ENGLISH | TELUGU  

మ‌న్మ‌థుడు వ‌రించేది ఎవ‌రినో..?!

on Mar 23, 2015

చిత్ర‌సీమ‌... ఓ విచిత్ర‌సీమ‌. సీజ‌న్ ని బ‌ట్టి జాత‌కాలు మారుతుంటాయి. ఓ యేడాది ఒక‌రికి బాగుంటుంది. మ‌రో యేడాది ఇంకొక‌రికి హిట్లిస్తుంది. క్యాలెండ‌ర్ మారితే.. జీవితాలు మార‌తాయ‌న్న ఆశ కొంద‌రికి. ఉగాది.. తెలుగువాళ్లంద‌రికీ కొత్త ప్రారంభం! ఆశ‌ల‌కు, ఆశ‌యాల‌కూ.. ఈ రోజే నాంది ప‌లుకుతారు. ఉగాది అంటే మ‌రో కొత్త తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన‌ట్టే. మ‌న్మ‌థ నామ సంవ‌త్స‌రంలో త‌మ ప్ర‌తాపం చూపించాల‌ని చాలామంది క‌థానాయిక‌లు ఆశ‌ల ప‌ల్ల‌కిలో విహ‌రిస్తున్నారు. మ‌రి ఈ యేడాది టాలీవుడ్‌లో ఎవ‌రి జాత‌కం ఎలా ఉండ‌బోతోంది. మ‌న్మ‌థుడు ఎవ‌రిని వ‌రించ‌బోతున్నాడు? ఈ ఉగాది ఎవ‌రికి శుభం చేకూరుతుంది? ఒక్క‌సారి లుక్కేస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి..

అగ్ర క‌థానాయ‌కు చుట్టూనే ప‌రిశ్ర‌మ తిరిగిన‌ట్టు.. అగ్ర క‌థానాయిక‌లూ ఇండ్ర‌స్ట్రీకి చాలా ముఖ్యం. అనుష్క‌, కాజ‌ల్‌, త‌మ‌న్నా, శ్రుతిహాస‌న్‌, స‌మంత‌... వీళ్ల చుట్టూనే ప‌రిశ్ర‌మ క‌ళ్లుంటాయి. ఓ టాప్ హీరో సినిమా మొద‌ల‌వుతుందంటే.. వీళ్ల పేర్లు స్మ‌రించుకోవాల్సిందే. తాజాగా ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, రాశీఖ‌న్నా, ఆదాశ‌ర్మ‌ల పేర్లూ త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. వీళ్లూ అగ్ర స్థానం కోసం పోటీ ప‌డుతున్న క‌థానాయిక‌లే. చిత్ర‌సీమ‌లో ప్ర‌స్తుతం ప‌దిమంది క‌థానాయిక‌ల హ‌వా న‌డుస్తుంది. క్రేజీ సినిమా మొద‌లైందంటే..క‌థానాయిక కోసం వీళ్ల‌ని దాటి ఆలోచించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ యేడాది వీళ్లంతా త‌మ ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.



భారీ చిత్రాల క‌థానాయిక‌గా అనుష్క పేరు తెచ్చేసుకొంది. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయిప్పుడు. అందులో ఒక్క‌టి క్లిక్ అయినా.. ఆమె కెరీర్ మ‌రింత స్పీడులో దూసుకుపోవ‌డం ఖాయం. సైజ్ జీరో కూడా ఇటీవ‌లే మొద‌లైంది. బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి రెండూ నెల రోజుల వ్య‌వ‌ధిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. త‌మిళంలోనూ సినిమాల‌తో బిజీగా ఉంది అనుష్క‌. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే.. ఈ యేడాది క‌చ్చితంగా అనుష్క‌దే. అందులో సందేహం లేదు. స‌మంత చేతిలో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి  సినిమా మాత్ర‌మే ఉంది. అయితే ఆ సినిమాపై అటు ప‌రిశ్ర‌మ‌లోనూ, ఇటు ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. అయితే తమిళంలో మాత్రం స‌మంత జోరు చూపిస్తోంది. కృష్ణ‌మూర్తితో హిట్టు కొడితే.. స‌మంత మ‌ళ్లీ ట్రాక్ ఎక్కేయ‌డం ఖాయం.



త‌మ‌న్నా రెండు సినిమాల‌తో బిజీగా ఉంది. బాహుబ‌లి విడుద‌లకు సిద్ధ‌మైతే, బెంగాల్ టైగ‌ర్ ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. త‌మ‌న్నా మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌న్నా - మ‌న్మ‌థ‌నామ సంవ‌త్స‌రంలో త‌డాఖా చూపించాల‌న్నా ఈ రెండు సినిమాలూ హిట్ అవ్వాల్సిందే. శ్రుతి హాస‌న్ మ‌హేష్ బాబు సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు హిందీలో ఊపిరి స‌ల‌ప‌ని సినిమాల‌తో బిజీగా ఉంది. మ‌రో హిట్టు ప‌డితే ఆమె కూడా టాప్ పొజీష‌న్‌లో చేర‌డం ఖాయం. కాజ‌ల్ మాత్రం ఉత్త చేతుల‌తో ఉస్సూరుమ‌ని కూర్చుంది. టెంప‌ర్ హిట్ అయినా ఆమె కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. కాజ‌ల్ మ‌ళ్లీ త‌న స్థానం నిల‌బెట్టుకోవాలంటే అద్భుతాలు చేయాల్సిందే.  హ‌న్సిక కూడా తెలుగులో త‌న ప్ర‌భావం చూపించ‌లేక‌పోతోంది. త‌మిళ సినిమాతో స‌రిపెట్టుకొంటున్న హ‌న్సిక మ‌ళ్లీ టాప్ పొజీష‌న్‌లోకి రావాలంటే క‌ష్ట‌ప‌డాల్సిందే.  ల‌య‌న్‌తో త్రిష మ‌ళ్లీ ఫామ్ అందుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతోంది. ఆము చేతికి మ‌రో రెండు సినిమాలు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక న‌వ‌త‌రం క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ దుమ్ము దులుపుతోంది. ఆమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. నాలుగూ అగ్ర‌హీరోల‌తోనే. ర‌వితేజ‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్సులు అందుకొని అనూహ్యంగా టాప్ పొజీష‌న్‌కి వ‌చ్చేసింది. ఒక విధంగా ఈ యేడాది ఈ అమ్మాయిదే అంటున్నారంతా. రాశీఖ‌న్నా కూడా త‌న జిల్ చూపిస్తోంది. నిత్య‌మీన‌న్‌, ఆదాశ‌ర్మ‌, రాధికా ఆప్టే... వీళ్లు ఎప్పుడు ఎలా విజృంభిస్తారో తెలీదు. వీళ్ల‌కూ ఈ యేడాది హిట్లు ప‌డే అవ‌కాశాలున్నాయి. అయితే... ఈ యేడాదిలో కీల‌కం కాబోతున్న ఇద్ద‌రు క‌థానాయిక‌లు అనుష్క‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌. వీళ్లిద్ద‌రికే మ‌న్మ‌థుడు ద‌క్కే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఎందుకంటే ఇద్ద‌రి చేతుల్లోనూ క్రేజీ సినిమాలున్నాయి. వీళ్ల‌తో పాటు మిగిలిన క‌థానాయిక‌లూ మంచి విజ‌యాలు అందుకోవాలని, ప‌రిశ్ర‌మ ఈ మ‌న్మ‌థ‌నామ సంవ‌త్స‌రంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోవాల‌ని కోరుకొందాం..

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.