కంఠం కంచు.. మనసు మంచు!
on Mar 19, 2015
.jpg)
ఆయన మాట బుల్లెట్టులా దూసుకొస్తుంది!
డైలాగు.. మందుపాతరలా పేలుతుంది.
కోపం ముక్కుమీద తిష్ట వేసుకొని కూర్చుంటుంది
పౌరుషం మీసంపై మెరుస్తుంటుంది.. ఇంకెంవరూ.. ఆయనే మోహన్‌బాబు.
`కంచు` ఆయన కంఠం.. `మంచు` ఆయన మనసు పేరు.
చూడ్డానికి రగులుతున్న అగ్నిగోళంలా కనిపిపించినా... తాకితే ఆయన `మంచు` ముక్కని తెలుస్తుంది. క్రమశిక్షణ ఆయుధంగా, మాటపై కట్టుబడి ఉండడమే తన ఆభరణంగా దశాబ్దాలుగా తెలుగు చలన చిత్రరంగంలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకొన్నారు మోహన్ బాబు.
ఆరడగులు ఎత్తు... ధనధనధన మాట్లాడే తీరు, ఎన్టీఆర్ తరవాత ఆ రేంజులో డైలాగులు పలికే ఒకే ఒక్క నటుడు. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి?? అందుకే మోహన్‌బాబు పరిశ్రమకు కావాల్సిన అత్యంత కీలకమైన నటుడిగా మారారు. బుల్లి బుల్లి పాత్రలు... సైడ్ విలన్, విలన్, అన్నయ్య, తమ్ముడు, బామ్మర్ది - ఓహ్.. మోహన్ బాబు పరకాయ ప్రవేశం చేయని వేషం లేదు.
చినుకు చినుకు వానైనట్టు, వాన వరదై పొంగినట్టు.. చిన్న చిన్న పాత్రలతోనే తన కెరీర్‌ని నిర్మించుకొంటూ ముందుకువెళ్లాడు.లేటు వయసులో హీరో అయినా - అక్కడా అదే విజృంభణ. ఒకటా రెండా...?? 520 సినిమాలు. ప్రతి పాత్రలోనూ తనదంటూ ఓ ముద్ర సృష్టించుకొంటూ, తన ప్రత్యేకత నిలబెట్టుకొంటూ.. డైలాగ్ కింగ్‌గా అవతరించాడు.
పరిశ్రమలో క్రమశిక్షణ ఉండదు అంటుంటారు. కానీ.. ఆ మాట కూడా మోహన్ బాబు ముందు తల వంచుకొంటుంది. మోహన్ బాబు సెట్లో ఉంటే... ఎవ్వరూ... టైమ్ సెన్స్ తప్పరు, ఎందుకంటే ఆయన తప్పనివ్వరు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థలో సినిమా అంటే.. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొంటారు. కారణం... మోహన్ బాబు. అయితే అతిథి మర్యాదలకూ, నటీనటులు సాంకేతిక నిపుణులకూ ఆయన ఇచ్చే గౌరవం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మోహన్‌బాబు మాటంటే మాటే. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం ఆయనది. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇవే మోహన్ బాబుకి ప్రత్యేకత ఆపాదించి పెట్టాయి. అల్లుడుగారు, మేజర్ చంద్రకాంత్, అల్లరి మొగుడు, పెదరాయుడు, రౌడీ గారి పెళ్లాం, బ్రహ్మ.... ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు మోహన్‌బాబు ఖాతాలో ఉన్నాయి. నిర్మాతగా 50 చిత్రాలు నిర్మించి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ని ఉత్తమమైన నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు.
కథానాయకుడిగా సినిమాలు తగ్గించిన మోహన్ బాబు.. ఇప్పుడు తనయుల విజయాలను మనసారా ఆస్వాదిస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ... ఫామ్‌లో ఉన్నారు. దాంతో పాటు లక్ష్మీ ప్రసన్న కూడా తనకంటూ ఓ స్థానం సంపాదించుకొంది. అయితే మోహన్ బాబు అప్పుడప్పుడూ తన స్థాయికి తగిన పాత్ర దొరికినప్పుడు మాత్రం మెరుస్తూనే ఉన్నారు. పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ..చిత్రాలతో ఆయన మరోసారి తన అభిమానుల్ని మెప్పించారు. ప్రత్యేక పాత్రలకు, ప్రతినాయకుడిగా నటించడానికి మోహన్ బాబు ఒప్పుకొంటే `బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై` లాంటి సినిమాల్లో నటించడానికి ముందుకొస్తే... మోహన్ బాబు లాంటి కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టు.. తెలుగు నాట మరొకరు కనిపించరు. కానీ.. తన దగ్గరకు అలాంటి అవకాశాలు వస్తున్నా సున్నితంగా `నో` చెబుతున్నారు మోహన్ బాబు. ప్రస్తుతం శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్ని మరింత ముందుకు తీసకెళ్లాలన్న లక్ష్యం వైపు దృష్టి నిలిపారు. కలెక్షన్ కింగ్ మరిన్ని మంచి పాత్రలతో మనల్ని అలరించాలని, ఆయన అనుకొన్న లక్ష్యాల్ని చేరుకోవాలని.. మనసారా కోరుకొంటూ..
(ఈరోజు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



