మంత్రి పేర్ని నాని నుంచి పిలుపు.. అయినా తగ్గేదేలే అంటున్న ఆర్జీవీ!
on Jan 8, 2022

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను తగ్గించడంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్ సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సినిమా చూడటం అనేది ప్రేక్షకుల ఛాయిస్, వాళ్ళకి నచ్చితే టికెట్ కొంటారు, దాని రేట్ ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు వర్షం కురిపించారు.
ఇలా పేర్ని నానిపై వరుస ట్వీట్స్ తో విరుచుకుపడిన ఆర్జీవీ.. కొసమెరుపుగా 'ప్రభుత్వం తో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు. మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంభందించిన వివరణ ఇస్తాను' అన్నారు. ఆ సమయంలో 'తప్పకుండ త్వరలో కలుద్దాం' అని చెప్పిన పేర్ని నాని.. తాజాగా ఆర్జీవీని కలవడానికి ఓకే చెప్పారు. ఈ విషయాన్ని తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

"జనవరి 10 న అమరావతి సచివాలయంలో కలిసి చర్చించడానికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి నన్ను ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏపీ మూవీ టికెట్ ధరల సమస్య పరిష్కారం కోసం మీరు చూపిన చొరవకు ధనవ్యవాదాలు పేర్ని నాని గారు" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
.webp)
ఆర్జీవీ మంత్రి పేర్ని నానితో చర్చించడానికి వెళ్తున్నారు, ఇక వివాదం ఓ కొలిక్కి వస్తుంది అనుకుంటున్న సమయంలో ఆర్జీవీ మరో ట్వీట్ తో సంచలనం సృష్టించారు. "సినిమాలతో పాటు థీమ్ పార్కులు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు మొదలైనవి కూడా వినోద సంస్థల క్రిందకు వస్తాయి. వాటి టికెట్ ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించలేదు" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఓ వైపు ప్రభుత్వం చర్చలకు పిలిచింది అంటూనే, మరోవైపు టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యి ఆర్జీవీ ఈ సమస్యకి సొల్యూషన్ తీసుకొస్తారో లేక మరేదైనా సంచలనం సృష్టిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



