Maro Prapancham Review: ఈటీవీ విన్ 'మరో ప్రపంచం' మూవీ రివ్యూ
on Dec 28, 2025

తారాగణం: వెంకట్ కిరణ్ కోకా, సురయ్యా పర్వీన్, యామిన్ రాజ్, అక్షిక విద్వత్, శ్రీనివాస్ సాగర్
డీఓపీ: సురేష్ గొంట్లా
సంగీతం: శాండీ అద్దంకి, పీవీఆర్ రాజా
ఎడిటింగ్ & వీఎఫ్ఎక్స్: మణిరత్నం పెండ్యాల
రచన, దర్శకత్వం: కిలారు నవీన్
నిర్మాత: వెంకటరత్నం
బ్యానర్: చక్ర ఇన్ఫోటైన్మెంట్
ఓటీటీ: ఈటీవీ విన్
ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఈటీవీ విన్ లో 'మరో ప్రపంచం' అనే సినిమా విడుదలైంది. రెండు మూడేళ్ళ క్రితం తెరకెక్కిన ఈ మూవీ.. ఆలస్యంగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. పారలెల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే..? (Maro Prapancham Movie Review)
కథ:
కాఫీ మొక్కలపై రీసెర్చ్ కోసం ఆదిత్య(వెంకట్ కిరణ్) ఒక ఫారెస్ట్ కి వెళ్తాడు. ట్రిప్ అడ్వెంచరస్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆదిత్యతో పాటు.. అతని గర్ల్ ఫ్రెండ్ నక్షత్ర(సురయ్యా పర్వీన్), ఫ్రెండ్స్ ఆకాష్, వసుధ, చందు (యామిన్ రాజ్, అక్షిక విద్వత్, శ్రీనివాస్ సాగర్) కూడా వెళ్తారు. అయితే అది డేంజరస్ ఫారెస్ట్. గతంలో అక్కడికి వెళ్లి వచ్చిన వారు.. గతాన్ని మర్చిపోయి వింతగా ప్రవర్తించేవారు. అలాంటి చోటుకి వెళ్లిన ఈ ఐదుగురికి ఎలాంటి ఆపద ఎదురైంది? పారలెల్ యూనివర్స్ లోని తమ లాంటి మనుషులను కలిసిన తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? నక్షత్రను వెంటాడుతున్న గతం ఏంటి? ఆమెకు ఎవరి వల్ల హాని ఉంది? నక్షత్రను ఆ హాని నుండి కాపాడి, ఆదిత్య ఆమెను సొంతం చేసుకోగలిగాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
తెలుగులో పారలెల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో సినిమాలు రావడం చాలా అరుదు. పైగా, రెండు మూడేళ్ళ క్రితం ఈ తరహా కాన్సెప్ట్ తో కొత్త వాళ్ళతో సినిమా చేయడానికి సాహసించడం అభినందించదగ్గ విషయం. అయితే కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయాలన్న దర్శకుడు ఆలోచన బాగుంది కానీ, దానిని ఆచరణలో పెట్టడానికి తగిన వనరులు ఉన్నాయా లేదా? అనేది మాత్రం చూసుకోలేకపోయారు.
పారలెల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అంటే.. భారీతనంతో కూడిన వీఎఫ్ఎక్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ, బడ్జెట్ పరిమితుల కారణంగా ఇందులో ఆ భారీతనం ఎక్కడా కనిపించదు. ఒకట్రెండు వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నప్పటికీ.. అవి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చే స్థాయిలో లేవు.
'మరో ప్రపంచం' మూవీ ప్రారంభ సన్నివేశాలు ఏమాత్రం ప్రభావవంతంగా లేవు. ఐదుగురు స్నేహితులు జిప్సీలో అడవికి వెళ్లే సీన్స్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. రెండు జంటల మధ్య ఒక సింగిల్ నలిగిపోతే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కామెడీని పండించే ప్రయత్నం చేశారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. పైగా స్టార్టింగ్ సీన్స్ లో రొమాన్స్, ఎక్స్ పోజింగ్ కారణంగా.. ఇది నిజంగా సైన్స్ ఫిక్షన్ సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది.
అయితే సినిమా ముందుకు వెళ్ళేకొద్దీ.. హ్యాండ్ బ్యాండ్ కలర్స్ తో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, జంటలు మారిపోయాయని కమెడియన్ కన్ఫ్యూజ్ అవ్వడం వంటి సీన్స్ తో.. నెక్స్ట్ ఏం జరగనుందనే క్యూరియాసిటీని కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక పారలెల్ యూనివర్స్ కాన్సెప్ట్ మొదలయ్యాక సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది.
తమ ఐదుగురిని పోలినట్టుగా ఉన్న.. మరో రెండు ప్రపంచాలకు చెందిన వ్యక్తులను వారు కలుసుకోవడం. వారిలో మంచివారు, చెడ్డవారు ఉండటం. ఒకరి వల్ల మరొకరికి ఆపదలు రావడం. ఈ ఆపదల నుండి బయటపడి ఎవరి ప్రపంచడానికి వారు వెళ్ళారా? అనే కోణంలో ప్రధానంగా సెకండ్ హాఫ్ నడిచింది.
బడ్జెట్ పరిమితుల కారణంగా చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. చాలా సీన్స్ ని విజువల్ గా కంటే డైలాగ్స్ తోనే ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించారు. ఆ డైలాగ్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. అలాగే, లాజిక్స్ వదిలేస్తేనే ఈ సినిమా చూడగలం. పక్క రూమ్ లోకి వెళ్ళి వచ్చినంత తేలికగా వేరే ప్రపంచానికి ఎలా వెళ్తున్నారు? వేరు వేరు ప్రపంచంలో ఉన్న వారు కూడా ఒకే లాంటి డ్రెస్ ఎలా వేసుకున్నారు? అందరికీ హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి లాజిక్స్ ని ఆలోచిస్తే సినిమా అసలు చూడలేం.
నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చే మెయిన్ ప్లస్ పాయింట్. 1 గంటా 45 నిమిషాల నిడివే కనుక, ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే స్టార్టింగ్ లో రొమాంటిక్ సీన్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంత ఇబ్బంది పడవచ్చు.
ప్రధాన తారాగణం బాగానే నటించినప్పటికీ.. కొత్త ముఖాలు కావడంతో.. ఆ పాత్రలతో ఆడియన్స్ ట్రావెల్ కావడానికి కాస్త సమయం పడుతుంది. సాంకేతిక విభాగాల పనితీరు పరవాలేదు.
ఫైనల్ గా..
స్టార్టింగ్ సీన్స్ ని భరించగలిగితే.. పరిమిత వనరులతో ఒక కొత్త కంటెంట్ చెప్పాలని మూవీ టీమ్ చేసిన ప్రయత్నాన్ని ప్రోత్సహించడం కోసం.. ఒకసారి చూడొచ్చు. పారలెల్ యూనివర్స్ కాన్సెప్ట్, సైన్స్ ఫిక్షన్ జానర్ అనే అంచనాలతో చూస్తే మాత్రం.. నిరాశ చెందుతారు.
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



