మహేష్ రేటు... రోజుకి కోటి!
on Feb 29, 2020
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. మామూలుగా ఒక్కో సినిమాకు మహేష్ రేటు రూ. 50 కోట్లు పలుకుతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ను ఆయన రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నారు. చిరంజీవి సినిమాకు మాత్రం ఇంచుమించు రూ. 30 కోట్లు తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. మెగాస్టార్ కోసమని ఆయనేమీ రెమ్యూనరేషన్లో రిబేటు ఇవ్వలేదు. సాధారణంగా ఒక్కో సినిమాకు తీసుకునేదానికంటే తగ్గించుకోలేదు. ఇంకా చెప్పాలంటే... ఎక్కువే తీసుకుంటున్నారు. హీరోగా మహేష్ ఓ సినిమా చేయాలంటే సుమారు 100 రోజులు షూటింగ్ చేయాలి. ఎంత తక్కువ వేసుకున్నా... వందలో మహేష్ దగ్గర దగ్గర 70 రోజులైనా షూటింగ్ చేయాలి. చిరంజీవి సినిమాకు ఆయన అన్ని రోజులు షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం పని 30 రోజుల్లో పూర్తి అవుతుంది. రోజుకి కోటి రూపాయల చొప్పున 30 రోజులకు రూ. 30 కోట్లు తీసుకుంటున్నారు. ఈ లెక్కన మహేష్ బాబుకు బాగా గిట్టుబాటు అయినట్టే.