... కొత్తగా ఎవరైనా రాజకీయ శక్తిగా ఎదుగుతుంటే అణిచివేయడంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య లాలూచి... ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో హీరో... ఇతరత్రా రొటీన్ వ్యవహారాలతో సినిమా సాగుతుంది. సెల్వ రాఘవన్ డిఫరెంట్ టేకింగ్ ట్రై చేశాడంతే. కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కిస్తే... మెజార్టీ సన్నివేశాలను సాగదీశాడు. ఇంటర్వెల్ ఎప్పుడొస్తుంది? క్లైమాక్స్ ఎప్పుడొస్తుంది? అని ఎదురుచూసేలా చేశాడు. 'సింగం' సినిమాల్లో ఫైట్స్ లా కాకుండా... యాక్షన్ సన్నివేశాలను సహజంగా తెరకెక్కించాడు. చాలా వరకు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు యువన్ శంకర్ రాజా. అతడి బాణీల్లో 'ప్రేమ... ఓ ప్రేమ' బావుంది. మిగతా పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కెమెరా వర్క్ డార్క్ టోన్‌లో సాగింది.


నటీనటుల పనితీరు:

'సింగం' సినిమాల్లో సూర్య అరుస్తూ డైలాగులు చెప్తే... 'మాస్ సినిమాల్లో ఇంతేలే' అని ప్రేక్షకులు సరిపెట్టుకున్నారు. 'ఎన్.జి.కె'లో అక్కడక్కడా సూర్య నటన చూస్తే... 'మరీ ఇలా చేశాడేంటి?' అని ఆలోచించడం మొదలు పెడతాడు. గౌతమ్ మీనన్, ఏఆర్ మురుగదాస్, విక్రమ్ కుమార్ వంటి దర్శకుల సినిమాల్లో సూర్య మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సెల్వ రాఘవన్ సినిమాలోనూ సూర్యలో సరికొత్త నటుడిని చూస్తామని ఆశపడిన ప్రేక్షకులకు నిరాశే కలుగుతుంది. 'అణిచివేసిన...' పాటలో, పలు సన్నివేశాల్లో సూర్య అతి చేశాడు. బహుశా... సెల్వ రాఘవన్ ప్రభావం అనుకుంట! ఎమోషనల్ సన్నివేశాల్లో ఒదిగి నటించాడు. నటుడిగా సూర్యకు పరీక్ష పెట్టే పాత్ర కాదిది. మంచి నటిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న సాయి పల్లవి నటన సైతం ఆశ్చర్యపరుస్తుంది. భర్త మరో మహిళకు దగ్గరయ్యాడనే విషయాన్ని, అతడి నుంచి వచ్చే పెర్‌ఫ్యూమ్ వాస‌న‌ ద్వారా భార్య పసిగడుతుంది. ఈ సన్నివేశాన్ని సెల్వ రాఘవన్ తెలివిగా రాశాడు. ఏ భార్య అయినా తన భర్త మరో మహిళకు దగ్గరైతే తట్టుకోలేదు. ఆమెలో ఆవేశం ఆకాశాన్ని చేరుతుంది. అయితే... ఆ సన్నివేశాలను సెల్వ రాఘవన్ తెరకెక్కించిన తీరు అతిగా ఉంది. కళ్ళు పెద్దవి చేసుకుని సాయి పల్లవి భర్త మీద అరుస్తుంటే ఆశ్చర్యపోవడం థియేటర్లో ప్రేక్షకుల వంతు అవుతుంది. అలాగే, 'మరో మహిళతో నాకు సంబంధం ఉంది. అయితే ఏంటి?' అని భర్త నేరుగా ప్రశ్నించే సరికి ఏమీ చేయలేని భార్య నిస్సహాయతను చక్కటి రాసినప్పటికీ... తెరకెక్కించలేకపోయాడు సెల్వ రాఘవన్. రకుల్‌ సెటిల్డ్ ఫ‌ర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్టు ఆమె డ్రస్సింగ్ స్టైల్ కుదిరింది. సూర్య, రకుల్ మధ్య పాట 'ప్రేమ ఓ ప్రేమ' చిత్రీకరణ బాగుంది. వాడుక పదాలతో చంద్రబోస్ చక్కటి సాహిత్యం అందించారు. అయితే... రకుల్ పాత్ర 'నేనే రాజు నేనే మంత్రి'లో కేథరిన్ పాత్రకు దగ్గర దగ్గరగా ఉంటుంది. మిగతా నటీనటుల్లో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచినవారు ఎవరు లేరు. 

 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

రాజకీయ నేపథ్యంలో రొటీన్ కథతో రూపొందిన గందరగోళ చిత్రమిది. అక్కడక్కడా కొన్ని మెరుపులు తప్ప  సినిమాలో మైమరపులు తక్కువే. హీరో హీరోయిన్ల కాంబినేషన్ సినిమాకు ప్లస్.

రేటింగ్: 2.50


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.